Top
logo

జాబిలిపై ఆ అడుగుజాడకు ఏభై ఏళ్లు!

జాబిలిపై ఆ అడుగుజాడకు ఏభై ఏళ్లు!
X
Highlights

చల్లని జాబిల్లి కనిపిస్తూనే ఉంటుంది. తన వెన్నెల పువ్వులతో పలకరిస్తూనే ఉంటుంది. కానీ, అందుకోవడానికే ఆమడ దూరంలో...

చల్లని జాబిల్లి కనిపిస్తూనే ఉంటుంది. తన వెన్నెల పువ్వులతో పలకరిస్తూనే ఉంటుంది. కానీ, అందుకోవడానికే ఆమడ దూరంలో ఉంటుంది. చిన్నపిల్లలకు చందమామ కథలు ఇష్టం. చందమామ పాటలు వినడం మరింత ఇష్టం. ప్రేమికులకు వెన్నెల్లో కూచుని కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. అందరికీ ఇష్టమైన మామ.. దగ్గరకి వెళితే ఎలా ఉంటుందో. తరతరాలుగా మనిషికి ఉన్న పెద్ద ప్రశ్న అదే. అక్కడికి వెళ్ళే మార్గం ఉంటుందా? ఇలా గడిచిపోతున్న కాలంలో ఓ సంచలనం.. వెన్నెల మామ పై మానవుడి అడుగుజాడ. సుదూర తీరాలు కాదు..కాదు.. సుదీర్ఘ ప్రయాణాన్ని దాటుకుంటూ చందమామపై కాలు పెట్టిన సంఘటన సంచలనమే కాదు యావత్ ప్రపంచానికీ మధుర ఘటన.

సరిగ్గా అర్థ శతాబ్దం క్రితం..ఈ అద్భుతం జరిగింది. మళ్ళీ ఇప్పటి వరకూ అటువంటి సాహసం ఎవరూ చేయలేదు.. చేసినా, ఎవరూ అక్కడి వరకూ చేరుకోలేదు. కానీ, అప్పుడు అక్కడ పడిన మానవుడి ఒక్క అడుగు ఎన్నో సాంకేతిక అద్భుతాలకు నాంది అయింది.

అపోలోలో అపూర్వంగా..

సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1969 జూలై 20.. అపోలో11 వ్యోమనౌక ముగ్గురు వ్యోమగాములతో రోదసిని దాటి చంద్రునిపై క్షేమంగా ఆగింది. అందులోంచి ఓ మనిషి చందమామ పై తొలిసారిగా కాలు పెట్టాడు. తన అడుగును తానే నమ్మలేకపోయాడు. ఆ వ్యక్తే నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌. అతనితో ఉన్న వ్యోమగాములు బజ్‌ ఆల్డ్రిన్‌, మైఖెల్‌ కోలిన్స్‌.

చందమామ మీద ఆర్మ్‌స్ట్రాంగ్ కాలుపెట్టిన తరువాత ఆల్డ్రిన్ కూడా అతనికి జత కలిశాడు. ఇద్దరూ దాదాపు రెండు గంటలకు పైగా జాబిల్లిపై తిరుగాడారు. అక్కడ తమ దేశపు జెండా ఎగురవేశారు. తమ దేశాధ్యక్షుడితో మాట్లాడారు. పరిశోధనల కోసం 21.5 కిలోల పదార్థాలను సేకరించారు.

జాబిలిపై తొలి పలుకిదే!

'ఇది మనిషి వేసిన మొదటి చిన్న అడుగు. మానవజాతి వేసిన పెద్ద పురోగతి' నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ మాట్లాడిన తొలి మాట. ఆ మాట నిజమైంది. మానవజాతి ఇప్పుడు ఎంతో పురోగతి సాధించింది.

అడుగులు పదిలం..


అప్పుడు నీల్ వేసిన అడుగు ఇప్పటికీ అక్కడ కనిపిస్తుందట. గాలి లేకపోవడంతో అవి చెరిగిపోలేదు కానీ, వారు ఎగురవేసిన అమెరికా జెండా మాత్రం అంతరిక్ష నౌక బయలుదేరేటప్పుడు వచ్చిన వేడికి మాదిపోయిందని శాస్త్రజ్ఞులు చెబుతారు.

ప్రయాణం మొదలైందిలా..

1962లో అమెరికా అధ్యక్షుడు జాన్‌ కెనెడీ చందమామ విశేషాల్ని తెలుసుకోవాలనే ఆలోచనకు బీజం పోశారు. దాదాపు మూడేళ్ళు పరిశోధనల తరువాత ఎట్టకేలకు 1969 జులై 16న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్‌ సెంటర్ నుంచి శాటర్న్‌ వీ రాకెట్‌లో అపోలో 11 వ్యోమనౌక జాబిలి వైపు తన ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా నాలుగు రోజులకు చందమామపై అడుగిడింది. సకల మానవాళిని సంబరాల్లో ముంచింది.


ఇప్పటికి ఏభై ఏళ్ళు పూర్తయ్యాయి. తరువాత ఎన్నో దేశాలు జాబిలిని చేరాలని ప్రయత్నాలు చేశాయి. చేస్తున్నాయి. తాజాగా మన దేశం చంద్రయాన్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చంద్రయాన్ 1 దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఆదివారం చంద్రయాన్ 2 ప్రారంభం కాబోతోంది. త్వరలోనే చందమామను భారతీయుడు ముద్దాడే సన్నివేశాన్ని చూస్తామనే హామీని మన ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్తున్నారు.

Next Story