Top
logo

NASA: అంగారకుడి పై జీవం వెతుకులాటకు నాసా అద్వితీయ ప్రయత్నం!

NASA Perseverance rover successfully lands on Mars
X

అంగారకుడిపై దిగిన నాసా రోవర్ పర్సెవరెన్స్‌ (నాసా ట్విట్టర్)

Highlights

NASA మార్స్ పై జీవం ఉనికిని తెలుసుకోవడానికి నాసా చేస్తున్న ప్రయత్నాల్లో మరో గొప్ప ముందడుగు పడింది.

NASA: మార్స్ (అంగారక గ్రహం) పై జీవం కోసం జరుగుతున్న అన్వేషణలో పెద్ద ముందడుగు పడింది. నాసా ఆధ్వర్యంలో మార్స్ పై అత్యంత ఆధునాతనమైన రోవర్ పర్సెవరెన్స్ విజయవంతంగా అంగారకుడిపై కాలుపెట్టింది. అంగారక గ్రహంపై గతంలో జీవం ఉండేదా అనే అంశంపై ఈ రోవర్ ద్వారా పరిశోధనలు సాగుతాయి. అదేవిధంగా మానవులను మార్స్ పైకి చేర్చడానికి ఉండే అవకాశాలు.. అక్కడ నివాసం ఉండటానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి వంటి విషయాలను ఈ రోవర్ పరిశీలిస్తుంది. అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితులను అధునాతన పరికరాలతో పరీక్షిస్తుంది.

ప్రాజెక్ట్ సాగిందిలా..

గత సంవత్సరం జూలై 30న మార్స్ 2020 ప్రాజెక్టులో భాగంగా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి పర్సెవరెన్స్‌ ను నాసా ప్రయోగించింది. మొత్తం 47.2 కోట్ల కిలోమీటర్ల దూరం 203 రోజుల పాటు ప్రయాణించి శుక్రవారం తెల్లవారుజామున 2.25 గంటలకు అంగారక వాతావరణంలోకి ప్రవేశించింది. ఎన్నో సవాళ్ళతో కూడిన ఈ ప్రాజెక్ట్ లోని అంతిమ ఘట్టం రోవర్ పర్సెవరెన్స్ ను అంగారకుడిపై చేర్చడం.

వాతావరణ రాపిడి వల్ల చెలరేగే తీవ్ర ఉష్ణోగ్రతలను అధిగమిస్తూ.. ఉష్ణ కవచం, పారాచూట్‌, రాకెట్లతో కూడిన స్కైక్రేన్‌ వ్యవస్థ ద్వారా రోవర్‌ సాఫీగా దిగింది. ల్యాండింగ్‌ ప్రక్రియను వ్యోమనౌక స్వయంగా నియంత్రించుకోవడం ఇక్కడ చెప్పుకోవలసిన విషయం. ''అంగారకుడిపై రోవర్‌ విజయవంతంగా దిగిందని సంకేతం వచ్చింది. పర్సెవరెన్స్‌.. సురక్షితంగా ఆ గ్రహంపై అడుగుపెట్టింది'' అని భారత సంతతికి చెందిన ఫ్లైట్‌ కంట్రోలర్‌ స్వాతి మోహన్‌ ప్రకటించగానే కాలిఫోర్నియాలోని నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

విశ్వాన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అంగారక గ్రహం (మార్స్‌)పై అత్యంత అధునాతనమైన, 'తెలివైన' రోవర్‌ 'పర్సెవరెన్స్‌'ను విజయవంతంగా దించింది. 'అరుణ గ్రహంపై గతంలో జీవం ఉండేదా' అన్న కీలక ప్రశ్నకు ఇది సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్‌లో అక్కడికి మానవులను పంపేందుకు అవసరమైన కీలక పరిజ్ఞానాలను ఇది పరీక్షిస్తుంది. అంగారకుడి ఉపరితల, వాతావరణ పరిస్థితులపై అధునాతన పరికరాలతో పరిశీలనలు సాగిస్తుంది. ఈ అద్భుత విజయాన్ని సాధించిన నాసాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు అభినందించారు.

రోవర్ 'పర్సెవరెన్స్' వివరాలు..

- అంగారకుడిపైకి నాసా ప్రయోగాల్లో తొమ్మిదో ప్రయోగం పర్సెవరెన్స్‌ రోవర్. అన్నిటిలోనూ ఇదే అతిపెద్ద, అత్యంత అధునాతన రోవర్. కారు సైజులో..ఆరు చక్రాలతో..1,026 కిలోలు బరువు ఉన్న ఈ రోవర్ ప్లూటోనియం శక్తితో నడుస్తుంది.

- ఈ రోవర్ లో ఏడు సైన్స్‌ పరికరాలు, కెమెరాలు, నమూనా సేకరణ వ్యవస్థ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ''మార్స్‌ ఆక్సిజన్‌ ఇన్‌-సిటు రిసోర్స్‌ యుటిలైజేషన్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (మోక్సీ)'', ''మెడ్‌లీ2'', ''మేడా'' పరికరాలు భవిష్యత్‌లో మానవసహిత యాత్రలకు ఉపయోగపడతాయి. మోక్సీ.. అంగారక వాతావరణంలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ నుంచి ఆక్సిజన్‌ను తయారుచేస్తుంది.

రోవర్ దిగింది ఎక్కడ..

మార్స్ మధ్యరేఖ ప్రాంతానికి ఉత్తర ప్రాంతంలో ఎత్తూపల్లాలతో కూడిన జేజేరో బిలంలో పర్సెవరెన్స్‌ ల్యాండ్ అయింది. అంగారకుడి పై 350 కోట్ల కిందట జీవం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జేజేరో బిలం వెడల్పు 45 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ అప్పట్లో నది, చెరువు కలిసి ఉండవచ్చనేది శాస్త్రజ్ఞుల విశ్లేషణ. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో రెండేళ్ళ పాటు రోవర్ తవ్వకాలు చేసి నమూనాలు సేకరిస్తుంది.

అద్భుత విజయంలో భారత తేజం!

'మార్స్‌ 2020' ప్రాజెక్టులో పలువురు భారత సంతతి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో కీలకంగా డాక్టర్‌ స్వాతి మోహన్‌ గైడెన్స్‌, నేవిగేషన్‌, కంట్రోల్‌ వ్యవహారాల బృందానికి నాయకత్వం వహించారు. హెలికాప్టర్‌ను డాక్టర్‌ బాబ్‌ బలరామ్‌ రూపొందించారు. రోవర్‌ను నడిపే బృందానికి డాక్టర్‌ వందనా వర్మ నేతృత్వం వహిస్తున్నారు.

Web TitleNASA Perseverance rover successfully lands on Mars
Next Story