తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
x
Highlights

తిరుమలలో హనుమజ్జయంతి వేడుకల‌ను మే 29వ తేదీ బుధ‌వారం ఘ‌నంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి...

తిరుమలలో హనుమజ్జయంతి వేడుకల‌ను మే 29వ తేదీ బుధ‌వారం ఘ‌నంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు విశేషంగా అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు.

తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆరోజు ఉదయం అభిషేక, అర్చన, అలంకార, నివేదనలు చేపడతారు. ఈ హనుమజ్జయంతి నాటికి భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఆరోజు సాయంత్రం 3.00 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు టిటిడి భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది. తిరుమలలోని స్థానికులు, భక్తులు తిరుమల నుండి ఏడవ మైలుకు తిరిగి తిరుమల చేరడానికి ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టిటిడి మనవి చేస్తున్నది.

పురాణ ప్రాశస్త్యం

వానర దేవుడైన హనుమంతుడు చైత్రపూర్ణిమ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తొంది. ఆ రోజున వాయువుపుత్రుడైన హనుమంతుడుని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయని, శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పండితులు తెలిపారు.

లక్ష్మణునికి సంజీవని కోసం పర్వతాన్నే లేవనెత్తిన హనుమంతుడు దుష్టశక్తుల నుంచి కాపాడుతాడని, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని భక్తుల నమ్మకం. అందువలన తెలుగు ప్రజలు హనుమంతుడు జన్మించిన చైత్రపూర్ణిమ పర్వదినం నుండి 41 రోజులు హనుమదీక్ష ఆచరించి, వైశాఖ మాసం కృష్ణపక్షం బహుళ దశమినాడు 10వ రోజు హనుమజ్జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories