Fingerprint Science: ప్రకృతి ఇచ్చిన 'బార్ కోడ్'.. వేలిముద్రల వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే!

ప్రపంచంలో సుమారుగా ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు.. కానీ ఎవరి వేలిముద్ర మరొకరితో మ్యాచ్‌కావు.

Ganesh
Published on: 15 Feb 2026 4:12 PM IST
Fingerprint Science: ప్రకృతి ఇచ్చిన బార్ కోడ్.. వేలిముద్రల వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే!
X

Fingerprint Science: ప్రకృతి ఇచ్చిన 'బార్ కోడ్'.. వేలిముద్రల వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే!

ప్రపంచంలో సుమారుగా ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు.. కానీ ఎవరి వేలిముద్ర మరొకరితో మ్యాచ్‌కావు. అంత వరకు ఎందుకు ఒకే పోలికలతో ఉండే కవల పిల్లల మధ్య కూడా తేడాలుంటాయి. అసలు ఈ గీతల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అవి ఎలా ఏర్పడతాయి? మనిషికి గుర్తింపు కార్డుగా మారిన వేలిముద్రల గురించి ఆసక్తికర విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మన వేలి కొనలపై కనిపించే ఎత్తుపల్లాలు, వంకర గీతలను చూసి అవేవో మామూలు చర్మం అనుకుంటే పొరపాటే. శాస్త్రీయ పరిభాషలో వీటిని 'రిడ్జెస్' (Ridges) అంటారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ నుంచి ఆఫీసు అటెండెన్స్ వరకు.. నేడు ప్రతిచోటా మన ఉనికిని చాటేది ఇవే. ఒకసారి ఏర్పడిన వేలిముద్రలు మనిషి చనిపోయేవరకు మారవు. ఒకవేళ వేలికి చిన్నపాటి గాయం అయినా, చర్మం మళ్ళీ పుట్టుకొచ్చేటప్పుడు పాత నమూనానే అనుసరిస్తుంది. సాధారణంగా మన వేలిముద్రలు అమ్మ కడుపులో ఉన్నప్పుడే రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. గర్భం దాల్చిన 10వ వారం నుంచే శిశువు వేలిముద్రలు రూపుదిద్దుకుంటాయి వైద్య నిపుణులు చెబుతున్నారు.

గర్భంలో శిశువు కదులుతున్నప్పుడు తన చేతులతో చుట్టూ ఉండే ద్రవాలను, ఉపరితలాలను తాకడం వల్ల ఈ గీతలు ఏర్పడతాయని వైద్యులు పేర్కొంటున్నారు. వేలిముద్రల ప్రాథమిక నమూనాకు జన్యువులు కారణమైనప్పటికీ, గర్భంలో రక్త ప్రసరణ వేగం, శిశువు ఉండే పొజిషన్ వంటి అంశాలు ప్రతి గీతను విభిన్నంగా మలుస్తాయని అంటున్నారు. అందుకే ఒకే DNA ఉన్న కవలలకు కూడా వేలిముద్రలు వేర్వేరుగా ఉంటాయని చెబుతున్నారు.

వేలిముద్రలు ప్రధానంగా మూడు ఆకృతులలో ఉంటాయని శాస్త్రవేత్తలు వర్గీకరించారు:

లూప్స్ (Loops): ఇవి అలల మాదిరిగా ఒక వైపు నుంచి మొదలై మళ్ళీ అదే వైపునకు వంగి ఉంటాయి. ఇవి చాలా సాధారణం.

వోర్ల్స్ (Whorls): ఇవి చిన్నపాటి సుడిగుండాల మాదిరిగా వృత్తాకారంలో ఉంటాయి.

ఆర్చెస్ (Arches): ఇవి కొండల మాదిరిగా మధ్యలో పైకి లేచి రెండో వైపునకు వాలుగా ఉంటాయి.

వేలిముద్రలు కేవలం గుర్తింపు కోసమేనా?

వేలిముద్రలు కేవలం ఫోన్ అన్‌లాక్ చేయడానికో, సంతకానికి బదులుగా వేయడానికో మాత్రమే కాదు.. మన శరీర ధర్మంలో వాటికి కీలక పాత్ర ఉందంటున్నారు నిపుణులు. గరుకుగా ఉండే ఈ గీతలు మనం ఫోన్, పెన్ను లేదా గ్లాసు వంటి వస్తువులను పట్టుకున్నప్పుడు అవి జారిపోకుండా ఉండటానికి విశేషంగా ఉపయోగపడుతాయని చెబుతున్నారు. మనం ఏదైనా వస్తువును తాకినప్పుడు అది గరుకుగా ఉందా లేకపోతే నునుపుగా ఉందా అనేది మెదడుకు వెంటనే సమాచారం అందేలా ఈ గీతలు సహకరిస్తాయి. వేలిముద్రలు మనిషికి ప్రకృతి ఇచ్చిన విభిన్నమైన 'బార్ కోడ్' వంటివి. దీన్ని కాపాడుకోవడం అంటే మన భద్రతను కాపాడుకోవడమే అని సూచిస్తున్నారు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story