
Chandrashekhar Azad
Chandrashekhar Azad: విప్లవ జ్వాల చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాలు, పోరాట పటిమను స్మరించుకుందాం. భారత స్వాతంత్య్ర సమరంలో ఆయన పాత్రను తెలుసుకుందాం
Chandrashekhar Azad: భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఎందరో వీరుల పోరాటం.. త్యాగం ఉన్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో చాలా మంది కీలక పోరాటాలు జరిపారు. ఈ క్రమంలో ప్రాణాలను కోల్పోయారు. ప్రాణ త్యాగం చేసిన ఒక్కో వీరుడి కథా తరువాత ప్రజల్లో మరింత స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. అలా స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన వీరుల్లో.. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అజరామర విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. ఆయన వర్ధంతి ఈరోజు (ఫిబ్రవరి 27). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ఆయన, చివరి శ్వాస వరకు బ్రిటిష్ అధికారుల చేతుల్లో చిక్కకుండా ధైర్యంగా పోరాడి అమరుడయ్యారు.
ధైర్యానికి మారుపేరు..
చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. 1906, జూలై 23న మధ్యప్రదేశ్‌లోని భావ్రా గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే జలియన్ వాలాబాగ్ ఉదంతం ఆయనలో తీవ్రమైన దేశభక్తిని నింపింది. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టు కాగా, కోర్టులో న్యాయమూర్తి ముందు "నీ పేరేమిటి?" అని అడిగినప్పుడు, ఆయన ధైర్యంగా "ఆజాద్" (స్వేచ్ఛాజీవి) అని, తండ్రి పేరు "స్వాతంత్య్రం " అని, నివాసం "జైలు" అని సమాధానమిచ్చారు. అప్పటి నుండి ఆయన ఆజాద్(Chandrashekhar Azad)గా ప్రసిద్ధి చెందారు.
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA):
అయితే, వివిధ కారణాలతో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం ఉపసంహరించుకున్నారు. దీంతో యువతరంలో పెద్ద ఎత్తున అసంతృప్తి తలెత్తింది. అలా ఆజాద్ లో కూడా తీవ్ర అసంతృప్తి చోటుచేసుకుంది. ఇది ఆయనను విప్లవ మార్గం వైపు నడిపించింది. "బ్రిటీష్ వారిని కేవలం అహింసతో కాదు, శక్తితోనే ఎదిరించాలి." అనే నినాదంతో ముందుకు సాగారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ థాపర్ వంటి వీరులతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) అనే సంస్థను స్థాపించారు. వరుసగా విప్లవ కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. కాకోరీ రైలు దోపిడీ, సాండర్స్ హత్య వంటి సంఘటనల ద్వారా ఆయన బ్రిటీష్ పాలకులకు వణుకు పుట్టించారు.
అలా అమరుడయ్యారు..
తన విప్లవ కార్యకలాపాలతో బ్రిటిష్ వారికి నిద్దర లేకుండా చేసిన ఆజాద్ తాను అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాను కానీ, బ్రిటిష్ పోలీసులకు బందీగా మారను అని చెప్పేవారు. చెప్పిన విధంగానే చివరి బుల్లెట్‌ను తనపై తానే ప్రయోగించుకొని బ్రిటిష్ చేతుల్లో బందీగా మారకుండా తన మాట నిలబెట్టుకున్నారు. 1931 ఫిబ్రవరి 27న అల్ఫ్రెడ్ పార్క్ (ప్రస్తుతం ఆజాద్ పార్క్), ప్రయాగరాజ్‌లో తన సహచరుడితో సమావేశమై ఉండగా, పోలీసులకు సమాచారం అందింది. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు ఆజాద్‌ను చుట్టుముట్టారు. పోలీసుల కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆజాద్(Chandrashekhar Azad), తన తుపాకీలో ఉన్న ఆఖరి బుల్లెట్‌ను తన గుండెల్లోకి దించుకున్నారు. "ఎప్పటికీ పోలీసులకు చిక్కకూడదు, చనిపోయేవరకు ఆజాద్‌గానే ఉంటాను" అని తీసుకున్న ప్రతిజ్ఞను ఆయన నిలబెట్టుకున్నారు.
ఆజాద్ బ్రతికున్నంత కాలం బ్రిటీష్ వారికి దొరకకుండా విప్లవాన్ని నడిపించారు. స్వార్థం లేని త్యాగం, అచంచలమైన ధైర్యం ఆయన సొంతం. దేశం కోసం తన జీవితాన్ని బలి ఇచ్చిన చంద్రశేఖర్ ఆజాద్(Chandrashekhar Azad) ఆశయాలు, స్ఫూర్తి నేటి యువతకు ఎప్పటికీ మార్గదర్శకం. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిద్దాం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




