Viral : కడుపు నొప్పి అనుకుంది.. కానీ డెలివరీ అయిపోయింది..ఆస్ట్రేలియా టూర్‌లో యువతికి వింత ట్విస్ట్

Viral : కడుపు నొప్పి అనుకుంది.. కానీ డెలివరీ అయిపోయింది..ఆస్ట్రేలియా టూర్‌లో యువతికి వింత ట్విస్ట్
x
Highlights

కడుపు నొప్పి అనుకుంది.. కానీ డెలివరీ అయిపోయింది..ఆస్ట్రేలియా టూర్‌లో యువతికి వింత ట్విస్ట్

Viral : సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చితే నెలలు గడుస్తున్న కొద్దీ శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ, ఓ యువతి విషయంలో మాత్రం ప్రకృతి వింతగా ప్రవర్తించింది. తనకు కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యిందని భావించి ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ ఏకంగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటివరకు అసలు తాను గర్భవతినన్న విషయం కూడా ఆమెకు తెలియకపోవడం విశేషం. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఒక బ్రిటిష్ యువతికి ఎదురైన ఈ వింత అనుభవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల హ్యాటీ షెపర్డ్ తన ప్రియుడు బెయిలీ చీడిల్‌తో కలిసి ఆస్ట్రేలియాలో ఆరు నెలల అడ్వెంచర్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఈ జంట బీచ్ పార్టీలు, షికార్లతో ఫుల్ ఖుషీగా గడుపుతున్నారు. అయితే ఒకరోజు హ్యాటీకి అకస్మాత్తుగా కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. ఏదో ఫుడ్ పాయిజన్ లేదా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందని భావించి ఆమె రెండు పారాసిటమాల్ బిళ్ళలు వేసుకుంది. అయినా నొప్పి తగ్గకపోగా, కుడి పక్కన పోట్లు పొడవడంతో అది అపెండిసైటిస్ ఏమో అని భయపడి క్వీన్స్‌లాండ్‌లోని గోల్డ్ కోస్ట్ యూనివర్సిటీ ఆసుపత్రికి పరుగులు తీసింది.

ఆసుపత్రిలో హ్యాటీకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన డాక్టర్ల ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ రిపోర్టులు చూసి వారు నిర్ఘాంతపోయారు. హ్యాటీ పడుతున్న నొప్పులు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినవి కావని, అవి ప్రసవ వేదన అని డాక్టర్లు తేల్చి చెప్పారు. నీ కడుపులో బిడ్డ ఉంది.. నువ్వు ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్నావు అని డాక్టర్లు చెప్పగానే హ్యాటీకి నోట మాట రాలేదు. తానూ గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నానని, ఇది అస్సలు అసాధ్యమని ఆమె వాదించింది. కానీ కొద్దిసేపటికే ఆమె సుమారు 3 కిలోల బరువున్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

సాధారణంగా గర్భం దాల్చినప్పుడు బిడ్డ కదలికలు తెలుస్తాయి, కడుపు బయటకు వస్తుంది. కానీ హ్యాటీ విషయంలో అలా జరగకపోవడానికి గల కారణాలను వైద్యులు వివరించారు. శిశువు ఎదుగుదల హ్యాటీ వెన్నెముక వైపు జరగడం వల్ల ఆమె కడుపు బయటకు ఉబ్బినట్లు కనిపించలేదు. అలాగే ప్లాసెంటా(మాయ) గర్భాశయం ముందు భాగంలో ఉండటం వల్ల బిడ్డ కదలికలు ఆమెకు అస్సలు తెలియలేదు. దీనివల్ల 9 నెలల పాటు తాను గర్భవతినన్న ఆనవాళ్లే లేకుండా పోయాయి. తన జీవితంలో ఇది అత్యంత భయంకరమైన, అదే సమయంలో వింతైన అనుభవం అని హ్యాటీ పేర్కొంది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories