Top
logo

Coronavirus Effect: కరోనాపై జనాల్లో మారుతున్న తీరు.. సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వైనం

Coronavirus Effect: కరోనాపై జనాల్లో మారుతున్న తీరు.. సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వైనం
X
Representational Image
Highlights

Coronavirus Effect: కరోనా అమ్మో భయం... అది ఎవరికి అంటుకుంటుందో.. దానికి ఎవరు బలవుతారో... అంతా భయం.. భయం..

Coronavirus Effect: కరోనా అమ్మో భయం... అది ఎవరికి అంటుకుంటుందో.. దానికి ఎవరు బలవుతారో... అంతా భయం.. భయం.. కనీసం దూరం నుంచైనా చర్చించేందుకు భయం... అలాంటిది క్రమేపీ కరోనాపై దృక్పదం మారుతోంది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏం కాదులే నిర్ణయించుకుంటున్నారు. అవసరమైతే పదిహేను రోజులు పాటు ఆస్పత్రుల్లో ఉండాల్సి వస్తుందని భావిస్తున్నారు. అందుకే పాజిటివ్ వచ్చిన వారికి సైతం ధైర్యం చెబుతున్నారు. కొంతమందికి ఆర్థికంగా ఆదుకుంటున్నారు.

కరోనా భౌతికదూరాన్ని శాసిస్తే.. కరుణ మానసిక సాన్నిహిత్యాన్ని చాటుతోంది. కోవిడ్‌ మనుషులను విడగొడితే.. మానవత్వం మనుషులను కూడగడుతోంది. పాజిటివ్‌ వచ్చినవారి పట్ల పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్‌ ఆపత్కాలంలో ప్రజల ప్రవర్తనలో మెల్లగా మార్పు గోచరిస్తోంది. కొన్ని నెలల క్రితం కరోనా అనగానే పరిగెట్టేవారు. ఆ వైరస్‌ సోకితే ఇక భూమిపై నూకలు చెల్లినట్టేనని, అది ఎక్కడ తమకు సోకుతుందోనని,ఏమైపోతామోనని భయకంపితులయ్యేవారు. పాజిటివ్‌ వచ్చిందని తెలిస్తే చాలు బాధితులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలివేసినట్టుగా చూసేవారు.

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత రిపోర్ట్‌లో నెగెటివ్‌ వచ్చినా దూరంగా ఉంచుతూ అనుమానాస్పదంగా చూసేవారు. అయితే ఇప్పుడు కోవిడ్‌ మహమ్మారి విషయంలో మనుషుల తీరు, వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. పాజిటివ్‌ వచ్చినవారి పట్ల మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఏదో ఒక రూపంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయినా 'నేనున్నాననీ... నీకేం కాదనీ'అనే విధంగా బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగువారు ముందుకు వచ్చి బాధితులకు ధైర్యం నూరిపోస్తున్నారు. జాగ్రత్తల గురించి చెబుతున్నారు. కరోనా రోగులకు ఇది టానిక్‌గా పనిచేస్తుండడంతో త్వరగా కోలుకుని మళ్లీ మామూలు మనుషులుగా మారడానికి దోహదపడుతున్నారు.

బంధువులు, ఆఫీస్‌ బాసుల భరోసా

బంధువుల్లో ఎవరికైనా కరోనా సోకితే రోజుకు రెండు, మూడుసార్లు ఫోన్‌ చేస్తూ ఆర్యోగం గురించి ఆరా తీస్తున్నారు. గతంలో వచ్చినవారు తీసుకున్న జాగ్రత్తలు, పోషక విలువలున్న ఆహారం, సరైన మందులు, ఇతర విషయాల గురించి చెబుతూ ధైర్యం నూరిపోస్తున్నారు. ఆయా ఆఫీసుల్లోని ఉద్యోగులకు కరోనా సోకినట్టు తెలియగానే వెంటనే బాస్‌లు తమ హోదా, దర్పాన్ని పక్కన పెట్టేసి తెల్లవారుజాము నుంచే ఫోన్లు చేసి భుజం తట్టి ధైర్యం చెబుతున్నారు. ఆఫీసు చింత పక్కన పెట్టేసి ముందు పూర్తి ఆరోగ్యాన్ని సాధించే దిశగా దృష్టి మరల్చేలా ప్రోత్సహిస్తున్నారు.

ఈ విధంగా లభించిన భరోసా వారిలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. కరోనా సోకి ఇబ్బందుల్లో ఉన్నవారికి వారి బంధువులు, మిత్రులు మాట సాయమే కాదు, ఆర్థకంగానూ ఆదుకుంటూ అవసరాలకు అవసరమైన డబ్బులు సాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా వివిధ మొబైల్‌ యాప్‌ల ద్వారా రోగుల అవసరాల మేర డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. డబ్బు సాయానికే పరిమితం కాకుండా బాధిత కుటుంబాలవారికి వివిధ రకాల నిత్యావసరాలు సైతం అందజేస్తూ భరోసా కల్పిస్తున్నారు.

బ్యారికేడ్ల నుంచి అవగాహన దాకా...

గతంలో పక్క వీధిలో ఎవరికైనా కరోనా వచ్చిందంటేనే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెంటనే అనధికారిక కంచెలు, బ్యారికేడ్లు వెలిసేవి. ప్రభుత్వ అధికారు లు ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ ఏరియాగానో, రెడ్‌ జోన్‌గానో ప్రకటించడానికి ముందే 'ఇది రెడ్‌జోన్‌'ప్రాంతమంటూ ప్రచారం చేసేవారు. దీంతో అటు వైపునకు వెళ్లాలంటేనే ఎవరూ సాహసించేవారు కాదు. నేడు కరోనా వచ్చినవారు పక్కింట్లో ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా గడుపుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం, ఇతర వస్తువులను అందిస్తున్నారు.

Web TitleCoronavirus Effect people getting awareness and changing trend and coming farward to help
Next Story