Top
logo

మంత్రాలకు అర్థం ఉందా? మంత్రం వెనుకున్న మర్మమేమిటి?

మంత్రాలకు అర్థం ఉందా? మంత్రం వెనుకున్న మర్మమేమిటి?
Highlights

అసలు మంత్రం అంటే ఏమిటి? మంత్రానికి ఉన్న అర్థమేమిటి? మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల...

అసలు మంత్రం అంటే ఏమిటి? మంత్రానికి ఉన్న అర్థమేమిటి? మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. అలాంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన రుషులు అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలుగా రూపాంతరం చెందాయ్‌. మనుషుల్ని మంచి మార్గం వైపు నడిపిస్తున్నాయ్.

ఓం, ఐం, శ్రీం, హ్రీం, క్లీం. ఇవే బీజాక్షరాలా? ఈ బీజాక్షరాలను ఎలా పలకాలి? బీజాక్షరాలు చాలానే ఉన్నా... ఉపాసాన పద్ధతిలో చేయాల్సినవి మాత్రం వేళ్ల మీదే లెక్కపెట్టవచ్చు. ఆయా దేవతల పేర్లతో కలిపి బీజాక్షరాలను జపించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక్కటంటే ఒక్కసారైనా అనుభూతిని ఇచ్చేది ఈ మంత్రసాధనే. అలా శక్తిమంతమైన పరమోద్భుత మంత్రాలుగా మారే క్రమం మహాద్భుతంగా కనిపిస్తుంది. మంత్రాల అసలు లక్ష్యం. మన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడం. అలా మూడు విధాలుగా విభజించి... ఉచ్ఛరించిన మంత్రాలకు మహాశక్తి ఉంటుంది. క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు... యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజ మంత్రాలు... ఆధ్యాత్మిక సాధన కోసం జపించే సాత్విక మంత్రాలుగా కాలక్రమంలో ఆవిర్భవించాయ్.

అన్ని మంత్రాలకు ముందు ఓం కారాన్ని చేర్చి జపిస్తాం. అదెవ్వరికైనా అనితర సాధ్యం కాని పనికాదు. ఇలా ఎందుకు పలికాలి? ఎందుకంటే ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణ వాయువు లేని జీవం లాంటిది. ఈ ఓంకారం సర్వేశ్వరుని నుంచి జ్యోతిగా ప్రారంభమై అందులో నుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ఓంకారంగా రూపాంతరం చెందింది. ఓం నుంచి వేదరాశులే ఉద్భవించాయ్. రుగ్వేదం నుంచి ఆకారం, యజుర్వేదం నుంచి ఊకారం, సామవేదం నుంచి మాకారం.... ఈ మూడు కలసి ఓంకారంగా ఏర్పడిందన్నది రుషివాక్కు. అందుకే ఓంకారాన్ని బీజాక్షరంతో ముడిపెట్టారు మన పెద్దలు.

అసలు బీజాక్షరాలు అంటే ఏమిటి?.. భాషలోని అక్షరాలే బీజాలా?..ప్రతీ బీజానికి ప్రత్యేక మహత్తు ఉంటుందా?..ఈ బీజాక్షరాల ఏకీకరణమే మంత్ర నిర్మాణమా?.. మంత్రాల స్పష్టమైన ఉచ్చారణతో అద్భుత ఫలితం సాధ్యమేనా?.. కళ్లకు కనిపించనివి.. కొలతకూ, తూకానికీ దొరకనివే బీజాక్షారాలా?

ఈ జగత్తు స్థూలమనీ, సూక్ష్మమనీ రెండు విధాలుగా విభజించారు. శరీరం స్థూలమైతే.... మనస్సు సూక్ష్మం. స్థూలమైన దానికంటే సూక్ష్మమైన దానికే శక్తి ఎక్కువ. మన శారీరక శక్తికంటే, మానసికశక్తి చాలా గొప్పది. బలవత్తరమైనది కూడా. సూక్ష్మశక్తుల జాగృతి వల్లే మానవుడు మహాత్ముడై అసాధారణ కార్యాలు చేయగలుగుతాడు. ఈ సూక్ష్మశక్తుల జాగృతికి మంత్ర శబ్ధతరంగాలు తోడ్పడితే అద్భుతం సాధించడం అదేమంత కష్టమేమీ కాదు. జీవులలోని అంతశక్తులనే కాదు, ప్రకృతిలో ఆవరించి ఉన్న అనేక అదృశ్య శక్తుల్ని కూడా బీజాక్షరాలు మంత్రాల రూపంలో ప్రేరేపిస్తాయంటారు. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడంలాంటి పనులు శబ్ధ తరంగాల ప్రక్రియతో మన పూర్వీకులు సాధించి చూపించారు.

అణువులను కదిలించే శబ్ధ తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయ్. ఇది నిజం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మంత్రాలను పలికినప్పుడు చాలా స్పష్టంగా పలకాలి. పర్‌ఫెక్ట్‌ ప్రీక్వెన్సీతో నిర్ణీత స్వరాన్ని అనుసరించి పలకాలి. అలా అయితేనే దాని ఫలితం ఉంటుంది. మనకు కనిపిస్తుంది. జీవులలోని సూక్ష్మశక్తుల్నీ, ప్రకృతిలోని వివిధ శక్తుల్నీ ప్రేరేపించడానికీ, దైవశక్తిని మనకు అనుసంధాన పరచడానికీ మంత్రశబ్ధలు ఉపకరిస్తాయనడంలో అణుమాత్రం కూడా సందేహం లేదు.

ప్రకృతిలోనే కాకుండా, సృష్టిలో కూడా అనంతంగా వ్యాపించి ఉన్న శక్తిని మంత్రాలు...సరైన ఉచ్ఛరణతో మనకు అందిస్తాయ్. దైవాంశను మనకు అనుసంధానపరచే శబ్ధమే ఓంకారం. మంత్రానికి త్రికరణ శుద్ధి చాలా అవసరం. మనసా, వాచా, కర్మణా శుద్ధి కలిగిన జీవికే మంత్రోచ్చారణ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. కంప్యూటర్‌ కాలంలో త్రికరణ శుద్ధి పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా తరిగిపోతుంది. అందుకే మంత్రాల ప్రభావం కూడా సన్నగిల్లుతుంది. పురాణ కాల మేధావులు మంత్రాలకు చింతకాయలనే కాదు, అవసరమైతే నక్షత్రాలను కూడా రాలగొట్టగలిగే శక్తి కలిగి ఉండేవారని మనం విన్నాం. మనకు ఫలించనంత మాత్రాన మంత్రశక్తిని విమర్శించడం అవివేకం. చేతకాక పోయినా కూడా కనీసం శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకోవడం వివేకం.

అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా కనిపించే అతీంద్రియ శక్తే మంత్రం. అందుకే మంత్ర నిర్మాణం ఆశ్చర్యకరమే కాక ఆసక్తికరమైన శాస్త్రం కూడా. ఎంతో అపురూపమైన మంత్రాలను ఎవరైనా భక్తితో సాధన చేయవచ్చు. సిద్ధిని, లబ్ధిని, దివ్యానుభూతిని పొందవచ్చు. దీనికి శాస్త్రీయత ఉంది. అసశాస్త్రీయంగా రుజువు అయింది కూడా.!!

మరి మంత్రాలకు, వేదాలకు సంబంధం ఏమిట?. పురాణాల్లో, వేదాల్లోనూ మంత్ర ప్రస్తావన ఉందా?..మంత్రశాస్త్రంలోనూ సైన్స్‌ కనిపిస్తుందా?.. శబ్ధ తరంగాలకు ఉన్న శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? పురాణకాలాన్ని మంత్రయుగమంటే... .ఆధునిక కాలాన్ని యంత్రయుగమని పిలవాలా?.. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కొందరు అనుకుంటున్నట్టు మంత్రం సైన్స్‌కి విరుద్ధమా?.. జీవ నాడీ వ్యవస్థపై బీజాక్షరాల ప్రభావం ఎంత?

ఇలా మంత్రాల గురించి, బీజాక్షరాల మర్మం గురించి చాలా మందిలో చాలా రకాలైన అపోహలు ఉన్నాయ్. అంతెందుకు తప్పుగా ఆలోచించే వాళ్లూ లేకపోలేదు. మంత్రాలను వాడాల్సిన విధంగా వాడితే... అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు పండితులు. పురాణాల్లోని సైన్సు విషయాల్ని తెలుసుకునేటప్పుడు మంత్రం అనే అంశంపై కచ్చితమైన అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే పురాణాల్లో అనేక మంత్ర తంత్రాలు కనిపిస్తాయి మనకు. అందుకే మంత్రాలకూ, సైన్సుకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకొని తీరాలి. పురాణకాలంగా మంత్రయుగంగా... ఆధునికకాలం యంత్రయుగంగా మారుతుంది. ఇది నిజమే కావచ్చు కానీ మంత్రం సైన్సుకు ఏమాత్రం విరుద్ధం కాదు. ఇది నిజం కానే కాదు. మంత్రం అనేది నూటికి నూరుపాళ్లు ఒక సైన్సు ప్రక్రియే.

దేవతానామాన్ని లేదా బీజాక్షరాన్ని స్మరించడాన్ని మంత్ర జపం అంటారు. కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడటమే. ఇలా వాడటం వల్ల ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌ను ఒక లక్ష్యం కోసం వాడటం వల్ల ఆ ఉద్భవించిన శక్తి మనకు అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మారుతుంది. అది మంత్రానికి ఉన్న పవర్‌. తరుచూగా ఉచ్చరించే శబ్ధ తరంగాలే మంత్రాలు. ఆ మంత్ర శబ్ధ తరంగాలు చాలా శక్తివంతమైనవి కూడా. శబ్ధ తరంగాలు జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా ప్రభావాన్ని చూపిస్తాయ్. ఇది సైన్సు కూడా ఒప్పుకుంటున్న సత్యం.

జీవుల శారీరక, మానసిక స్థితులపై శబ్ధ తరంగాల ప్రభావం ఉంటుంది. కొన్ని రకాల శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, భయం కలగడం, నిరాశ ఆవరించడం చూస్తుంటాం. మరి కొన్ని శబ్ధ తరంగాల వల్ల ఆరోగ్యం బాగుపడటం, ఉత్సాహం రావడాన్ని కూడా గమనిస్తుంటాం. అందుకే మంత్రాలంటే శక్తిమంతమైనవి శబ్దతరంగాలే. అందుకే మంత్ర ప్రభావం మన సూక్ష్మగ్రంథులపైనా, షట్‌ చక్రాలపైనా శక్తి కేంద్రాలపైనా సూటిగా పడుతుంది. అప్పుడు మనలోని సూక్ష్మ జగత్ శక్తి కేంద్రం మేల్కొంటుంది. మంత్ర శబ్దాలు గ్రంథులకు చలనం కలిగించి జాగృతం చేస్తుంది. పోగొట్టుకున్న శక్తిని అవి మేల్కొలుపుతాయ్. మంత్రోచ్చారణ ద్వారా ఉద్భవించిన శబ్ధ తరంగాలు ముందుగా చెవిని చేరి, తర్వాత మెదడుకు వెళ్తాయి. మెదడు నుంచి మంత్ర శబ్ధ తరంగాల ప్రభావం ప్రతీ అవయవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఎక్కడ కనిపించని అత్యంత శక్తిమంతమైన ముక్తిప్రదం మన పెద్దలు మనకిచ్చిన మంత్రసాధన. మంత్రాలు కేవలం పదాల నిర్మితాలే కాదు. శక్తికి ప్రతిరూపాలు. పరమేశ్వరా అనుగ్రహంతో, పంచభూతాత్మకమైన దేహంతో, అద్భుతమైన మేథా సంపత్తిని పొందిన మానవుడి ఆలోచనాశక్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చేది మంత్రమే.


లైవ్ టీవి


Share it
Top