Top
logo

మీ ఆలోచనలు అదుర్సా! బెదుర్సా!

మీ ఆలోచనలు అదుర్సా! బెదుర్సా!
Highlights

ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం... మీ ఆలోచనలు అదుర్సా! బెదుర్సా! మనం జీవితంలో ప్రస్తుతం వున్నా స్థిత...

ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం... మీ ఆలోచనలు అదుర్సా! బెదుర్సా!

మనం జీవితంలో ప్రస్తుతం వున్నా స్థితి నుండి ఉన్నత స్థితి కి వెళ్ళాలంటే, అందులో మన ఆలోచనల యొక్క ప్రాముఖ్యత ఎంతో వుంటుంది. ఎందుకంటే మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో...దానికి సంబంధించిన మాటలు, చేతలు ఎక్కువగా చేస్తూవుంటాము. అయితే ఆ ఆలోచనలలో పాజిటివ్ ఆలోచనల కన్నా, నెగటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తే మాత్రం చాల ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే నెగటివ్ ఆలోచనలు ఎలాంటి నిర్మాణాత్మక కృషికి ఉపయోగపడవు, మన అభివృద్దికి ఆటంకం అవుతాయి, కాబట్టి వాటిని వీలైనంత త్వరగా మనం వదిలించుకోవాలి. ఇప్పుడు ఆ నెగటివ్ థింకింగ్ని నేలమట్టం చేసి ఓడించడం ఎలాగో చూద్ధాము.

ఫ్రండ్స్ ! మీకు నెగెటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయా? ఎలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయో మీకు తెలుసా? అలాగే ఆ ఆలోచనలు మిమ్మల్ని ఎలా భయపెడుతూ ఉంటాయో ఎప్పుడైనా గమనించారా? అయితే ఎవరు కూడా నెగిటివ్ ఆలోచనలు కావాలని కోరుకోరుకదా..అవి అలా వచ్చేస్తాయి అంతే. అవి మనం మన ఇంటికి ఆహ్వానించని అనుకోని అతిధులు లాంటివి. మన నెగిటివ్ ఆలోచనలను మనం పిలవకుండానే, అవి మన మనసు అనే ఇంట్లోకి వస్తాయి. వాటికి ఎక్కువగా "మనం అవకాశం ఇవ్వకూడదు" అని అనుకుంటే మాత్రం... ముందుగానే మన మనస్సుని ఎన్నో పాజిటివ్ ఆలోచనలతో నింపి "హౌస్ఫుల్" బోర్డు పెట్ట్టాలి. ఇలా చేస్తే మాత్రం నెగటివ్ ఆలోచనలకి అవకాశం తక్కువే ఉంటుంది. అలా కాకుండా ఈ నెగిటివ్ ఆలోచనలను మన ఇంట్లోకి రానిస్తే మాత్రం...అవి మళ్ళీ మళ్ళీ... మనం ఎంత బలహీనులము......... ఎందుకు పనికిరాము....... ఏ పని ఎందుకు చేయలేము...అని చెబుతూనే ఉంటాయి.

మన నెగిటివ్ ఆలోచనల యొక్క శక్తిని పెంచేది మాత్రం చాల సందర్బాలలో మనమే. ఎలాగంటే వాటిపై మన దృష్టి ఎక్కువగా పెట్టడం వలన, అవి ఇంకా పెరిగి పెద్దవైపోతాయి. ఉదాహరణకి మనం అసలు ఈ రోజంతా...ఒక "నల్ల పిల్లి" గురించి ఆలోచించవద్దు అని అనుకుంటే...దాని గురించి ఆలోచించినప్పుడల్లా, మన మనసులోకి నల్లపిల్లి ఎక్కువగా వస్తుంది కదా. అలాగే ఈ నెగటివ్ ఆలోచనలు కూడా నల్ల పిల్లి లాంటివే, ఎంత వద్దు అంటే, అంత కనపడతాయి, కాబట్టి మన దృష్టిని వాటి నుండి మరో మంచి విషయంపై మల్లించాల్సి వుంటుంది. అలా చెయ్యాలంటే..ముందుగా మనం విజయవంతమైన జీవితం గడపడానికి కావలసిన అన్ని "వనరులు" మనలోనే ఉన్నాయి అని గుర్తించాలి, వాటి గురించే ఆలోచించాలి, వాటి గురించే పరిశోదించాలి. అలాగే మీరు ఎన్నో పనులు చేయగలరని, ఎన్నో అద్భుతాలు సాధించగలరని, పూర్తి విశ్వాసాన్ని మీ పై మీరు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో, అప్పడు మెల్లిగా మీ నెగటివ్ ఆలోచనలు సూర్యుడు వచ్చే ముందు తొలిగి పోయే చీకటిలా తొలగిపోతాయి.

ఫ్రెండ్స్! ఈ నెగిటివ్ థింకింగ్ అనే "శిక్ష" నుండి త్వరగా మనం బయటపడాలి, ఈ శిక్ష నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ మీ ఎనర్జీ ని ఎంతో తగ్గిస్తుంది, అలాగే మీ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుంది, మీ ఆశలను ఆవిరి చేస్తుంది, మీ జీవితంలో జీవం లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ నెగటివ్ థింకింగ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోడానికి, మీరు కొంత స్వయం శిక్షణ తీసుకోవాలి, ఆ శిక్షణ ఏంటంటే "మీ మనసు దేని గురించి ఆలోచించాలి" అనే విషయంలో, మీరు మీ మనస్సుకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు కూడా అలవాట్లే కాబట్టి. ఇలా మీరు శిక్షణ ఇస్తే మాత్రం, మీ మనసు మీరు కోరుకున్న ఆలోచనలనే ఎక్కువగా ప్రేరేపిస్తుంది. ఆ శిక్షణ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాము.

ఫ్రెండ్స్ ముందుగా మనం గుర్తించాల్సింది నెగిటివ్ థింకింగ్ అనేది "ఒక ఆలోచన" మాత్రమే అని, కాబట్టి నెగిటివ్ థింకింగ్ వదిలించుకోవాలనే ఒక నిర్ణయాన్ని ముందుగా మీరు తీసుకోండి. అలాగే ఒక నెగిటివ్ ఆలోచన రాగానే, దానిని గుర్తించి ఆ ఆలోచనలో మునిగి పోకుండా, ఆ ఆలోచనల్లో కొట్టుకుపోకుండా, ఆ ఆలోచనల రైలు బండి ఎక్కకుండా, దానిని మార్చుకోవాల్సిన అవసరం గుర్తించండి. ఎందుకంటే ఒక నెగటివ్ ఆలోచన, మరో నెగటివ్ ఆలోచనకి విత్తనం అవుతుంది కాబట్టి, ఇలా ఒక గొలుసులా ఆ ఆలోచనలు పెరగకుండా చూసుకోవాలి. అయితే ఒకే రోజు, ఒకేసారి మన నెగిటివ్ థింకింగ్ ని పూర్తిగా మనం వదిలించుకోలేకపోవచ్చు కానీ చాలావరకూ తగ్గించుకోవచ్చు. అలాగే నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు దాని స్థానంలో పాజిటివ్ థింకింగ్ ని ప్రవేశపెట్టండి. ప్రతి సారి ఒక నెగటివ్ ఆలోచన రాగానే, వెంబడే ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే, ఏమి ఆలోచిస్తారో అదే ఆలోచించండి. ఎలాగైతే చీకటిని పోగొట్టడానికి మనం ఒక దీపం వెలిగిస్తామో అలా, నెగటివ్ ఆలోచనతో పోరాటం చెయ్యకుండా, ఒక పాజిటివ్ ఆలోచన అనే దీపాన్ని వెలిగించండి...అంతే మీ చుట్టూ ఎంతో మార్పు వస్తుంది...అయితే ఈ ప్రక్రియను ఎలా ఆచరణలో పెట్టాలో ఇప్పుడు నేర్చుకుందాము.

ముందుగా ఒక A4 సైజు వైట్ పేపర్ ను తీసుకోండి, దానిని రెండు భాగాలుగా ఫోల్డ్ చెయ్యండి. ఆ పేపర్ యొక్క ఒక సగ భాగంలో, మీకు వస్తున్న లేదా వచ్చిన నెగిటివ్ ఆలోచనలు రాసుకోండి. అలా అన్ని ఆలోచనలను ఒక దాని తర్వాత ఒకటి రాసుకోండి. ఆ తర్వాత మీరు రాసిన వాటికీ పేపర్ లోని మరో భాగంలో, అదే విషయంలో మీరు పాజిటివ్ ఆలోచనని చేస్తే, ఏమి చేస్తారో, ఆలోచించి వ్రాయండి. అలా అన్ని ఆలోచనలను పాజిటివ్ గా మార్చండి. అలా ఆ పాజిటివ్ ఆలోచన వ్రాసిన తర్వాత, ముందుగా రాసిన నెగటివ్ ఆలోచనలన్నీ రెడ్ పెన్నుతో కొట్టివేయండి. ఇలా చెయ్యడం వలన మీ మైండ్ కి, మీరు ఏమి ఆలోచించాలో శిక్షణ ఇస్తున్నట్టు అవుతుంది. ఇలా మూడు వారాల పాటు ప్రాక్టీసు చెయ్యడంతో, మీ ఆలోచనలో ఏంతో మార్పు వస్తుంది.

అలాగే ఇంకా తక్కువ సమయంలో మీకు ఈ నెగటివ్ ఆలోచనల నుండి కొంత ఉపశమనం కావాలంటే...మీరు నెగిటివ్ థింకింగ్ చేసేటప్పుడు ఎక్కడైతే ఉన్నారో, ఆ ప్రదేశం నుంచి లేచి కొంత దూరం నడవండి. కనీసం 120 అడుగులు వెయ్యండి, అలా నడవడం వలన మీ ఆలోచనల్లో కొంత మార్పు కనబడుతుంది. ఎందుకంటే ఇలా లేచి నడవడం వలన, ఇప్పటి వరకు వున్న, మీ బాడీ లాంగ్వేజ్లో కొంత మార్పు వస్తుంది, దానితో ఆటోమేటిక్గా మీ ఆలోచనల్లో కొంత మార్పు వస్తుంది. ఇలా మీరు నెగటివ్ ఆలోచనల సామ్రాజ్యాన్ని జయించి, మీ పాజిటివ్ ఆలోచనల సామ్రాజ్యాన్ని నెలకొల్పగలరు. ఇలా మీ మనసుని గెలిచినా అలెగ్జాండర్ మీరే అవ్వగలరు. ఫ్రండ్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలను ఆచరణలో పెట్టడం ద్వార మీ ఆలోచనలను మీ విజయానికి ఇక ఒక పెట్టుబడిగా మార్చుకోవచ్చు. అల్ ది బెస్ట్.

Next Story

లైవ్ టీవి


Share it