Viral Video : స్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్..దెయ్యాలు పార్టీ చేసుకుంటున్నాయి కాబోలు..టిప్ కూడా ఆఫర్

Viral Video : స్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్..దెయ్యాలు పార్టీ చేసుకుంటున్నాయి కాబోలు..టిప్ కూడా ఆఫర్
x
Highlights

స్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్..దెయ్యాలు పార్టీ చేసుకుంటున్నాయి కాబోలు..టిప్ కూడా ఆఫర్

Viral Video : సోషల్ మీడియాలో తరచూ అనేక వింత వీడియోలు చూస్తుంటాం, కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తోంది. ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ అర్ధరాత్రి సమయంలో బిర్యానీ ప్యాకెట్ పట్టుకుని కస్టమర్ ఇచ్చిన లొకేషన్‌కు వెళ్లాడు. తీరా అక్కడికి చేరుకున్నాక చూస్తే.. అతడి ముందున్నది ఒక స్మశానం. ఆ చీకటిలో నుంచి వచ్చిన ఫోన్ కాల్ సంభాషణ వింటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ప్రస్తుతం @choudhary_99415 అనే X ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో కనిపించే దాని ప్రకారం.. డెలివరీ బాయ్ కస్టమర్‌కు కాల్ చేస్తాడు. అవతలి నుంచి ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. ఆమె చాలా మామూలుగా మాట్లాడుతూ.. "అలాగే నేరుగా లోపలికి వచ్చేయ్.. దారిలో ఒక కుక్క కూర్చుని ఉంటుంది, భయపడకు" అని చెబుతుంది. డెలివరీ బాయ్ షాక్‌కు గురవుతాడు. "అమ్మా, ఇది స్మశానం.. లోపల అస్సలు వెలుతురు లేదు, నేను లోపలికి రాలేను" అని భయపడుతూనే చెబుతాడు. దానికి ఆ మహిళ ఏమాత్రం తడబడకుండా "అవును, అదే కరెక్ట్ ప్లేస్.. గేటు లోపలికి వచ్చి డెలివరీ ఇవ్వు" అని పట్టుబడుతుంది.

అతను లోపలికి వచ్చేందుకు నిరాకరించడంతో ఆ మహిళ వింత వాదన మొదలుపెడుతుంది. "మేమంతా ఇక్కడ లోపల స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాం.. నువ్వేంటి దెయ్యాల గురించి అంతగా భయపడుతున్నావు?" అంటూ అతనిని హేళన చేయడం ప్రారంభిస్తుంది. ఇది విన్న డెలివరీ బాయ్ మైండ్ బ్లాంక్ అవుతుంది. సమాధుల మధ్య అర్ధరాత్రి పూట పార్టీ చేసుకోవడం ఏంటి? అసలు వీళ్లు మనుషులేనా లేక మరేదైనా శక్తియా? అనే అనుమానం అతనికి కలుగుతుంది. "చీకట్లో సమాధుల మధ్యకు రావడం నాకు మంచిది కాదు.. రూల్స్ ఒప్పుకోవు" అని అతను స్పష్టం చేస్తాడు.

ఆ మహిళ ఎంత రెచ్చగొట్టినా, భయపెట్టినా ఆ డెలివరీ బాయ్ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. "మీరు గేటు దగ్గరికి వస్తేనే ఫుడ్ ఇస్తాను, లేదంటే ఆర్డర్ క్యాన్సల్ చేసి వెళ్లిపోతాను" అని తెగేసి చెబుతాడు. ఆ సంభాషణ కొనసాగుతుండగానే అతడు అక్కడ ఉండటం సేఫ్ కాదని భావించి ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది అది ప్రాంక్ అని అంటుంటే, మరికొందరు మాత్రం డెలివరీ బాయ్స్ రాత్రిపూట ఇలాంటి ఎన్ని ఇబ్బందులు పడతారో అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories