ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి గురించి తెలుసా..?

ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి గురించి తెలుసా..?
x
Medak Church File Photo
Highlights

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది ఆసియాలో రెండో అతిపెద్ద మెదక్‌ క్యాథడ్రల్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుగుతాయి

కరవు కోరల్లో చిక్కుకున్న జనాలకు పట్టెడన్నం పెట్టిన ఆలయం.. ఎంతో మంది శ్రమ జీవుల స్వేదంతో నిర్మితమైన కళా ఖండంగా ఖ్యాతిని గడించింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ చెక్కు చెదరని రాతి కట్టడంగా ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. దశాబ్దాలు గడిచినా వన్నె తగ్గని అద్భుత చారిత్రక కట్టడం మెదక్ క్యాథడ్రల్ చర్చ్. సర్వ మతాలకు నిలయమై, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. రంగు రంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ క్రిస్మస్ వేడుకలకు సిద్దమైన మెదక్ సీఎస్‌ఐ చర్చ్ పై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

మెతుకు సీమగా పిలవబడిన మెదక్‌ జిల్లాలో 1910లో కరువు విలయతాండవం చేసింది. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రాంతానికి విచ్చేశారు బ్రిటిష్‌ మత గురువు చార్లెస్‌ వాకర్‌ ప్రోస్నేట్‌. కరువు రక్కసి నుండి జనాలను రక్షించాలనే సంకల్పంతో చర్చ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1914లో పునాది రాయి పడి, పదేళ్ల పాటు పనులు కొనసాగాయి.రాళ్ళు, డంగు సున్నంతో అధ్భుతమైన పనితనంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చ్ గా రూపుదిద్దుకుంది. గోత్నిక్ ఆకృతిలో రాతి కట్టడాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. చూడగానే ఆకట్టుకునే విధంగా చర్చ్ నిర్మాణం ఉంటోంది. ఇక్కడ ప్రతీది ఒక కళాఖండమే. రెండు అంతస్తుల్లో గాలి, వెలుతురు వచ్చేలా చర్చ్ నిర్మించారు. ఏసు జననానికి సంబంధించిన చిత్రాలు కనువిందు చేస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది ఆసియాలో రెండో అతిపెద్ద మెదక్‌ క్యాథడ్రల్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుగుతాయి. కుల మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్మస్‌ పండగ సందర్భంగా చర్చ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగు రంగుల పూలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. పచ్చని క్రిస్మస్‌ ట్రీలు, నక్షత్రాల ధగధగలు, అలంకరణలతో చర్చ్‌ను ముస్తాబు చేశారు. ఏసు పుట్టిన గుర్తుగా చర్చ్‌ ఆవరణలో పశువుల పాక ఏర్పాటు చేశారు. క్రిస్మస్‌ పండుగ రోజు కేక్ కట్ చేసిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటాయి.

ఎంతో చరిత్ర కల్గిన మెదక్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. చారిత్రక, ఆధాత్మిక కేంద్రంగాను ఖ్యాతిని సొంతం చేసుకున్న ఈ చర్చ్‌ను సందర్శించేందుకు దేశ, విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. క్రిస్మస్‌ సమయంలో ఆ సంఖ్య మరి ఎక్కువగా ఉంటుంది. క్రైస్తవులతో పాటు ఇతర మతాల వారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.

అభాగ్యుల చెమట చుక్కలు అప్పటి శిల్పకారుల పనితనంనిర్మాణంలో ఎన్నో విశిష్టతలు కలిగీ నేటికి చెక్కు చెదరని అధ్భుత కళాఖండం ఏదైనా ఉందంటే అది మెదక్ క్యాథడ్రల్ చర్చ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories