ఆ దేశంలో ఓటు వేయని వారిని దేశద్రోహం కేసు కింద బుక్ చేస్తారు...

Those Who Dont Vote In That Country Will Be Booked Under Sedition Case
x

ఆ దేశంలో ఓటు వేయని వారిని దేశద్రోహం కేసు కింద బుక్ చేస్తారు...

Highlights

ఆ దేశంలో ఓటు వేయని వారిని దేశద్రోహం కేసు కింద బుక్ చేస్తారు...

హైదరాబాద్‌లో మే 13న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. నగరాల్లో ఉన్న విద్యావంతులే ఓటు హక్కు వినియోగించుకోవడంలో అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడం ఈ వాదనను బలపరుస్తోంది.

ఓటు హక్కు వినియోగించుకోవడం మన దేశంలో ఒక హక్కు, బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించకూడదని ప్రభుత్వాలు ప్రజలకు అనేక రకాల ప్రకటనలతో గుర్తు చేస్తూనే ఉన్నాయి.

అయితే, ప్రపంచంలోని దాదాపు 20 దేశాలు ఓటు వేయకపోవడాన్ని నేరంగా గుర్తిస్తున్నాయి. ఓటు వేయని వారి మీద కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి.

అర్జెంటీనా, అస్ట్రేలియా, బెల్జియం, బిలీవియా, బ్రెజిల్, కాంగో, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఈజిప్ట్, గ్రీస్, హోండురాస్, లెబనాన్, లక్సెంబర్గ్, మెక్సికో, పనామా, పరాగ్వే, సింగపూర్, పెరూ, థాయిలాండ్, ఉరుగ్వే, థాయిలాండ్ వంటి 22 దేశాలలో ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి. వీటిలోని కొన్ని దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోని వారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. మరికొన్ని దేశాలు ఓటు వేయని ప్రజలకు రేషన్ కూడా కట్ చేస్తాయి. ఓటు వేయకపోవడానికి బలమైన కారణాలు చూపించకపోతే కొన్ని దేశాల్లో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అస్ట్రేలియా: 1924 నుండి అస్ట్రేలియాలో నిర్భంధ ఓటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఓటు వేయనివారికి ఫైన్ విధిస్తారు. ఓటు వేయకపోతే గరిష్టంగా 222 డాలర్లను జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ దేశంలో 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతోంది.

బెల్జియం: ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవడం తప్పనిసరి చేసింది బెల్జియం.1893నుండి పురుషులకు, 1948లో మహిళలు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఓటు వేయకపోతే ఫైన్ విధిస్తారు. వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే పదేళ్ల వరకు ఓటు హక్కును వినియోగించుకొనే హక్కును ఆ ఓటరు కోల్పోతారు. ఓటు హక్కును వినియోగించుకొనేవారికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుంది.

గ్రీస్: ఈ దేశంలో ఓటు వినియోగించుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు ఇవ్వరు. ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాలు కూడ ఓటు హక్కును వినియోగించుకోకపోతే దక్కవు.

బ్రెజిల్: ఈ దేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాల్సిందే. 70 ఏళ్లు దాటితే మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడం మాత్రం వారిష్టం. ఓటు హక్కు వినియోగించుకోనివారు మాత్రం ఫైన్ కట్టాల్సి ఉంటుంది. తమ జీతంలో మూడు నుండి 10 శాతం వరకు జరిమానాను చెల్లించాలనే నిబంధన ఉంది.

ఈక్వెడార్: 1947 నుండి ఈ దేశంలో ఓటు వినియోగించడం తప్పనిసరి చేశారు. 1968 నుండి పురుషులు, స్త్రీలు కచ్చితంగా తమ ఓట్లను వినియోగించుకోవాల్సిందే. 65 ఏళ్లు దాటే వరకు వీరంతా ఓటు వేయాల్సిందే. ఓటును వినియోగించుకోకపోతే ప్రభుత్వం కల్పించిన హక్కులను పౌరులు కోల్పోతారు.

లక్సెంబర్గ్ : ఓటు వినియోగించుకోవడం లక్సెంబర్గ్ ప్రజలకు తప్పనిసరి. 75 ఏళ్లు దాటితే మాత్రం ఓటు వినియోగించుకోవడంపై ఓటరుకు ఆఫ్షన్ ఇచ్చారు. సరైన కారణం లేకుండా ఓటు వినియోగించుకోకపోతే 100 నుండి 250 యూరోలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిసారీ ఇలానే సాగితే 500 నుండి 1000 యూరోలు జరిమానాను చెల్లించాల్సిందే.

పెరూ: ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాల్సిందే. అయితే 75 ఏళ్లు దాటిన వారికి మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చారు అధికారులు. ఓటేస్తేనే రేషన్ సరుకులు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఓటేసిన తర్వాత ఇచ్చే కార్డు ఆధారంగానే పౌరులు సరుకులు పొందుతారు.డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు.

సింగపూర్ : ఓటు వేయకపోతే ఓటరు జాబితా నుండి వారి పేర్లను తొలగిస్తారు. ఈ జాబితాలో తిరిగి పేర్లు నమోదు చేయాలంటే ఫైన్ కట్టాలి. అంతేకాదు సరైన కారణం చూపాలి.

ఉత్తరకొరియా: ఫెడరల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందే. లేకుంటే దేశ ద్రోహంగా పరిగణిస్తారు.ఓటు వేయనివారిని కఠినంగా శిక్షిస్తారు.

అర్జెంటీనాలో ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయి.బొలివియాలో ఓటు వేయని వారికి జీతాలివ్వరు. ఈ దేశాల్లో కచ్చితంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నందునే ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. ఇండియాలో ఇదే తరహా నిబంధలను అమలు చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ.

Show Full Article
Print Article
Next Story
More Stories