Bird Flu: బర్డ్‌ఫ్లూ అంటే ఏంటి.. ఇది ఎలా వ్యాపిస్తోంది?

Bird Flu
x

Bird Flu

Highlights

Bird Flu: బర్డ్‌ఫ్లూ‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కోళ్లు మరణిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి కోళ్లను రాకుండా సరిహద్దులోనే నిలువరిస్తున్నారు.

Bird Flu: బర్డ్‌ఫ్లూ‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కోళ్లు మరణిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి కోళ్లను రాకుండా సరిహద్దులోనే నిలువరిస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో కూడా కోళ్లు మరణించాయి. బర్డ్ ఫ్లూ‌తో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పశుసంవర్ధకశాఖ అధికారులు అలర్టయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలి మండలం కానూరు ఆగ్రహరంలోని ఫారాల నుంచి పంపిన రెండు శాంపిల్స్ బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది. దీంతో వెటర్నరీ డిపార్ట్ మెంట్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధి సోకిన కోళ్లను పూడ్చిపెట్టాలని ఆదేశించారు.

ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో కూడా కోళ్లకు ఈ వైరస్ సోకింది. దీంతో వందల కోళ్లు మరణించాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా వందల కోళ్లు మృత్యువాత పడ్డాయి. బాన్సువాడలో కోళ్లఫామ్‌లు ఖాళీ అయ్యాయి.బాన్సువాడ, బీర్కూర్, వర్ని, మొస్రా మండలాల్లో వందకు పైగా కోళ్లఫామ్స్ మూతపడ్డాయి.

బర్డ్‌ఫ్లూ అంటే ఏంటి?

బర్డ్‌ఫ్లూ వ్యాధికి హెచ్ 5 ఎన్ 1 అనే వైరస్ కారణం. ఇది అంటువ్యాధి. పక్షులు, జంతువులతో పాటు మనుషులకు కూడా ఇది వ్యాపిస్తోంది. యూరప్, ఆసియా దేశాల్లో తొలుత బాతుల్లో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే హెచ్ 5 ఎన్ 1 వైరస్ ను 1996లో చైనా గుర్తించింది. పక్షుల రెట్టలు, లాలాజలం, కలుషిత ఆహారం, నీటి ద్వారా ఇది వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకిన పక్షులు, జంతువులతో ఎక్కువ సమయం ఉన్న మనుషులకు కూడా ఇది వ్యాపిస్తోంది.

అధిక ఉష్ణోగ్రతల్లో బర్డ్ ఫ్లూ వైరస్ బతకదా?

హెచ్ 5ఎన్ 1 వైరస్ అధిక ఉష్ణోగ్రతల్లో బతకదు సాధారణంగా 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఈ వైరస్ జీవించదు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువుల మాంసం తినొచ్చా లేదా అనే అనుమానం కూడా వస్తోంది. మాంసం వండే సమయంలో అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తారు. ఆ సమయంలో ఈ వైరస్ బతకదు. మాంసం, గుడ్డును కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద ఉడికిస్తారు. దీంతో ఈ వైరస్ ప్రభావం ఉండదని పశు వైద్యాధికారులు చెబుతున్నారు.

పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు పడిపోయాయి. హైదరాబాద్ లో కిలో చికెన్ 200 ల నుంచి 150 వరకు పడిపోయింది. రెండు రోజుల క్రితం వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ను 220లకు విక్రయించారు. బర్డ్ ఫ్లూ భయంతో ఫిష్, మటన్ కోసం వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories