అంగారక గ్రహం పైకి మీపేరు చేరాలనుందా? అది సాధ్యమే.. ఎలానో చూడండి!

అంగారక గ్రహం పైకి మీపేరు చేరాలనుందా? అది సాధ్యమే.. ఎలానో చూడండి!
x
Image Courtesy NASA
Highlights

రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లూ.. ఇది పాత పాట.. పాత మాట.. పంపాము అందరి పేర్లూ మార్స్ పైకీ అనేది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పాడుతున్న పాట. అవును, నాసా ఆసక్తి గల వారి పేర్లను అంగారకుడి పైకి పంపిస్తోంది.. దానికోసం మీ పేర్లను నమోదు చేసుకోవటం ఎలా అనేది తెల్సుకోండి మరి..

అంతరిక్షం విశేషాలను వింటుంటేనే మనకి ఒళ్లు గగుర్పొడుస్తుంది. అసలు ఆ సంగతులు మన మతులు పోగొట్టేస్తాయి. సాధారణ ప్రజలకు ఆకాశాయానేమే ఓ పెద్దకల. ఇంకా అంతరిక్ష యానం గురించి చదివినా.. విన్నా.. ఓ సినిమా చూసినా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇక ఇతర గ్రహాల పైకి మానవులు వెళ్ళడం అనేది అత్యంత కష్టతరమైన పని. శాటిలైట్ లు .. ల్యాండర్ లు.. రోవర్ లు ఇలా వేటిని పంపాలన్నా బోలెడంత రిస్కుతో కూడిన వ్యవహారం. శాస్త్రవేత్తలు వాటిని పంపించడానికే ఎన్నో ఇబ్బందులు పడతారు. మొన్నటికి మొన్న మన శాస్త్రవేత్తలు ఇటువంటి ఇబ్బందినే పడిన విషయం తెలిసిందే.

ఇక పొతే అంగారక గ్రహం పైకి అమెరికాకు చెందినా నాసా సంస్థ ఒక ఉపగ్రహాన్ని పంపిస్తోంది. దాని పేరు నాసా మార్స్ 2020. దీని ప్రత్యేకత ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. నిజానికి ఆ ఉపగ్రహాన్ని మార్స్ మీద ఉన్న పరిస్థితులను తెలుసుకోవడం కోసం పంపిస్తున్నారు. అయితే, దీనితో పాటు ఆసక్తి ఉన్న మానవుల పేర్లు ఒక చిప్ లో పెట్టి అక్కడికి పంపించడానికి అన్నీ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే తమకు ఆసక్తి ఉంటే నాసా ఇచ్చిన వెబ్ సైట్ లో తమ పేరు నమోదు చేయవచ్చు.

మనం వెళ్ళలేకపోయినా మన పేరైనా వెళుతుంది కదా. అదీ ఓ సరదానే కదా.

ఇది ఎటువంటిది అంటే.. మనం ఎక్కడైనా ప్రత్యెక ప్రదేశాల్ని చూడటానికి వెళ్ళినప్పుడు మన పేర్లు వారి పేర్లు అక్కడి రాళ్ళ మీదో, చెట్ల మీదో రాసి సరదా పడుతుంటాం కదా. అలాంటిదే ఇది కూడా. నాసా ఆలోచన కూడా అదే కావచ్చు.

నాసా పంపించ బోయే రోవర్ 2020 జూలై 17వ తేదీన భూమి నుంచి బయల్దేరి 2021 ఫిబ్రవరి 18వ తేదీన అంగారకుడిపై ల్యాండ్ అవుతుంది. ఆ తరువాత అది అక్కడి మట్టి, ఇతర పదార్థాలను సేకరించి విశ్లేషించి.. గతంలో అంగారక గ్రహంపై జీవుల మనుగడ ఉండేదా.. లేదా.. అనే విషయాలను విశ్లేషించి భూమికి ఆ వివరాలను పంపి కొంత కాలం అయ్యాక వెనక్కి వస్తుంది. అయితే ఆ రోవర్‌తోపాటు మన పేర్లు నిక్షిప్తమై ఉన్న ఓ మైక్రో చిప్‌ను కూడా నాసా అంగారకుడిపైకి పంపుతుంది.

అంగారకుడి పైకి తమ పేరు చేరాలనుకునేవారు https://mars.nasa.gov/participate/send-your-name/mars2020 అనే వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో తమ వివరాలను నమోదు చేయాలి. దీంతో ఆ పేర్లన్నింటినీ ఒక మైక్రో చిప్‌లో పొందుపరిచి మార్స్ రోవర్‌లో స్టోర్ చేస్తారు.ఆ రోవర్ అంగారకుడిపై దిగగానే ఆ చిప్‌ను అక్కడ విడిచిపెడుతుంది. అయితే ఈ పేర్ల నమోదుకు మరో 18 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 30వ తేదీ లోపు ఔత్సాహికులు తమ పేర్లను పైన చెప్పిన సైట్‌లో నమోదు చేసుకుంటే చాలు.. ఆ పేర్లు అంగారకుడిపైకి వెళ్లబోయే రోవర్ మైక్రోచిప్‌లో స్టోర్ అవుతాయి. మరింకెందుకాలస్యం.. మనం ఎలాగూ ఆ గ్రహం మీదకు వెళ్లలేం కదా. కనీసం మన పేరైనా వెళ్లిందని సంతోషించవచ్చు. వెంటనే ఆ సైట్‌లో మీ పేరును రిజిస్టర్ చేసుకోండి మరి..!




Show Full Article
Print Article
More On
Next Story
More Stories