కామాసురునికి, మూకాసురుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

Mukambika Devi Temple in Karnataka
x
Highlights

ప్రకృతి అందాల నడుమ కొండ కోణల మధ్య వెలసింది అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ మూకాంబికా దేవి.

ప్రకృతి అందాల నడుమ కొండ కోణల మధ్య వెలసింది అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ మూకాంబికా దేవి. ఈ అమ్మవారి ఆలయంలో విశేషం ఏంటంటే ముగ్గురు అమ్మవార్లు ప్రతి రోజు పూజలనందుకుంటూ భక్తులకి దర్శనం ఇస్తారు. దేవతలను హింసించిన ఒక రాక్షసుడిని సంహరించి అమ్మవారు ఇక్కడ వెలిశారని, ఇంకా పరమశివుడు ఒక మహర్షి కోరిక ప్రకారం తానే స్వయంగా రూపుదిద్దిన ఒక పార్థివ లింగాన్ని ప్రసాదించాడని స్థల పురాణం చెబుతుంది. అసలు మరి ఆ మహర్షి ఎవరు? ఈ ఆలయం గొప్పతనం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలయ విషేశాలు:

కొల్లూరు లేదా కోల్లూర్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందపూర్ తాలూకాకు చెందిన పట్టణం. ఇది కుందాపురా తాలుకా నుంచి 40 కిలోమీటర్లు, శివమొగ్గ జిల్లా కేంద్రం నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న తల్లి మూకాంబికా అమ్మవారు. ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించటంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. పంచముఖ గణేశ ప్రతిమ అద్భుత శిల్ప నైపుణ్యంతో విరాజిల్లుతుంది.

కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాలలో కొల్లూరు ఒకటి. మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గొకర్ణ క్షేత్రాలు. అమ్మను దర్శించు కోవడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ఇక్కడి అటవీ సౌందర్యం వచ్చిన భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.


కామాసురునికి, మూకాసురుడు అనే పేరు ఎందుకు వచ్చింది:

శివుని వరం పొందిన కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించే వాడు. సప్తర్షులు, దేవతలను అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయాన్ని శుక్రాచార్యుడు కామాసురుడి చెవిన వేసారు. అతని చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. దీంతో వెంటనే ఆ రాక్షసులు శివుని అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేసాడు. అప్పుడు వెంటనే మహాశవుడు ప్రత్యక్షమై రాక్షసున్ని వరం కోరుకోమన్నాడు. కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించిన వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది. మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు అప్పటి నుంచి ఆ రాక్షసున్ని ''మూకాసురుడు'' అని పిలిచేవారు.

మూకాసురుని అంతం..

''కోల రుషి'' ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిగా సృష్టించింది. ఆ శక్తి మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. ఆ తరువాత మూకాసురుని ప్రార్ధన మన్నించి అతనికి కైవల్యం ప్రసాదించింది. అనంతరం మూకాసురుడు చనిపోవడానికి ముందు అమ్మవారిని మూకాంబికగా తనపేరు మార్చుకుని వెలసిల్లమని కోరుకొన్నాడు. ఆతడి కోరిక మేరకు అమ్మవారు కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది. ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.

మూకాంబికా ఆలయంలో అక్షరాభ్యాసం ఎందుకు చేస్తారు..?

మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగల వారై సంపన్నులు అవుతారని ప్రతీతి. పురాణాల ప్రకారం మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసే "పంచకడ్జాయం' అనే ప్రసాదం పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత, ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కుని ఆ ప్రసాదాన్ని తిన్నాడట.


అమ్మవారికి నివేదించిన ప్రసాదం తిన్నందువల్ల అతడు మహాపండితుడు అయ్యాడని అంటారు. అందుచేత కేరళ ప్రజల్లో అమ్మవారిపై అపార విశ్వాసం. ప్రతిరోజూ ఈ ఆలయంలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాలు భక్తుల విశ్వాసానికి నిదర్శనం. ఆలయంలో అడుగుపెడితే దురలవాట్లు దూరం అవుతాయని, ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం. ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహాపండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయనీ అందరూ అనుకుంటారు.

అమ్మవారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు..

ఆలయానికి కనీసం 1200 ఏళ్ళ చరిత్ర ఉంది. జగద్గురువు ఆదిశంకరులవారే స్వయంగా ప్రతిష్ఠించిన ఆ అమ్మవారే మూకాంబికాదేవి. కొల్లూరులో కొలువైన ఆ అమ్మ చల్లటి సన్నిధి సకల సంపదలకూ పెన్నిధి. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం.

జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు.


కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి.

మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైన హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి ప్రత్యేకమైనది. సౌపర్ణికానది.. ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుడజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. హలుగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మ వారి విగ్రహం చెక్కించాడని చెప్పుకొంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories