Kerala: కేరళలో రాజకీయ ప్రకంపనలు.. సీఎం కూతురుకు జైలు శిక్ష?

Kerala
x

Kerala: కేరళలో రాజకీయ ప్రకంపనలు.. సీఎం కూతురుకు జైలు శిక్ష?

Highlights

Kerala: ఇప్పుడు ఈ కేసు రాజకీయ సమీకరణాల్లో ఎంత భీకరమైన ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే సీఎం మాత్రం దీన్ని తక్కువ చేసి చూస్తున్నప్పటికీ, కేసు న్యాయస్థానంలో ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్నది కీలకం.

Kerala: కేరళలో రాజకీయంగా పెద్ద దుమారానికి దారి తీస్తున్న అంశం ఇప్పుడు సీఎం పినరాయి విజయన్ కుమార్తె టి వీణపై నమోదైన ఛార్జ్‌షీట్. కొచ్చి కోర్టులో దాఖలైన ఈ కేసు తనను లక్ష్యంగా చేసుకున్న కుట్ర భాగంగా ఉందని సీఎం విజయన్ అన్నారు. తన కుమార్తెకి చెల్లింపులు న్యాయబద్ధంగానే జరిగాయని, వాటిపై పన్నులు కూడా చెల్లించారని స్పష్టం చేశారు.

మీకు నా రక్తం కావాలా? అంత ఈజీగా దొరకదంటూ వ్యాఖ్యలు చేస్తూ, ఈ కేసును తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించారు. కేసు కోర్టులో ఉంది, అది చట్టపరంగా తేల్చుకోవాల్సిన అంశమని సీఎం అన్నారు. ఇది తమ పార్టీని లక్ష్యంగా చేసుకున్న రాజకీయ కుట్ర అని భావిస్తున్నామన్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి టి వీణపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి వచ్చిందన్న విషయం తెలిసిందే. కోచిన్ మినరల్స్ అండ్ ర్యూటైల్ లిమిటెడ్ (CMRL) కంపెనీ నుంచి సేవలు అందించకుండానే టి వీణ, ఆమె కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ రూ.2.73 కోట్లు తీసుకున్నారని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు (SFIO) చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

ఈ కేసు 2023లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వార్తల ప్రకారం, 2017-2020 మధ్య ఎక్సాలాజిక్‌కు రూ.1.72 కోట్లు చెల్లింపులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటినుంచి SFIO విచారణ ప్రారంభించింది. తాజాగా కోర్టులో దాఖలైన 160 పేజీల కేసు వివరాల్లో టి వీణతో పాటు, CMRL ఎండీ సశిధరన్ కార్తా, మొత్తం 25 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కేసులో ఎక్సాలాజిక్ కంపెనీతో పాటు, దానికి సంబంధించిన ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీ పేర్లు కూడా ఉన్నాయి.

ఈ కేసులో కంపెనీ చట్టంలోని సెక్షన్ 447 ప్రకారం కేసు నమోదు అయింది. ఇది కనీసం రూ.10 లక్షల మోసం లేదా కంపెనీ టర్నోవర్‌లో ఒక శాతం మొత్తానికి సంబంధించిన మోసం అయినపుడు వర్తిస్తుంది. దోషిగా తేలితే, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా మోసపోయిన మొత్తం కంటే మూడింతలు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది.

ఇతర రాజకీయ నేతలు కూడా ఈ అంశంపై స్పందించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ తీవ్రంగా స్పందించారు. టి వీణ సేవలు ఇవ్వకుండానే డబ్బులు తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొనడం ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని నశింపజేస్తుందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories