శ్రీవారి పుష్పయాగంతో పులకించిన తిరుమల పుణ్యక్షేత్రం..

thirumala
x
thirumala
Highlights

హరిహరాధులకు ప్రీతికరమైన, పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

హరిహరాధులకు ప్రీతికరమైన, పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు అర్చకులు.... రంగురంగుల దేశీయ జాతి పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.....శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.

పుష్పాధిదేవుడు ''పుల్లుడు'' ఆవాహన :

పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి బంగారు తిరుచ్చిని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించడంతో శ్రీవారి పుష్పయాగం నేత్రపర్వంగా ముగిసింది.

అనంతరం టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధరించి నిర్వహిస్తున్నదన్నారు. పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించిన‌ట్లు తెలిపారు. త‌మిళ‌నాడు నుండి 5 ట‌న్నులు, క‌ర్ణాట‌క నుండి 2 ట‌న్నులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి క‌లిపి ఒక ట‌న్ను పుష్పాలు, ప‌త్రాలను దాతలు విరాళంగా అందించార‌న్నారు.

వేడుకగా స్నపన తిరుమంజనం :

పుష్పయాగం సందర్భంగా ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో అభిషేకం చేసి చివరగా చందనలేపనాన్ని అలంకరించారు. ఆ తరువాత తులసిమాలలను ధరింపజేసి నక్షత్రహారతి నివేదించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచసూక్తాలు, ఉపనిషత్తుల్లోని మంత్రాలను పఠించారు.

వైభవంగా పుష్పాల ఊరేగింపు :

శ్రీవారి పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. సోమ‌వారం ఉదయం తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. శ్రీవారి ఆలయం వద్ద టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆలయ అర్చకులు పుష్పాలను స్వీకరించారు. పుష్పాల ఊరేగింపులో ఉద్యానవన విభాగం సిబ్బందితో పాటు 200 మందికి పైగా శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం :

శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులును టిటిడి ఈవో, అద‌పు ఈవో శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సంద‌ర్భంగా ఆర్జితసేవలైన విశేష పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ లోక‌నాథం, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories