COVID vaccine: కరోనా వేక్సిన్ రష్యాలో సరే.. మరి మన దేశం పరిస్థితి ఏమిటి?

COVID vaccine: కరోనా వేక్సిన్ రష్యాలో సరే.. మరి మన దేశం పరిస్థితి ఏమిటి?
x
coronavirus (File Photo)
Highlights

COVID vaccine: కరోనా వ్యాక్సిన్ రష్యాలో సిద్ధం అయ్యిందనే వార్తల్ నేపధ్యంలో.. మన పరిస్థితి ఏమిటి? ప్రత్యెక కథనం!

కరోనా కట్టడికి మందు రానే వచ్చింది. సెప్టెంబర్‌లో ఉత్పత్తి.. అక్టోబరు, నవంబర్‌లో పంపిణీ అని ఇప్పటికే రష్యా ప్రకటించింది కూడా..ఇంకేముంది కరోనాపై మనిషి విజయం సాధించినట్లేనా? కొత్త సంవత్సరం వేడుకలు స్వేచ్ఛగా జరుపుకోవచ్చునని సంబరపడుతున్నారా? ఊహూ.. మన ఆశలకు కొంత కళ్లెం వేయాల్సిందే. ఎందుకంటారా? రష్యా టీకాపై అనుమానాలు ఒకవైపు, మిగిలిన ప్రయత్నాల సఫలీకృతమయ్యేందుకు మరికొంత సమయం పట్టేఅవకాశం ఉండటమే దీనికి కారణాలు.

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టీకా తయారీ, పంపిణీ, అందుబాటు గురించి ఒకసారి సమీక్షిస్తే..టీకా తయారీలో నేనంటే నేను అని కొన్ని దేశాలు పోటీపడుతున్నాయి.

మనిషికి కరోనా భూతం పట్టుకుని 8 నెలలవుతోంది. చైనాలోని వూహాన్లో గతేడాది డిసెంబరు చివరిలోనే తొలి కోవిడ్‌ కేసును గుర్తించినప్పటికీ ఇతర దేశాలకు విస్తరించేందుకు 3–4 నెలలు పట్టింది. ఈలోపు వైరస్‌ కట్టడికి ముందుగా చైనా, ఆపై∙అమెరికా తదితర దేశా లు టీకా తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సాధారణ పరిస్థితుల్లో ఒక టీకా తయారీకి పది నుంచి పన్నెండేళ్ల సమయం పడుతుం ది. కానీ కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని దేశాలు శాయశక్తులా ప్రయత్నిం చాయి. ఫలితంగా ఆగస్టు 13 నాటికి కనీసం టీకాలు ప్రీక్లినికల్‌ ట్రయల్స్‌తో పాటు మొదటి రెండు దశల మానవ ప్రయోగాలు పూర్తి చేసుకుని మూడో దశలోకి అడుగుపెట్టాయి.

రష్యా 'స్పుత్నిక్‌' టీకా ఇప్పటికే ఆమోదం పొందగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తం గా అభివృద్ధి చేస్తున్న టీకా ముందంజలో ఉంది. వీటితోపాటు చైనాలోని సైనోఫార్మ్‌ కంపెనీ వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ భాగస్వామ్యంతో రెండు టీకాలు, అమెరికాలోని మోడెర్నా సంస్థ– ఎన్‌ఐఏఐడీ టీకా, బయోఎన్టెక్, ఫోసున్‌ ఫార్మా, ఫైజర్లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా.. ఇవన్నీ తొలి రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుని కీలకమైన మూడో దశకు చేరుకున్నాయి. భారత్‌ విషయానికొస్తే భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ టీకా రెండవ దశ మానవ ప్రయోగాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. మరోవైపు అస్ట్రాజెనెకా టీకా రెండు మూడో దశల మానవ ప్రయోగాలు నిర్వహించేందుకు పూణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు భారత వైద్య పరిశోధన సమాఖ్య అనుమతిలిచ్చింది. జైడస్‌ క్యాడిల్లా కూడా ఒక టీకాను పరీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

అన్ని దశల ప్రయోగాలు పూర్తి చేసుకోని టీకా స్పుత్నిక్‌ ఒక్కటే కాదు. చైనాకు చెందిన కాన్‌సైనో తయారు చేసిన టీకా కూడా ఈ జాబితాలో ఉంది. ఈ టీకా వాడకానికి చైనా జూన్‌లోనే అనుమతులిచ్చింది. కాకపోతే తాము ఈ టీకాను పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికులకు మాత్రమే అందిస్తామని అప్పట్లో చెప్పారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మిలిటరీ సైన్సెస్‌ అభివృద్ధి చేసిన ఈ టీకా ఎంత మంది సైనికులకు ఇచ్చారన్నది ఎవరికీ తెలియదు. తొలి రెండు దశల మానవ ప్రయోగాలు పూర్తయిన వెంటనే చైనా ఈ టీకాకు అనుమతి ఇచ్చేసిం ది. త్వరలో సౌదీ అరేబియాలో మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తామని అప్పట్లో చైనా చెప్పినా ఇప్పటివరకు జరిగిన దాఖలాలు లేవు. మూడవ దశలో భిన్న వర్గాలకు చెందిన వేలాది మందికి టీకా ఇచ్చి ఎలాంటి దుష్ఫలితా లు లేవని నిర్ధారించుకున్న తరువాతే విస్తృత వినియోగానికి తేవడం సాధారణంగా జరిగే ప్రక్రియ.

రష్యా టీకా స్పుత్నిక్‌ పనితీరును మదించిన తరువాత గానీ తాము దాని వాడకంపై ఒక నిర్ణయం తీసుకోలేమని భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అందరి ఆశలూ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకాపైనే నిలిచాయి. ఈ టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ఇటీవలే మొదలయ్యాయి. అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లో ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి జరుగుతు న్న ఈ ప్రయోగాలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. కోవిడ్‌–19 కారక వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థలోని అత్యంత శక్తిమంతమైన టీ–కణాల ఉత్పత్తిని కూడా టీకా పెంచుతున్న ట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 18–55 ఏళ్ల మధ్య వయస్కు లకు తాము టీకా ఇచ్చామని వారు చెబుతున్నారు. ప్రయోగ ఫలితాలు ఈ ఏడాది నవంబరు, డిసెంబరుకుగానీ వచ్చే అవకాశం లేదని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. తదనంతరం ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతులు పొందడం వంటివి పూర్తి చేసుకోవడం, వాణిజ్య స్థాయి ఉత్పత్తి వంటి అన్ని పనుల పూర్తికి ఒకట్రెండు నెలలు పడుతుందనుకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చికిగానీ టీకా అందరికీ అందుబాటులోకి రాదన్నది స్పష్టమవుతుంది. ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల కోసం ఆస్ట్రాజెనెకా మెక్సికో, అర్జెంటీనాల్లోని ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సుమారు పది కోట్ల డోసుల ఉత్పత్తికి ప్రయత్నిస్తోంది. వీటిని భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ పంపిణీ చేస్తామని ఆస్ట్రాజెనెకా ఇప్పటికే ప్రకటించింది. భారత్‌లో రెండు, మూడో దశ మానవ ప్రయోగాల కోసం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసుల టీకా అందించేందుకు సిద్ధమవుతోంది. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌.. టీకా తయారీ కోసం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 15 కోట్ల డాలర్లు అందజేస్తోంది కూడా. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా రెండు డోసుల టీకా సుమారు రూ.250కి మనకు అందుబాటులోకి రానుంది.

అగ్రరాజ్యం అమెరికా కోవిడ్‌–19 టీకా కోసం భారీ ముందస్తు ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందుకోసం అమెరికా ఆపరేషన్‌ వార్ప్‌స్పీడ్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ జనాభా 33 కోట్లు మాత్రమే అయినా ఇప్పటికే సుమారు 80 కోట్ల డోసుల టీకాల కోసం ఐదు వేర్వేరు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఐదు కంపెనీలు తయారు చేస్తున్న టీకాలు మూడో దశ మానవ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం మొట్టమొదట టీకా తయారీకి పూనుకున్న మోడెర్నా కంపెనీ నుంచి పది కోట్ల డోసుల సరఫరాకు అమెరికా 152 కోట్ల డాలర్లతో ఒక ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా మోడెర్నా అభివృద్ధి చేస్తున్న మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ ఆధారిత టెక్నాలజీ కోసం మరో వంద కోట్ల డాలర్లు ఇప్పటికే చెల్లించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా కోసం ఆస్ట్రాజెనెకాతో 30 కోట్ల డోసులు సేకరించేందుకు 120 కోట్ల డాలర్లు చెల్లిం చేందుకు అమెరికా సిద్ధమైంది. నోవావ్యాక్స్, సనోఫీ, గ్లాక్సోస్మిత్క్లైన్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, ఫైజర్ల నుంచి పదికోట్ల డోసుల చొప్పున సేకరించేందుకు కోటానుకోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. ఈ కంపెనీలు తయారు చేసే టీకాలన్నీ విజయవంతం అవుతాయన్న గ్యారెంటీ లేకున్నా ఎందుకైనా మంచిదన్నట్లు జనాభాకు దాదాపు మూడురెట్లు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఆర్డర్‌ చేసింది అమెరికా.

రష్యా తొలి రెండు దశల మానవ ప్రయోగాలను హడావుడిగా రెం డు నెలల్లోనే పూర్తి చేసిందని, మూడో దశ చేపట్టకుండా నే టీకాను ఆమోదించిందని ఇప్పటికే విమర్శలొస్తున్నా యి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా ఈ టీకాను భారత్‌లో వాడాలని అనుకుంటే రెండు మూడవ దశ మానవ ప్రయోగాలను తాజాగా చేపట్టాల్సి ఉంటుంది. ఇది కూడా కంపెనీలు ఏవైనా రష్యాను సంప్రదించడం, అందుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతోనే సాధ్యం. ఇదే జరిగితే రెండు దశల మానవ ప్రయోగాలు వాయువేగంతో చేపట్టినా పూర్తయ్యేందుకు మూడు నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకా మాదిరిగానే ఇది కూడా వచ్చే ఏడాది జనవరి–మార్చి మధ్యలోనే అందుబాటులోకి రానుంది.అయితే ఈ చిక్కుముడిని అధిగమిం చేందుకు ఒక దారి లేకపోలేదు. కరోనా అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మూడో దశ మానవ ప్రయోగాలు అవసరం లేకుండానే టీకాను వాడుకోవచ్చునని భారతీయ డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతులిచ్చే అవకాశం ఉంది. కోవిడ్‌–19 చికిత్సకు కొంత కాలం క్రితం ఆమోదించిన రెమిడెసివిర్‌పై భారత్‌లో అతితక్కువ సంఖ్యలో మానవ ప్రయోగాలు జరిగిన విషయం ఇక్కడ ప్రస్తావార్హం. ఎబోలా వైరస్‌ కోసం రెమిడెసివిర్‌ను అభివృద్ధి చేసినా, అత్యవస పరిస్థితుల్లో వైద్యుల విచక్షణ మేరకు ఈ మందును కోవిడ్‌–19 రోగులకు ఇవ్వవచ్చునని డ్రగ్‌ కంట్రోలర్‌ అప్పట్లో అనుమతి చ్చారు. అయితే టీకా విషయానికి వచ్చేసరికి ఇదే తర్కం పనిచేసే అవకాశాలు తక్కువనేది నిపుణుల మాట. టీకా సాధారణ ప్రజలందరికీ ఇవ్వాల్సి ఉంటుందని, రెమిడెసివిర్‌ను వ్యాధి బారినపడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారని వీరంటున్నారు.

కరోనా వైరస్‌ టీకా అందరికీ అందుబాటులోకి తెచ్చేం దుకు డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిం చింది. ఇందుకోసం కొయెలేషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సీఈపీఐ), గవి (గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్‌), బిల్‌ అండ్‌ మె లిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తో కలిసి కోవ్యాక్స్‌ అనే ప్లాట్‌ఫార్మ్‌ను ఏర్పాటుచేసింది. కరోనా చికిత్సకు అవసరమైన పరిశోధనలకు సాయం చేయడం, వ్యాధి గుర్తింపునకు చౌకైన పద్ధతులను అందుబాటులోకి తేవడం, టీకా తయారీ ప్రయత్నాలు వేగవంతం చేయడం, ఫార్మా కంపెనీల సామర్థ్యాన్ని పెంచి, పేద, మధ్య ఆదా య దేశాల్లోనూ ఈ టీకా తక్కువ ధరలోనే అందుబాటులో ఉండేలా చేయడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా సీఈపీఐ ఇప్పటికే దక్షిణ కొరియాలోని ఎస్‌కే బయోసైన్సెస్‌ ఫ్యాక్టరీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న రెండేళ్లు ఈ ఫ్యాక్టరీ కేవలం కోవిడ్‌–19 నివారక వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేస్తుంది. అవసరమైతే ఆ తరువాత కూడా ఫ్యాక్టరీని ఉపయోగించుకునేందుకు సీఈపీఐకి హక్కు ఉంటుంది. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో పదికోట్ల డోసుల టీకాల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న టీకాను ఇక్కడ తయా రు చేయనున్నారు. భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో ఢిల్లీలోని ఆలిండియా మెడికల్‌ సైన్సెస్, పట్నాలోని రాజేంద్ర మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్, చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్, జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లోని నెహ్రూ హాస్పిటల్, మైసూరులోని జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లలో ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ టీకాపై ప్రయోగాలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories