Top
logo

Guru Purnima 2020:గురుపూర్ణిమ విశిష్టత!

Guru Purnima 2020:గురుపూర్ణిమ విశిష్టత!
X
Guru Purnima 2020 representational image
Highlights

Guru Purnima 2020:అమ్మ..నాన్న.. ప్రేమతో పెంచగలరు. తమకు తెలిసిన కొన్ని విషయాలను చెప్పగలరు. కానీ, గురువు.. సమస్త లోకాన్నీ చదవడం ఎలానో నేర్పిస్తాడు. కష్టం.. సుఖం.. సంతోషం..బాధ.. వీటి మధ్య ఉండే సన్నని గీతను గురువు మాత్రమె చెప్పగలడు. గురువు నేర్పిన పాఠాలే భవిష్యత్ జీవితానికి పునాదులుగా నిలుస్తాయి. రేపు (జూలై 5) గురుపూజా మహోత్సవం ఈ సందర్భంగా గురుపూర్ణిమ విశిష్టతలు మీకోసం..

గురు బ్రహ్మ..గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

'గు'' అంటే అంధకారం, చీకటి అని అర్థం. ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఝానమనే చీకటిని తొలగించి జ్ఝానాన్ని అందించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది. పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. అయితే అంతటి గురువులను పూజించడానికి ఓ రోజు ఉండడం, దాన్ని గురుపూర్ణిమగా జరపుకోవడం, ఆరోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. అయితే అసులు గురి పూర్ణిమ ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకోవాలి? విశిష్టత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము?

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఝానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఝాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. అంతే కాదు వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ గురుపౌర్ణమి రోజున వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

గురుపౌర్ణమి విశిష్ఠత

అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో? తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధ ఉంది. పూర్వం వారణాశిలో ఓ పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి', ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరు ఇరువురు ప్రతి నిత్యం దైవ ఆరాధనలో, ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారట. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా వారికి ఇంకా సంతాన భాగ్యమం కలగలేదట. అయితే ప్రతిరోజు వ్యాసభగవానులు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధికి తెలుస్తుంది. అప్పుడు ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని వేదవతి ప్రతిరోజు వేయికళ్ళతో వ్యాస మహర్షిని వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే వేదవ్యాసుడు ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడై గంగానది స్నానానికి వెలుతుండాడు. అది చూసిన వేదనిధి వెంటనే వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే వేదనిధి ఆయన పాదాలను మాత్రము వదలకుండా ఒకే పనిగా వేడుకుంటూ ఉంటాడు. మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.

వేదనిధి మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని గమనిస్తాడు. అటు పిమ్మట వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీస్తాడు. ఆ తరువాత వేదనిధిని ఏమి కావాలో కోరుకోమంటారు. ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేదనిధి వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

వ్యాసున్ని కలిసిన సంతోషంతో ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన విషయాన్ని వివరిస్తాడు. ఆ తురువాతి రోజున ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వ్యాస మహర్షి వారిగృహానికి విచ్చేస్తాడు. దీంతో సంబ్రమాశ్చర్యాలకు లోనైన వేదనిధి దంపతులు మహర్షిని సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. ఆ తరువాత దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

వారి ఆతిధ్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతుష్ఠులైన ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు అని బదులు పలుకుతారు. ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.

వేదవ్యాసుని మానవజాతి మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. అందుకే వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుతారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


Web TitleGuru Purnima 2020: The story behind Gurupurnima and the tradition history of Gurupuja on the eve of Gurupurnima on 5th July
Next Story