Top
logo

మహాత్మ జ్యోతిరావుపూలే 129 వ వర్ధంతి

మహాత్మ జ్యోతిరావుపూలే 129 వ వర్ధంతి
X
Jyothirao Pule File photo
Highlights

కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు.

కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తాను అండగా నిలిచాడు. అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను రూపొందించారు.స్త్రీలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అతను ఎవరో కాదు జ్యోతిరావుపూలే.. ఈ మహాత్ముడు శారీరకంగా అందరికీ దూరమై నేటికి 129 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఈ‍యన ఏడాదిలోపే పూలే తల్లి మరణించింది.

ఆయన తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్మి వారి కుటుంబాన్ని పోషించేవాడు. కాలక్రమేణా భారతదేశంలో పీష్వా పరిపాలన ప్రారంభం అయింది. దీంతో ఆ కాలంలో కూరగాయల వ్యాపారం మానేసి పూల వ్యాపారం మొదలు పెట్టాడు పూలే తండ్రి. అలా పూల వ్యాపారం చేస్తూ ఉండడం వలన వారి ఇంటి పేరు ఫూలే గా మారింది. 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో చేరి తన ప్రాథమిక విద్యనభ్యాసాన్ని ప్రారంభించాడు. కొన్ని రోజులకు చదువును మానేసి తన తండ్రికి వ్యవసాయంలో సాయం చూస్తూ ఉండేవాడు. పనులు ముగించుకుని రాత్రి పూట లాంతరు ముందు కూర్చుని చదువుకునేవారు పూలే. అది గమనించిన ఒక ముస్లిం టీచర్, మరో క్రైస్తవ పెద్వ మనిషి పూలే తండ్రితో మాట్లాడి తన చదువును తిరిగి కొనసాగించేలా ఒప్పించారు. 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు.

తన చదువును కొనసాగిస్తున్న సమయంలోనే అంటే పూలే 13వ ఏట 9ఏళ్ల సావిత్రి బాయితో వివాహం జరిపించారు. తన చదువులు పూర్తి చేసుకున్న అనంతరం పూల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. 1848లో జరిగిన ఒక సంఘటన పూలేని గాయపర్చింది. దీంతో పూలే అప్పటి నుంచి వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. దాంతోపాటు సమాజంలో స్త్రీలు విద్యావంతులు కావాలనే నిర్ణయానికొచ్చాడు. తన భార్య సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపించాడు. 1948లో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించాడు. ఆయన స్థాపించిన పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించాడు. అతను తక్కువ కులానికి చెందినవారు కావడంతో ఆ పాఠశాలలో విద్యను బోధించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన భార్య సావిత్రి బాయి పూలేని ఆ పాఠశాలకు మొదటి మహిళా ఉపాధాయురాలిగా నియమించాడు.

పాఠశాలను నడిపించడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాస్తకూడా వెనక్కి తగ్గకుండా పాఠశాలను నడిపించాడు. క్రమంగా పాఠశాలకు ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలను ప్రారంభించారు.

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. చిన్న పిల్లలని ముసలివారికిచ్చి పెళ్ళి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. దీంతో వితంతు వివాహాలను చేయాలని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు.1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. అంతేకాక వింతంతువుగా మారిన గర్భిణీ స్ర్తీల కోసం 1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించాడు. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. 1871 సత్యశోధక సమాజం తరపున 'దీనబంధు' వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. సమాజానికి ఇన్ని మంచి మంచిపనులను చేసిన ఆయన దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ 1890 నవంబరు 28న తన తుది శ్వాస విడిచాడు.

Web TitleMahatma Jyothirao pule 129th Death anniversary
Next Story