ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ఇవాళ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
x
Highlights

అమ్మ భాష కు ఆదరణ కరువవుతుందా..? అంతరించిపోయే దశలో ఉందా...? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

అమ్మ భాష కు ఆదరణ కరువవుతుందా..? అంతరించిపోయే దశలో ఉందా...? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రపంచీకరణతో మాతృభాషలకు కష్టకాలమొచ్చింది. పరభాష మోజుతో అమ్మభాష మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. గ్లోబలైజేషన్ తర్వాత ఆంగ్ల భాషకు ప్రాముఖ్యతనిస్తూ.. మాతృభాషలకు మంగళం పాడుతున్నారు. అంతర్జాతీయ మాతృభాషదినోత్సవం కనుమరుగవుతున్న తెలుగుభాషపై స్పెషల్ స్టోరీ.

వందల, వేల సంవత్సరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ సంపదగా అందించేది తల్లిభాష ఒక్కటే. తల్లిదండ్రులు, కుటుంబం, పుట్టిపెరిగిన భౌగోళిక పరిస్థితులు, సమాజం నుంచి అలవడే సహజమైన భాష అది. అన్ని భాషలకు ఉన్నట్లే తెలుగుకు సైతం ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు గొప్ప సాహితీ సృజన చేశారు. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన అలాంటి అమృతభాష మృతభాషగా మారుతుండటం సాహితీవేత్తలను కలవరపెడుతోంది.

అమ్మ అనే పిలుపుతోనే తెలుగు భాష మాధుర్యాన్ని పంచుతోంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు చివరి మూడు నెలల్లో తల్లి మాటలు వింటూ తల్లిభాష నేర్చుకుంటాడని, పుట్టగానే ఆ మాతృ భాషలో ఏడుస్తాడని జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అలాంటి తేనేలొలుకు తెలుగు భాష రోజురోజుకీ తన ఉనికిని కోల్పోతుంది. పిల్లలు తెలుగులో చదివితే, మాట్లాడితే భవిష్యత్ ఉండదనే భావన తల్లిదండ్రుల్లో నానాటికి పెరిగిపోతుంది.

తెలుగు మాతృభాషగా ఉన్నట్టే.. లక్షలాది మంది గిరిపుత్రులకు ఎన్నో మాతృ భాషలున్నాయి. ఇప్పుడు తెలుగుతోపాటు ఇతర భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక భాషలు అంతరించగా..ఇంకా కొన్ని అంతరించిపోయేందుకు దగ్గర్లో ఉన్నాయి. ఒక భాషపై మరొక భాష ప్రభావాన్ని చూపుతోందని, తెలుగు భాష ప్రభావం గిరిజనుల భాషపై పడుతోందనిపలువురు సాహితీ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన భాషల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు.

ఇంగ్లీష్ అవసరమే కానీ.. ఉద్యోగం కోసం అది ఆఫీసుకే పరిమితం కావాలంటున్నారు సాహితీవేత్తలు. మరి తెలుగు భాషపై మమకారం పెంచుకొని రేపటి తరాలకు తెలుగు భాషతో మిగతా భాషలకు ఉన్న తేడా ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషలోనే కమనీయ పదాలు, వాక్యాలు, సాహిత్యం పట్ల అవగాహన కల్పించాల్సి ఉంది. అప్పుడే మన మాతృభాష తెలుగు ప్రపంచ భాషలన్నింటికీ వెలుగునిస్తుంది.

ప్రస్తుతం ఎక్కడికెళ్లినా ఇంగ్లీషు తప్పనిసరన్న పరిస్థితిల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల 5 వందల భాషల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అందులో అత్యధికంగా భారత్ లో 197 భాషలు అంతరించే దశకు చేరుకున్నాయి. భాష అంతరిస్తే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికిగానీ, తిరిగి బతికించుకోడానికి గానీ అనేక సంవత్సరాలు, అంతులేని కృషి, శ్రమ అవసరమవుతాయి. ఒక భాష అంతరిస్తే ఒక జాతి జీవం ఆగినట్టే. అందుకే మాతృభాషను కాపాడుకునే బాధ్యత అందరిదీ. ఇప్పటికైనా ప్రభుత్వాలు తెలుగుభాష అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories