logo

క్షమను మించిన గుణం లేదు : నెల్సన్ మండేలా

క్షమను మించిన గుణం లేదు : నెల్సన్ మండేలా
Highlights

చరిత్రను మార్చలేం. భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఎన్నోసార్లు ఇది రుజువైంది కూడా. దక్షిణాఫ్రికా మహాత్ముడిగా...


చరిత్రను మార్చలేం. భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఎన్నోసార్లు ఇది రుజువైంది కూడా. దక్షిణాఫ్రికా మహాత్ముడిగా పేరొందిన నెల్సన్ మండేలా జీవితంలో ఎన్నో సంఘటనలు మానవాళికి చాలా పాఠాలు చెబుతాయి. ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన ఒక యధార్ధ సంఘటనను ఆయన మాటల్లోనే..

నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి ఒక హోటల్ వెళ్లాను. స్టీవార్డ్ వచ్చి మా ఆర్డర్ తీసుకువెళ్లిన తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది. సరదాగా మాట్లాడుకుంటూ, మేం తినడం ప్రారంభించేముందు నా దృష్టి ఎదురు టేబుల్ ఒంటరిగా కూర్చున్న వ్యక్తి మీద పడింది. అతని భోజనం ఇంకా రాలేదు. నన్ను అతడు చూడగానే చటుక్కున లేచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అతని ఖర్మ కాలి భోజనం వచ్చింది. అతను నిస్సహాయంగా కూలబడిపోయాడు. నేనతణ్ని చూసి, పలకరింపుగా నవ్వి, నా పక్కన కూర్చోమంటూ, కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను. వెయిటర్ కు సైగ చేయగానే, అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్లాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. మా భోజనం త్వరత్వరగా అవుతోంది. కానీ, అతనికి ముద్ద గొంతు దిగడంలేదు. చేతులు వణుకుతున్నాయి. దిక్కులు చూస్తూ మాటిమాటికీ నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు. మా అందరి భోజనం అయ్యాక తను సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్లిపోయాడు. తనని గమనించిన ఒక మిత్రుడు "బాగా అనారోగ్యం గా ఉన్నట్టున్నాడు. అస్సలు తినలేకపోతున్నాడు. వణుకుతున్నాడు..!" అంటూ ఓ జనాంతిక కామెంట్ వదిలాడు. అప్పుడు నేను "లేదురా..! ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను జైలుశిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ తను. ప్రతిరోజూ నన్ను విపరీతంగా, అకారణంగా కొడుతూ హింసించేవాడు. హింసవల్ల నొప్పులు, బాధతో అరిచీ అరిచీ నా గొంతు ఆర్చుకుపోయి దాహంతో నీళ్లమ్మని అడిగితే, హేళనగా నవ్వుతూ నా మొహం మీద మూత్రం పోసేవాడు. మా అమ్మ పాలకన్నా ఇతని మూత్రాన్నేఎక్కువ తాగాను. మా అమ్మ ప్రేమను నేర్పితే, ఇతడు ఓపిక నేర్పాడు. నన్నిప్పుడు ఈ హోదాలో చూసి భయపడి, వణికిపోతున్నాడు. నేను తనమీద ప్రతీకారం తీర్చుకుంటానేమో, ఉద్యోగం పీకిస్తానేమో, జైలులో వేయిస్తానేమో..! అని భయపడుతున్నాడు. నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు. పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య గోడలు కడితే, క్షమ ఒక్కటి చేస్తుంది. సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా..!" అన్నాను.

(నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా 1994 మే 9 న ఎన్నికయ్యారు)


లైవ్ టీవి


Share it
Top