అమ్మల కోసం ఓ దినం సరిపోతుందా? భారతీయ సంస్కృతి ఏం చెప్పింది? అమ్మలు కోరుకునేదేంటి?

Mothers Day Special Story 08 05 2022 | Mother Importance in Indian Culture | Happy Mothers Day 2022
x

అమ్మల కోసం ఓ దినం సరిపోతుందా? భారతీయ సంస్కృతి ఏం చెప్పింది? అమ్మలు కోరుకునేదేంటి?

Highlights

Happy Mothers Day 2022: నిన్నటి బామ్మలు, నేటి అమ్మలు, రేపటి తల్లులు మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు...

Happy Mothers Day 2022: మే రెండో ఆదివారం వచ్చిందంటే ప్రపంచమంతా మాతృ దినోత్సవాల్లో మునిగిపోతుంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా.. కనీసం ఈ ఒక్క రోజైనా కన్నబిడ్డలందరూ అమ్మలను స్మరించుకుంటారు. మరి అమ్మలేం కోరుకుంటున్నారు? కన్నబిడ్డలు ఏం మిస్సవుతున్నారు? అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పెషల్ ఆర్టికల్...

ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం. అంటే... ప్రపంచ ప్రజలందరూ వాళ్ల అమ్మల కోసం ఆలోచించే ఓ సుదినం. మరి ఈ ఒక్క రోజు అమ్మల కోసం ఆలోచిస్తే సరిపోతుందా? మిగతా రోజుల్లో ఏం చేసినా ఫరవా లేదనుకోవాలా? ఓ సందర్భాన్ని సృష్టించుకొని, ఓ రోజు ఏర్పాటు చేసుకొని పెద్దవాళ్లను గౌరవించుకోవడం.. మన ఇండియన్ సిస్టమ్ కాదు. భారతీయులకు అలాంటి ఖర్మ పట్టలేదు. ఎందుకంటే ఉదయాన లేస్తే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొమ్మని చెప్పే కల్చర్ మనది.

గురువు కనిపించగానే సాష్టాంగపడి నమస్కరించమని, గురువుకు ఎప్పుడూ కృతజ్ఞుడవై ఉండమని చెప్పిన దేశం మనది. మరలాంటప్పుడు అంతా కలిసి మాతృ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలా.. అన్న ప్రశ్న తలెత్తుతుంది. అలాంటి పనుల్ని పనిగట్టుకొని చేయాల్సిన పనేమీ లేదని చెప్పడమే ఈ నాలుగు మాటల ఉద్దేశం. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అమ్మను చూడగానే చేతులెత్తి మొక్కే సంస్కతి మనది. ఎందుకంటే అమ్మ చేసిన త్యాగం, అమ్మ నేర్పిన బుద్ధులు, అమ్మ వహించిన పోషణ భారం.. ఈ ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అమ్మాయో, అబ్బాయో తెలుసుకోగలిగిన ఆత్మ జ్ఞాని, మహా జ్ఞాని అమ్మ.

వాడి కదలికలను బట్టి ఎలాంటి వాడవుతాడో చెప్పగలిగిన అద్భుతమైన ప్రతిభాశాలి అమ్మ. అయితే ఇంగ్లిష్ చదువుల ప్రభావంతో, ప్రతిదానికీ శాస్త్రీయ రుజువులు కావాలంటూ రూల్స్ తయారు చేసుకొని, కఠినమైన కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోయిన దురదృష్టవంతులు మన భారతీయులు. నిన్నటి బామ్మలు నేటి అమ్మలను, నేటి అమ్మలు రేపటి తల్లులను ఎంతో బాధ్యతాయుతంగా తీర్చిదిద్దే అద్భుతమైన వారసత్వ జ్ఞానాన్ని చేజేతులా చిదిమేసుకుంటున్న దురదృష్టవంతులు మన భారతీయులు.

నిన్న మొన్నటిదాకా కనిపించిన ఉమ్మడి కుటుంబాల్లో నాన్న లేని స్థానాన్ని అమ్మే భర్తీ చేసింది. అయితే కాలమాన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దయలేని ఈ కాలం అమ్మ స్థానాన్ని చాలా పరిమితం చేసింది. ఎంతగా అంటే.. ఒక అడుగు వెనక్కి వెళ్లి చూసుకోలేనంత. ఒకప్పుడు పిల్లల అవసరాల గురించి అమ్మా-నాన్నలు ఆలోచించారు. కానీ ఇప్పుడు పిల్లలకు ఏం కావాలో... పిల్లలే డిసైడ్ చేసుకుంటున్నారు. నేటి పేరెంట్స్ పాత్ర నిన్నటి అమ్మా-నాన్నల కంటే కుచించుకుపోతోంది. ఇది మరీ దురృష్టకరం. ఇలా అమ్మ పాత్ర నానాటికీ కుచించుకుపోతోంది. రాబోయే రోజుల్లో అమ్మకు ఎదురవబోయే ప్రమాదాన్ని నేటి తల్లిదండ్రులంతా పసిగట్టాల్సిన అవసరం ఏర్పడింది. రేపటి పేరెంట్స్‎ను అప్రమత్తం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

నానాటికీ తగ్గిపోయిన అమ్మ పాత్రతో అమ్మంటే విలువ లేనిదైపోయింది. విలువ లేని వస్తువును ఇళ్లలో ఎవరు పెట్టుకుంటారు? అందుకే వృద్ధులైన అమ్మలు, నాన్నలు ఓల్డేజ్ హోమ్‎లలో ఒంటరిగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ చూసొచ్చే మ్యూజియమ్ వస్తువులుగా తయారయ్యారు. తమ పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.. కన్నబిడ్డలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూస్తూ తడి ఆరని కళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. క్యాలెండర్ వంక చూస్తూ వాళ్లొచ్చే తేదీలు టిక్ చేసుకుంటూ రోజులు లెక్కిస్తున్నారు.

అలాంటి అమ్మలకు ఈ వయసులో ఏం కావాలి? హోమ్ కు చెల్లించే ఫీజు చెల్లిస్తే సరిపోతుందా? అమ్మలు అంతే కోరుకుంటారా? ఇంకేమీ లేదా? ఆ మాటకొస్తే ఈ వయసులో వారికి డబ్బుతో అసలు పనే లేదు. కన్న కొడుకు, కూతురు ఆప్యాయంగా పిలిచే పిలుపు కోసమే వారి హృదయం తహతహలాడుతుంది. ఉదయాన లేవగానే పిల్లలు పిలిచే పిలుపుతోనే మేల్కోవాలనే చిన్న కోరిక తీరలేక, తీర్చేవారు కనుచూపు మేరలో కనిపించక ఎందరో తల్లులు తల్లడిల్లిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.

మన తల్లులెవరూ.. ఖరీదైన గ్రీటింగ్ కార్డ్స్ మీద గోల్డెన్ కలర్ లెటర్స్‎తో పిల్లలు శుభాకాంక్షలు చెప్పాలని, వాటి మీద తమ పేరు వేయించాలని కోరుకోరు. అలాంటి కమర్షియల్ జాడ్యానికి మన మాతృమూర్తులు ఆమడదూరం. ఆమాటకొస్తే ప్రపంచంలోని ఏ తల్లి కూడా అలాంటి ఆర్భాటాలను కోరుకోదు. వాళ్లు కోరుకునేదల్లా ఒకటే. తన బిడ్డ మాతృ హృదయం తెలిసినవాడైతే చాలు అని. ఈ మాతృదినోత్సవాన ఈ ఒక్క ముక్క గుర్తు పెట్టుకుంటే అమ్మల సమస్యకు పరిష్కారం దొరికినట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories