Truck Drivers: డ్రైవరన్నలకు ఎంత కష్టం.. ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు

Truck Drivers
x

Truck Drivers: డ్రైవరన్నలకు ఎంత కష్టం.. ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు

Highlights

Truck Drivers: భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా ట్రక్ డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది.

Truck Drivers: భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా ట్రక్ డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలోని ట్రక్ డ్రైవర్లు బలహీనమైన కంటి చూపు, మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక ఒత్తిడి, అధిక బరువు, రక్తపోటు, షుగర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించారు.

ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 55.1% ట్రక్ డ్రైవర్లు కంటి చూపు బలహీనతతో బాధపడుతున్నారని తేలింది. అదే విధంగా వీరిలో 53.3% మంది దూర దృష్టి కోసం అద్దాలు అవసరం కాగా, 46.7% మంది కంటి చూపును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దేశంలో 33.9% డ్రైవర్లు మోస్తరు ఒత్తిడికి గురవుతుండగా, 2.9% మంది తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇక 44.3% ట్రక్ డ్రైవర్లు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. 57.4% డ్రైవర్లలో రక్తపోటు సాధారణ స్థాయిని మించి ఉంది. 18.4% డ్రైవర్లలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు.

పరిష్కారం మార్గాలు..

ట్రక్కులు భారతదేశ లాజిస్టిక్స్ వ్యవస్థకు వెన్నెముక. కానీ, ట్రక్ డ్రైవర్లు దీర్ఘకాలం పాటు పని చేయడం, కుటుంబాలకు దూరంగా ఉండడం, సరైన విశ్రాంతి, పోషకాహారం అందుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవి వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. భారత రవాణా రంగం 70% ట్రాఫిక్‌తో, లాజిస్టిక్స్ ఖర్చు 14% - 16% వరకు పెరగడంతో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.

ఇదలా ఉంటే దేశంలో ప్రతి 100 ట్రక్కులకు కేవలం 75 మంది డ్రైవర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి డ్రైవర్ శిక్షణ, వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చే కార్యక్రమాలు చేపడుతామని మంత్రి తెలిపారు. డిజిటల్ టెక్నాలజీలు, మొబైల్ యాప్‌లు డ్రైవర్లకు మద్దతుగా ఉంటాయని అన్నారు. దీంతో దేశంలో డ్రైవర్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories