Gold: బంగారానికి అంత విలువ ఎందుకో తెలుసా.. ఇంట్రెస్టింగ్ ప్యాక్ట్స్..!

Gold
x

Gold

Highlights

Gold: అసలు బంగారానికి అంత వెల కట్టాల్సిన పని లేదు, అదొక మామూలు లోహం మాత్రమే అని కొందరు అంటారు.

Gold: బంగారం మీద ట్రెడిషనల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వేల కొద్దీ ఆర్టికల్స్ వచ్చాయి. బంగారానికి ఎందుకంత విలువ, బంగారంలోని ఆకర్షణ ఏంటి, బంగారం కొనడం మంచి పెట్టుబడి అవుతుందా వంటి అనేక అంశాల గురించి మీడియాలో ఎంతో రాశారు, ఇంకా రాస్తూనే ఉంటారు. ప్రజల్లో బంగారానికి ఉన్న ఆసక్తి అలాంటిది మరి!

బంగారం విలువ – ఆకర్షణ ఎప్పటికప్పుడు పెరిగిపోవడం వెనుక ఉన్న సామాజిక, మానసిక కారణాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

బంగారానికి ఎందుకంత విలువ?

అసలు బంగారానికి అంత వెల కట్టాల్సిన పని లేదు, అదొక మామూలు లోహం మాత్రమే అని కొందరు అంటారు. దానిలో ఉత్పాదక విలువ అంటూ ఏమీ లేదని కూడా కొందరు ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. నగలు చేసుకోవడానికి తప్పిస్తే దానితో మరే ఉపయోగం లేదని వాదించే వారూ ఉన్నారు.

కానీ, అదే సమయంలో బంగారానికి అంతర్గత విలువ అధికం అని, అదొక విలువైన ఆస్తి అని చెప్పేవారూ ఎక్కువగా ఉంటారు. భూములు, షేర్లు కొన్నట్లుగానే బంగారాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్‌గా చూస్తుంటారు. మరికొందరైతే, ఏ పెట్టుబడి విలువ అయినా పడిపోవచ్చేమో కానీ, బంగారం ఎప్పటికీ తగ్గదని నమ్మకంతో చెబుతుంటారు.

పసిడి ధర కళకళలాడడానికి కారణాలు ఏంటి?

* బంగారాన్ని సంపదకు మాత్రమే కాదు అధికారానికి, రాచరికారనికి సంకేతంగా భావించడం.

* తరతరాలుగా బంగారాన్ని గౌరవించదగిన మెటల్‌గా చూస్తన్నారు. బంగారానికి పూజలు చేసే సంప్రదాయమూ ఉంది.

* బంగారంతో నగలు చేయించుకోవడం వేల ఏళ్ళుగా ఉన్న సంప్రదాయం అంటారు. అంతేకాదు, ప్రాచీన కాలంలో అది మారకం విలువ కలిగి ఉండేది.

* కరెన్సీ కుప్పకూలితే బంగారమే ఆర్థిక వ్యవస్థను నిలబెడుతుందనే అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉండడం.

* నిల్వ చేసిన కొద్దీ విలువ పెరిగే వస్తువు కాబట్టి, పెట్టుబడి అవకాశంగా ఉపయోగపడుతుంది.

* బంగారం చాలా అరుదైన లోహం, భూమి నుంచి తీయడం చాలా కష్టం.

* బంగారం మెత్తని లోహం. ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, రక్షణ పరికరాలు, విమానయాన పరిశ్రమల్లో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది.

* ముఖ్యంగా, దీని మన్నిక ఎక్కువ. మిగతా లోహాల్లా తుప్పుపట్టి పాడైపోవడం ఉండదు.

* కంటికి అందంగా, అయస్కాంతాన్ని మించిన ఆకర్షణతో వెలిగిపోవడం ఒక్క బంగారానికే సాధ్యం.

ఫీల్ గుడ్ మెటల్: ఇన్నేళ్ళుగా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో అలా స్థిరపడిపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ, బంగారాన్ని చూస్తే మనసు ఆహ్లాదంగా మారుతుందని చాలా మంది చెబుతారని సైకాలజిస్టులు అంటారు. ఓ శితాకాల సాయంత్రవేళ మార్కెట్ వీధుల్లో నడుస్తూ వెళుతుంటే, బంగారం షాపు షోకేసుల్లో పసిడి నగలు మిలమిల మెరుస్తున్న దృశ్యం కనబడితే మనసు వెచ్చగా అవుతుందట.

కరెన్సీ రూపాన్ని కనుగొనే ప్రయత్నంలో...

ఇచ్చి పుచ్చుకునే బార్టర్ సిస్టమ్ నుంచి బయటపడేందుకు మన ప్రాచీనులు ఒక మారకం విలువ కలిగిన పదార్థం కోసం అన్వేషించారు. ఒక లోహపు నాణం మీద అంకెలు వేసి దాన్ని మారకం విలువగా పెట్టుకోవాలని ఆలోచించారు. పీరియాడిక్ టేబుల్‌లోని లోహాలన్నింటినీ అందుకోసం పరిశీలించారు. ఇనుము, రాగి, సీసం, వెండి. పలాడియం, అల్యూమినియం, ప్లాటినం వంటివన్నీ పరీక్షించారు.

ఇనుము, రాగి, అల్యూమినియం వంటివి కొంత కాలానికి పాడైపోతాయి. కాబట్టి, వాటికి మంచి విలువ ఇవ్వలేమనే అభిప్రాయానికి వచ్చారు. అల్యూమినియం మరీ తేలిగ్గా ఉండడంతో దాన్ని పట్టుకుంటే ఏదో విలువైన వస్తువు పట్టుకున్న ఫీలింగ్ కానీ, భద్రత భావన కానీ రాదు.

ప్లాటినం, పలాడియం విలువైన లోహాలే కానీ, అవి వాటికి వేరే లోహాలతో పొసగదు. మారకం విలువగా మార్చుకునేంత స్థాయిలో ఆ లోహాలు లభ్యం కూడా కావు.

చివరకు, ఈ విషయంలో బంగారం, వెండి మాత్రమే అనువైన లోహాలుగా కనిపిస్తాయి. బంగారం ఎప్పటికీ తుప్పు పట్టదు. తక్కువ వేడిలోనే కరిగిపోతుంది. వెండి కూడా అంతే. ఈ రెండు లోహాలను కరిగించి మరో రూపంలోకి మార్చడం సులువు. అందుకే, ఈ రెండు లోహాలు అనాదిగా మారకం విలువతో వెలిగిపోతున్నాయి.

బంగారం... ఒక మిస్టరీ మెటల్

వెండిని కూడా పాలిష్ చేసి మెరిపించవచ్చు. వెలుగులో ఈ లోహం కూడా ప్రకాశిస్తుంది. కానీ, బంగారానికి ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ చెక్కు చెదరని మెరుపు, అందమైన రంగు.

నిజానికి, బంగారంలోని అణువులు ఇతర లోహాల అణువుల కన్నా బరువైనవి. దానివల్ల ఇందులోని ఎలక్ట్రాన్స్ వేగంగా కదులుతుంటాయి. ఈ లక్షణం వల్ల బంగారం కొంత వెలుగును సహజంగా గ్రహిస్తుంది. కాంతిని గ్రహించే ఈ భౌతిక లక్షణమే బంగారానికి మెరుపునిస్తుంది. ఆ మెరుపే దాని మిస్టరీ.. అదే దాని విలువ.

బంగారం – మనసు -సమాజం

ఆధునిక కరెన్సీ విలువ కుప్పకూలితే, ఆ వెంటనే విలువ అందుకునేది బంగారమే. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏదైనా కొనుక్కోవాలంటే బంగారాన్ని మార్చడం ఒక్కటే దారి.

మనిషి ఇతరత్రా జంతువుల్లాగే సంఘ జీవి. పూర్తి స్వతంత్రం కన్నా నలుగురితో కలిసి బతకడానికే ఇష్టపడతాడు. ఒంటరిగా బతకడం కన్నా పది మందితో కలిసి బతకడమే మనిషికి హాయినిస్తుంది. ఈ కలిసి జీవించే లక్షణమే మనిషికి మారకం విలువ కలిగిన వస్తువు అవవసరాన్ని గుర్తు చేసింది. అందుకు, బంగారం అనువైన లోహంగా కనిపించింది. అలా అది మనిషి జీవితంతో విడదీయరాని, విలువైన బంధాన్ని ఏర్పరచుకుంది.

అందుకే, బంగారంతో మనిషికి మానసిక బంధం ఏర్పడింది. బంగారం ఇప్పుడు మనిషికి మాత్రమే కాదు, సమాజానికి అంటే దేశానికి సంపద చిహ్నంగా మారింది. ఒక దేశంలోని కరెన్సీ విలువను, ఆ దేశంలోని బంగారం నిల్వలతోనే లెక్కగడతారు.

ప్రస్తుతం 8,133 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది ఆమెరికా. ఆ తరువాత 3,350 మెట్రిక్ టన్నులతో జర్మనీ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న ఐఎంఎఫ్.. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర 2,814 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఈ వరసలో భారతదేశం 840 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది.

దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది? ఒక దేశం విలువ కూడా దాని దగ్గర ఉన్న బంగారం నిల్వలపై ఆధారపడి ఉంది. అందుకే, బంగారం దేశానికి సంపద. మనిషికి అది భావోద్వేగంతో కూడుకున్న ఆస్తి. అదే బంగారానికున్న స్పెషాలిటీ.

Show Full Article
Print Article
Next Story
More Stories