History of Anantha PadmaNabhaswamy Temple : రాతి కొండల్లో అనంత పద్మనాభుడు

History of Anantha PadmaNabhaswamy Temple : రాతి కొండల్లో అనంత పద్మనాభుడు
x
అనంత పద్మనాభ స్వామి
Highlights

History of Anantha PadmaNabhaswamy Temple : అనంత పద్మనాభస్వామి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో...

History of Anantha PadmaNabhaswamy Temple : అనంత పద్మనాభస్వామి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మహిమాన్వితమైన అనంత పద్మనాభస్వామి ఆలయాలు రెండు ఉన్నాయి. అవికూడా స్వయంభువుగా వెలసిన పద్మనాభ ఆలయాలు. ఆ ఆలయాల్లో ఒక ఆలయం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కాగా. మరొ ఆలయం నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్‌లోని ఈ క్షేత్రము. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం మల్కాపూర్‌ అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి. ఈ ఆలయం ఇతర ప్రాంతాలలో ఉన్నట్టుగా కాకుండా భిన్నంగా మల్కాపూర్ గ్రామశివారులోని ఎత్తైన చెరువుగట్టుపై ఉన్న కొండపైన రాతి గుహల మధ్య ఉంది. ఈ దేవాలయం భక్తుల కొంగుబంగారంగా ఖ్యాతిగడిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్నది.

చారిత్రక ప్రాముఖ్యత

మూడున్నర శతాబ్ధాల పైగా చరిత్ర కలిగినది ఈ ఆలయము. చారిత్రక ఆధారాలను బట్టి వికారాబాదు లోని అనంత పద్మనాభస్వామి ఆలయ పూజారుల కుటుంబానికి చెందిన కోనమాచార్యులనే బ్రాహ్మణుడు నిజామాబాదు జిల్లాలోని మల్కాపూరు ప్రాంతంలో ఉండేవాడు. ఒకసారి విష్ణుమూర్తి ఆయనకు కలలో కనిపించి ఈ క్షేత్ర పాలకులు ఇక్కడికి వచ్చినపుడు తాను తెల్లని గుర్రం రూపంలో కనిపిస్తానని, ఆ గుర్రం పరుగులు తీస్తూ ఎక్కడ అంతర్థానం అవుతుందో అక్కడ తాను స్వయంభువుగా అవతరిస్తానని చెప్పాడు. ఒక రోజున ఆ ప్రాంత పాలకులైన గాంధారీ సంస్థానాధీశులు మల్కాపురము, గుండారం గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువు గట్టు పై ప్రయాణిస్తున్నపుడు తాము ప్రయాణిస్తున్న ఎడ్లబండి ఇరుసు విరిగి పోయింది. దాన్ని సరిచేసుకునే సమయానికి అక్కడికొచ్చిన కోనమాచార్యులు తనకు కలలో విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని చెప్పగా, అదే సమయంలో ఒక తెల్లని గుర్రం తమ ముందు పరుగులు తీయడం మొదలు పెట్టింది. కోనమాచార్యులు, సంస్థానాధీశులు ఆ గుర్రాన్ని వెంబడించారు.

ఆ గుర్రం మల్కాపూరు శివార్లలోని ఒక గుట్టల్లో ఉన్న ఓ గుహలోకి వెళ్లి అంతర్థానమై పోయింది. గుర్రాన్ని వెంబడించిన వారు ఆ గుహలో పరీక్షించి చూడగా, రాళ్లమధ్యలో ఒక సన్నని కాంతి ప్రసరిస్తున్నది. దానినే లక్ష్నీ అనంత పద్మనాభ స్వామి రూపంగా భావించి పూజలు చేయ నారంభించారు. కొన్నాళ్లకు సన్నని కాంతి రూపంలో ఉన్న ఆవెలుగు అమ్మవారి సహితంగా శంఖు చక్రాలతో భక్తులకు అనంత పద్మనాభ స్వామి దర్శనమిచ్చాడు. అది ఎత్తైన ప్రదేశం అయినందున స్వామి వారిని దర్శించుకోడానికి నిచ్చెనపైకి ఎక్కి చూడాలి. స్వామి వారికి పూజలు చేయడానికి పూజారులకు, దర్శనంకొరకు వచ్చిన భక్తులకు ఇది కొంత కష్టంగా ఉన్నందున ఆ గుహలోనే మరో ఆనంత శయన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు పాలకులు. ప్రస్తుతం వారు ఏర్పాటు చేసిన స్వామి వారి విగ్రహానికే పూజలు జరుగుతున్నాయి.

దినదినాభివృద్ధి చెందుతున్న స్వామి రూపం

మల్కాపూర్ గుట్టపై రాతి గుహల మధ్య కేవలం ఒక చిన్నపాటి బిందువు రూపంలో వెలసిన పద్మనాభస్వామి నిజరూపం అభివృద్ధి చెందుతున్నది. ప్రస్తుతం ఈ గుహలో శంఖుచక్ర సహిత లక్ష్మీఅనంతపద్మనాభస్మామి పూర్తిరూపం దర్శనమిస్తున్నదని ఆలయ అర్చకులు తెలిపారు. మొదట్లో ఈ గుహలో చిన్నపాటి బింధువు రూపంలో ఉన్న స్వామివారికి పూజలు చేయడానికి నిచ్చెన వేసుకొని దానిపై నిలబడి చేసేవారు. కానీ స్వామివారి రూపం పెరుగుతూ రావడంతోపాటు గుహభాగం సైతం పెద్దగా మారడంతో స్వామివారికి అలంకరణ, అభిషేకాలు చేయడానికి పూజారులు గుహలోకి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. గుట్టపై భాగంలో గుహల మధ్య వెలసిన స్వయంభువుతోపాటు గుహకింది భాగంలో భక్తులు పూజలు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక మూర్తులను చేయించి ప్రతిష్ఠించారు.

పూజలు ఇతర ఉత్సవాలు

ఈ అనంత పద్మనాభునికి ఏటా మాఘ బహుళ తదియ నుండి అష్టమి వరకు వారంరోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా పంచమి రోజున స్వామి వారి కల్యాణం, సప్తమి నాడు రథోత్సవం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను నాలుగు గ్రామాల వాళ్లు నిర్వహించడం విశేషం. ఒక ఏడాది ధర్మారం గ్రామవాసులు నిర్వహిస్తే తదుపరి ఏడాది లక్ష్మాపూరు, మల్కాపూరు, గ్రామస్థులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు పరిసర జిల్లాల నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోప తండాలుగా వస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి శనివారం, అన్నదానం నిర్వహిస్తారు.

ఈ ఆలయానికి ఎలా వెల్లాలి..

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కా పూర్ గ్రామమంలో ఈ ఆలయమున్నది. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్నందున రవాణా సౌకర్యాలు బాగా ఉన్నాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories