Ganesh Chaturthi 2020: కళ తప్పిన వినాయకచవితి

Ganesh Chaturthi 2020: కళ తప్పిన వినాయకచవితి
x
Highlights

Ganesh Chaturthi 2020: గణపతికి పూజలు చేసేందుకు వాడ వాడలా నెలకొనే పోటీ ఈ సంవత్సరం కనబడటం లేదు! కరోనా మన జీవితాలకు ఎటువంటి హాని చేసిందో కదా!

పందిళ్ళ సందళ్ళు లేవు. కుర్రాళ్ళ కేరింతల మధ్య విగ్రహాల ఊరేగింపులు లేవు.. వీధి వీధినా కనిపించే వినాయకుని వేడుకల హంగామా లేదు. ఇంటింటా ప్రతి ఏటా కనిపించే ఉత్సవ ఉత్సాహం అసలు లేదు. వినాయకుని పండగ అంటే ఉండే అసలైన మజా లేదు. నిశ్శబ్దంగా.. నిర్లిప్తంగా.. నిర్వేదంగా.. భక్త జనకోటి స్వామీ ఏమిటిది? అనుకుంటూ మనసులోనే మొక్కుకుంటున్న పరిస్థితి. బోసిపోయిన వీధుల్ని చూసి ప్రతి హృదయం భోరుమంటోంది. విధి వైచిత్రమా.. దైవ పరీక్షో అర్థంకాని పరిస్థితిలో లంబోదరుని వేడుకల కోసం సంవత్సరం అంతా ఎదురుచూసిన భక్త కోటి ప్రస్తుతం మాస్క్ ల వెనుక దాగిపోయిన మోములో కోల్పోయిన కళతో ఇంటికే పరిమితమైన పండగను అన్యమనస్కంగానే పూర్తీ చేసుకున్నారు. చవితి సందడిలో వినాయకుని విగ్రహాలను సిద్ధం చేసి అవి అందించిన ఆదాయంతో సంవత్సరం అంతా బ్రతికే అల్పజీవులు భుక్తి కోల్పోయి దేవుడా! అంటున్నారు. శుభాకాంక్షల వెల్లువతో నెట్టిల్లు మురిసిపోతున్నా ఆ శుభాభినందనల వెనుక కళ తప్పిన వినాయకచవితిని తలుచుకుని భోరుమంటోంది.

పండగంటే కొత్తబట్టలు..పిండివంటలే కాదు సామాజిక వేడుక కూడా అని ప్రతి సంవత్సరం వాడవాడల్నీ తన మూషిక వాహనం పై చుట్టేసే ఏకదంతుడు ఏకాకిలా నిలబడి నిశ్శబ్దంగా చూస్తుండిపోయాడు. వినాయక చవితి అంటే ఊరంతా వేడుకల కవరేజి కోసం పరుగులు పెట్టె జర్నలిస్టు మిత్రులు స్తబ్దుగా ఒకింత నిర్లిప్తంగా తమ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. పందిళ్ళ సందడిలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటూనే..హబ్బా ఏమిటీ గోల.. మాకు మాత్రం పండగ ఉండదా అంటూ ముద్దుగా విసుక్కునే పోలీసు సోదరులు బావురుమంటున్న వీధుల్ని చూసి మనసులోనే ఏమిటి ఇదంతా అని ఫీలవుతున్నారు. పాలవెల్లి.. పత్రీ..పలుకూ..ఉలుకూ లేకుండా ఉసూరు మంటున్నాయి.

కరోనా కష్టం మన సరదాల్ని కాష్టంలా కాల్చేస్తోంది. ప్రతి ప్రతి ఊరూ..ప్రతి వీధి.. ప్రతి ఇల్లూ.. ప్రతి హృదయం ఆ వినాయకుని చల్లని చూపుతో కరోనా మంటలు చల్లారిపోవాలని కోరుకుంటున్నాయి. విఘ్నరాజుని ఆశీస్సులతో ప్రపంచ రూపు రేఖల్ని మార్చేస్తున్న కరోనా కాళ్ళు విరిగి మూలకు చేరాలని కోరుకుంటోంది భక్త జనాళి. వీధి వీధి సందడి లేకపోయినా గణపతిని ప్రతి హృదయంలోనూ కొలువుతీర్చి నమస్సుమాంజలులు ఘటిస్తున్నారు.

వినాయకచవితి వేడుకలు లేకపోయినా.. మనస్సున కొలువై ఆదిపూజలందుకునే పార్వతీసుతుడు అందరి ఆకాంక్షలు తీర్చాలని కోరుకుంటోంది హెచ్ఎంటీవీ.

Show Full Article
Print Article
Next Story
More Stories