Nepal Elections 2026: నేపాల్ ఎన్నికల్లో ‘జెన్ జీ’ సునామీ.. మునిగిపోతున్న పాత తరం నాయకత్వం

Nepal Elections 2026
x

Nepal Elections 2026

Highlights

Nepal Elections 2026: నేపాల్‌ ‘జెన్ జీ’ నిరసనల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువత తమ ప్రభావం చూపింది. జెన్ జీ అక్కడ ఏమి చేసిందో పూర్తి విశ్లేషణ

Nepal Elections 2026: తరాంతరాలు రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుంటాయి. సాధారణంగా రాజకీయాల్లో ఎదిగిన నాయకులు.. అధికారంలో ఎక్కువ కాలం కొనసాగిన నేతలూ మనల్ని మించిన వారు లేరు అనే భ్రమల్లో ఉంటారు. అంతేకాదు, మనకి తిరుగులేదు.. మనల్నెవర్రా ఆపేది అనే అహంకారంతో ఉంటారు. కానీ, అది కొన్నేళ్లే.. కొత్త నెత్తురు వస్తుంది. ప్రశ్నిస్తుంది.. జవాబులు అడుగుతుంది.. దానికి సరిగ్గా రెస్పాండ్ కాకపోతే నిలదీసి కడిగేస్తుంది. అహంకార నేతలను అదఃపాతాళానికి తొక్కేస్తుంది. సరిగ్గా అదే జరిగింది మన పొరుగుదేశం నేపాల్ లో. తరాలుగా నేతలపై పేరుకుపోయిన అసంతృప్తి ‘జెన్ జీ’ దూకుడుతో సునామీలా వారిపై విరుచుకుపడింది. ఇలాంటివి ఎన్ని చూడలేదు.. తొక్కేద్దాం అనుకున్న నాయకులకు చుక్కలు చూపించింది. ఇదిగో ఇప్పుడు అధికారం వైపు దూసుకుపోతోంది. నేపాల్ ఎన్నికల్లో జెన్ జీ విప్లవ పవనాల ధాటికి పాతతరం నాయకత్వం కూకటి వేళ్ళతో కూలిపోతోంది. అసలు ఏమిటీ జెన్ జీ? అక్కడ జరిగిందేమిటి? ఎన్నికల్లో దాని ప్రభావం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇప్పుడు చూద్దాం.

పార్టీల జెండాలు లేవు.. గోడల మీద విప్లవ నినాదాలు రాయలేదు.. రోడ్లమీద ట్రాఫిక్ ని కకావికలం చేస్తూ ర్యాలీలు కూడా లేవు. కానీ, అధికార పార్టీని కూలదోస్తోంది జెన్ జీ. నేపాల్ రాజకీయాల్లో ‘జెన్ జీ’ (Gen Z) విప్లవం ఒక చారిత్రాత్మక మలుపు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎటువంటి రాజకీయ పార్టీల జెండాలు లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా యువత ఏకమై ఒక ప్రభుత్వాన్నే గద్దె దించిన తీరును ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూస్తోంది.

జెన్ జీ విప్లవం పుట్టిందిలా..

నేపాల్ లో అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో తీసుకున్న ఒక నిర్ణయం నిప్పుకు ఆజ్యం పోసింది. ప్రభుత్వం సుమారు 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను (ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి) నిషేధించింది. ఇది యువతలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తమ భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారని భావించిన 1990ల చివర నుండి 2010 మధ్య పుట్టిన యువత జెన్ జీ వీధుల్లోకి వచ్చింది.

నిషేధం పైకి కనిపించేది మాత్రమే..

అందరూ అనుకున్నట్టు సోషల్ మీడియా మీద నిషేధంతోనే యువత రోడ్లెక్కలేదు. దీనివెనుక దశాబ్దాలుగా అధికార వర్గంలో పేరుకుపోయిన అవినీతి , బంధుప్రీతి, నిరుద్యోగం వంటివి కూడా ప్రధాన ఇంధనాలు అయ్యాయి. సామాన్య యువత నిరుద్యోగంతో అల్లాడిపోతుంటే రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతుండడంపై వెల్లువెత్తిన నిరసన ఇందులో ఉంది. ఓలీ, దేవుబా, ప్రచండ ఈ ముగ్గురే అధికారాన్ని అటూ ఇటూగా పంచుకోవడంపై సెగ మొదలైంది.

జెన్ జీ అగ్గి రాజుకుందిలా..

  • సెప్టెంబర్ 8, 2025న ఖాట్మండులోని మైతీఘర్ మండలా వద్ద వేలాది మంది విద్యార్థులు యూనిఫామ్‌లతోనే నిరసనలకు దిగారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది మరణించారు.
  • సెప్టెంబర్ 9, 2025: హింస మరింత పెరిగింది. నిరసనకారులు పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు, ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు.
  • ప్రభుత్వ పతనం: పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు.
  • మధ్యంతర ప్రభుత్వం: మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది.

షెడ్యూల్ కంటే ముందే..

ఈ విప్లవం వల్ల షెడ్యూల్ కంటే ముందే మార్చి 5, 2026న నేపాల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సుమారు 60 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యువత భారీగా ఓటింగ్‌లో పాల్గొని, పాత తరం రాజకీయ నాయకులకు గట్టి సవాలు విసిరారు.

ప్రాధమిక ఫలితాలు..

ఈ ఎన్నికల్లో పాత తరం తమ ప్రభావాన్ని కోల్పోతున్నట్టు ప్రస్తుతం వస్తున్న ఫలితాల సరళి చెబుతోంది. దేశంలో పెను మార్పు సంభవించబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

బాలెన్ షా ప్రభంజనం..

యువతకు ఐకాన్‌గా మారిన మాజీ రాపర్, ఖాట్మండు మాజీ మేయర్ బాలేంద్ర షా (బాలెన్ షా) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) అనూహ్యమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. RSP దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సొంత నియోజకవర్గం -ఝాపా-5 లో బాలేంద్ర షా దూసుకుపోతున్నారు. ఇక పాత తరం నాయకులు దేవూబా, ప్రచండ కూడా పూర్తి స్థాయిలో వెనుక పడ్డారు.

ఓటింగ్ తీరిలా ఉంది..

నేపాల్ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఇది తక్కువ. కానీ, ఇందులో యువ ఓటర్ల శాతం చాలా ఎక్కువ ఉందని అక్కడి ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

జెన్ జీ (Gen Z) ఓటర్లలో దాదాపు 90 శాతం మంది మార్పు కోరుతూ కొత్త పార్టీలకే ఓటు వేసినట్లు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.

పూర్తి ఫలితాలు ఎప్పుడు?

నేపాల్ లో ఓటింగ్ బ్యాలెట్ విధానంలో జరిగింది. అందువల్ల లెక్కింపు ఆలస్యం అవుతుంది. మొత్తం 138 నియోజకవర్గాల్లో లెక్కింపు కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు రావడానికి మరో 2 నుండి 3 రోజులు పట్టవచ్చు. అయితే, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ కొనసాగితే బాలేంద్ర షా నేపాల్‌కు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎవరీ బాలేంద్ర షా..

బాలేంద్ర షా ఇప్పుడు నేపాల్ రాజకేయాల్లో ఒక సునామీ. కేవలం 35 ఏళ్ల వయసులోనే తర తరాలుగా అధికారంలోనే తరించిపోతున్న నాయకులందరినీ ముంచేశారు. ఒక ర్యాపర్ గా మొదలైన ఆయన జీవితం ఖాట్మండ్ మేయర్ గా స్వతంత్రంగా పోటీ చేసి గెలవడంతో విజయవంతమైన రాజకీయ నాయకుడిగా మలుపు తీసుకుంది. ర్యాపర్ గా తన సంగీతంతో యువతను ఉర్రూతలూగించిన ఆయన పాటల్లో ఎక్కువగా దేశంలోని అవినీతి, రాజకీయ అస్థిరతపై ఘాటుగా విమర్శలు ఉండేవి. అవే యువతను ఆయనవైపు ఆకర్షించేలా చేశాయి.

2022లో ఎటువంటి పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖాట్మండు మేయర్‌గా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు షా. సరిగ్గా జెన్ జీ విప్లవం ప్రారంభం అయినపుడు దానిని ఆయన అందిపుచ్చుకున్నారు.

నిరసనల సమయంలో ఆయన యువత పక్షాన నిలబడ్డారు. "ఈ దేశం ఇప్పుడు మీ తరం నాయకత్వంలోకి వెళ్లాలి, సిద్ధంగా ఉండండి" అని ఆయన ఇచ్చిన పిలుపు యువతలో ఉత్సాహాన్ని నింపింది.

ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే.. ఆయన బహిరంగ సభల్లో.. ర్యాలీల్లో ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలు పెద్దగా చేయలేదు. పాదయాత్రలు.. బస్సు యాత్రలు వంటివి చేయలేదు. కొత్త తరం ప్రచారం డిజిటల్ ప్రపంచంలో డిస్కార్డ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల నుంచే అందరినీ కలుపుకుని పోయారు. జెన్ జీ లో ఉత్సాహాన్ని నింపారు.

మేయర్‌గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన పారదర్శకత అంటే మున్సిపల్ సమావేశాలను లైవ్ టెలికాస్ట్ చేయడం వంటివి జెన్ జీ ఓటర్లకు ఆయనపై నమ్మకాన్ని కలిగించాయి.

ఆసక్తికర విషయం ఏమిటంటే.. బాలేంద్ర షా మన దేశంలోనే చదువుకోవడం. ఆయన బెంగళూరు NMIT నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో M.Tech పూర్తి చేశారు.

మొత్తంగా చూసుకుంటే నేపాల్ లో జెన్ జీ ఆలోచనా ధోరణులు.. వారి ఆశలు.. వారి ప్రచార విధానాలు చూస్తుంటే భవిష్యత్ లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జెన్ జీ విప్లవాలు పుట్టుకురావడం ఖాయం అనిపిస్తోంది. నేపాల్ జెన్ జీ విజయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీ యువతలో పెద్ద చర్చినీయాంశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ప్రపంచ రాజకీయాలను మార్చే రోజు త్వరలోనే రావచ్చనే సంకేతాలను బలంగా పంపిస్తోంది. ఎందుకంటే, గత తరంలో ఒక విధానం ప్రజలకు చేరాలంటే రోజులు పట్టేది. ఇప్పుడు సోషల్ మీడియాతో సెకన్లు కూడా పట్టడం లేదు. అదే జెన్ జీ బలం. నేపాల్ లో ఆ బలమే స్పష్టంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories