logo
ఆధ్యాత్మికం

13 అంతస్థులతో నిర్మితమైన ఆలయం ఏదో తెలుసా

13 అంతస్థులతో నిర్మితమైన ఆలయం ఏదో తెలుసా
X
Highlights

భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తంజావూరులో...

భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీపై తంజావూరు ఉంది. చరిత్ర కారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.

అంతేకాదు తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెపుతుంది. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిందని చెపుతుంటారు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణింపబడుచున్నది.

ఆలయ చరిత్ర..

రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతను తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ.

అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.

ఆలయ నిర్మాణము..

ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు ఆ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుకోవచ్చు. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఆలయ విగ్రహాలు ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా చెపుతుంటారు. ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు.. వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉందని చెపుతుంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఇక్కడి శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు ఉంటుంది. అంతే కాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంద్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది.

Web TitleHistory and importance of magnificent Brihadeshwara Temple in Thanjavur
Next Story