Fact Check: ప్రజల ప్రాణాలతో మెట్రో అధికారుల చెలగాటం.. నిజమెంత?

Fact Check: ప్రజల ప్రాణాలతో మెట్రో అధికారుల చెలగాటం.. నిజమెంత?
x
Highlights

ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? ఈ అనుమానం మీకు వస్తే దానిలో ఏమాత్రం తప్పులేదు. ఎవరైనా పొరపాట్లను సరిచేసుకుంటారు. అది అవసరం కూడాను. అయితే, తప్పిదాలను కప్పిపెట్టాలనుకోవడం ఎక్కడైనా క్షమార్హం కాదు. అందులోనూ, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయాల్లో నిర్లక్ష్యాన్ని సహించలేము. హైదరాబాద్ మెట్రో అధికారుల తీరు చూస్తే, వారికి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నట్టు కనిపించడం లేదు.

ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? ఈ అనుమానం మీకు వస్తే దానిలో ఏమాత్రం తప్పులేదు. ఎవరైనా పొరపాట్లను సరిచేసుకుంటారు. అది అవసరం కూడాను. అయితే, తప్పిదాలను కప్పిపెట్టాలనుకోవడం ఎక్కడైనా క్షమార్హం కాదు. అందులోనూ, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయాల్లో నిర్లక్ష్యాన్ని సహించలేము. హైదరాబాద్ మెట్రో అధికారుల తీరు చూస్తే, వారికి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నట్టు కనిపించడం లేదు.

కొద్ది రోజుల క్రితమే అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద గోడ ప్లాస్తింగ్ పెచ్చులూడి ఒక యువతి పై పడి ప్రాణాలు హరించిన సంఘటన ఇంకా మన కళ్ళముందు మెదులుతూనే ఉంది. ఈ నేపధ్యంలో మెట్రో రైల్లో భద్రత ఎలా ఉన్నా ఆ స్టేషన్ల కింద నుంచి వెళ్ళే ప్రజల భద్రత పై లెక్కలేనన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఒక ప్రమాదం జరిగితే ప్రజలందరి కళ్ళూ ఆ ప్రమాద కారకాలపై కొన్ని రోజులు ఉంటాయి. ఉదాహరణకు రైలు ప్రమాదం జరిగింది అనగానే రైలు ప్రయాణం విషయంలో కొద్దిగా ఆలోచించడం సహజం. ఏదైనా భవంతి కూలిపోయింది అంటే.. మనం ఉన్న భవనం క్షేమమేనా అని అందరూ ఆలోచిస్తారు. సరిగ్గా ఇదే జరిగింది హైదరాబాద్ మెట్రో ప్రమాద విషయంలో. ఈ ప్రమాదం పట్ల మెట్రో ఎలా స్పందించింది అనేది కాసేపు పక్కన పెడితే, సాధారణ ప్రజలు మాత్రం అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్ల వద్ద పరిస్థితులను కూలంకషంగా గమనిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద పరిస్థితిని ఒక ఔత్సాహికుడు ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో అతి ప్రమాదకరమైన పగుళ్ళు ఉప్పల్ మెట్రో స్టేషన్ గోడలపై కనిపించాయి. అవి చూడటానికి సాధారణ పగుళ్ళుగా కనిపించలేదు. ప్లాస్టింగ్ లో పగుళ్లుగా ఏ మాత్రం కనిపించడం లేదు. దీంతో మెట్రో ప్రమాదకరంగా ఉందంటూ ఆ వ్యక్తీ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇది వైరల్ గా మారింది. ఈ ఫోటో రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

ఇది నిజమేనా?


ఈ విషయాన్ని ద్రువీకరించుకోవడానికి హెచ్ ఎం టీవీ వెబ్ బృందం ప్రయత్నించింది. ఉప్పల్ స్టేడియం వద్ద ఆ ఫోటో ప్రకారం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించింది. అక్కడ షాకింగ్ విషయం కనిపించింది. ఫోటోలో పగుళ్ళుగా కనిపించిన

ప్రాంతంలో ప్లాస్టింగ్ చేసి కవర్ చేశారు. స్పష్టంగా ఈ విషయం అక్కడ కనిపించింది. అసలు ఆ పగుళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని కప్పిపెట్టి.. పైపైన ప్లాస్తింగ్ చేసి వార్త అవాస్తవమని చిత్రీకరించడానికి మెట్రో అధికారులు ప్రయత్నించినట్టు స్పష్టం అవుతోంది.

నిపుణులు ఏమంటున్నారు..

ఈ విషయంలో సివిల్ ఇంజనీరింగ్ లో అనుభవం ఉన్న కొందరు వ్యక్తులకు ఈ ఫోటోలను చూపించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసింది హెచ్ ఎం టీవీ వెబ్ బృందం. ఆ ఫోటోలను పరిశీలించిన వారు '' ఫోటోలు చూసి అది ఎంత ప్రమాదమో చెప్పగలిగే పరిస్థితి ఉండదు కానీ, ఫోటోలో ఉన్న ప్రకారం చూస్తే.. అవి ప్లాస్టింగ్ పగుళ్ళలా కనిపించడం లేదు. ఒకవేళ అవి ప్లాస్టింగ్ పగుళ్లు అయినా అలా అక్కడికక్కడ పూడ్చడం వల్ల సమస్య పరిష్కారం కాదు. వీరు సిమెంట్ పెట్టి పూడ్చినట్టుగా కనిపిస్తున్న ప్రాంతం నుంచి ప్లాస్టింగ్ ఎప్పుడైనా ఊది కింద పడే ప్రమాదం ఉంటుంది. అంత ఎత్తునుంచి చిన్నప్లాస్టింగ్ పెచ్చు పడినా అంది ప్రాణాంతకమే అవుతుంది. ప్లాస్టింగ్ ఎంత మేర పగులు ఇచ్చింది.. లోపలి వైపు ఎంత వరకూ గోడనుంచి ప్లాస్టింగ్ విడిపోయింది చూసుకుని అంత మేరా ఆప్లాస్టింగ్ తొలగించి, తిరిగి మొత్తం ప్లాస్టింగ్ చేస్తేనే సమస్య పూర్తిగా పరిషారం అయినట్టు.'' అంటూ తమ అభిప్రాయం చెప్పారు.

సో, ఈ మెట్రో ప్లాస్టింగ్ ప్రమాదకరంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వాస్తవమే. దీనిని మెట్రో అధికారులు మసిపూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నిస్తున్నారనేదీ వాస్తవమే. ఇప్పుడు ప్రజలు చేయాల్సింది ఏమిటంటే ఆ ప్రాంతాల్లో సంచరించే సమయంలో ఎవరికీ వారు జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళడమే. ఎందుకంటే మన మెట్రో అధికారులు పూర్తిగా సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు సరికదా.. పొరపాటు ఒప్పుకునేందుకు కూడా ఇష్టపడటం లేదనే విషయం ఈ ఉదంతంతో స్పష్టం అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories