XE Variant in India: దేశంలో కొత్త వైరస్‌ కలకలం

XE Variant of Covid-19 in India | Telugu News
x

XE Variant in India: దేశంలో కొత్త వైరస్‌ కలకలం

Highlights

XE Variant in India: నిన్న ముంబైలో, ఇవాళ గుజరాత్‌లో... ఎక్స్‌ఈ వేరియంట్‌ వైరస్‌ గుర్తింపు

XE Variant in India: దేశంలో కరోనా కేసులు వెయ్యికి పడిపోయాయి. దీంతో మహమ్మారి అంతమైనట్టు అంతటా భావించారు. కరోనా నిబంధనలు సైతం తొలగించారు. అయితే ఇప్పుడు వైరస్‌ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. గుజరాత్‌లో ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం వైరస్‌లు ఇద్దరికి సోకినట్టు తెలుస్తోంది. నిన్న ముంబైలోనూ ఎక్స్‌ఈ రకం వైరస్‌ ఒకరికి సోకినట్టు తెలిసింది. గుజరాత్‌లోని వైరస్‌ బాధితులు విదేశీ ప్రయాణం చేసినట్టు గుర్తించారు. అయితే కొత్త రకం వేరియంట్‌పై ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం కొట్టిపడేసింది. చైనా, అమెరికాలో భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ, మిజోరాం, మహారాష్ట్రా, ఢిల్లీ, హర్యానాల్లో కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించింది.

దేశంలో పూర్తిగా కరోనా అదుపులోకి వచ్చింది. రోజువారీ కేసులు 11 వందల 50కి పడిపోయాయి. వైరస్‌ కట్టడి అయిందని అందరూ భావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటీవలే కోవిడ్‌ నిబంధనలను తొలగించాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. అంతా బాగుందనుకునేవేళ.. కొత్త రకం వైరస్‌ మళ్లీ కలకలం రేపుతోంది. నిన్న ముంబైలో, ఇవాళ గుజరాత్‌లో కొత్త రకం వేరియంట్‌ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం వైరస్‌లు ముగ్గురికి సోకినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త వైరస్ బారిన పడినవారు విదేశాలకు వెళ్లివచ్చినట్టు తెలిసింది. అయితే కొత్త వైరస్‌ సోకినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టి పడేసింది. అయితే కొత్త వేరియంట్‌తో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొందరైతే జూన్‌లో లాక్‌డౌన్‌ వస్తుందని చర్చించుకుంటున్నారు.

ఒమిక్రాన్‌లోని బీఏ1, బీఏ2 వేరియంట్ల కలయికతో ఎక్స్‌ఈగా రూపాంతరం చెందినట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈకి చెందిన జన్యు చిత్రాన్ని నిపుణులు విశ్లేషించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం ముగ్గురికి సోకిన వైరస్‌ జన్యు చిత్రం ఎక్స్‌ఈ వేరియంట్‌కు సరిపోలడం లేదని వివరించింది. ప్రస్తుతం కలకలం రేపుతున్న ఎక్స్‌ఈ వేరియంట్ గతంలోని కరోనా వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎక్స్‌ఈ రకం వైరస్‌ను తొలిసారి యూకేలో జనవరి 19న గుర్తించినట్టు డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అయితే గత వేరియంట్ల కంటే.. ఎక్స్‌ఈ వేరియంట్‌ ప్రమాదకరమైనది కాదని.. మరో వేవ్‌ రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జనసమూహంలోకి వెళ్లేటప్పుడు మాస్క్‌ను తప్పనిసరి ధరించాలని ప్రజలకు నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కరోనాను కట్టడి చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు రోజురోజుకు చైనాను కరోనా కలవర పరుస్తోంది. అమెరికాలోనూ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యం కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటీల కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాల్లో కేసులు పెరిగాయి. వారం రోజుల్లో కేరళలో 2వేల 321 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో కేరళలోనే 31 శాతం కేసులు ఉన్నాయి. వారంలో రోజుల్లో ఢిల్లీలో 724 కేసులు, హర్యానాలో 367 కేసులు, మహారాష్ట్రలో 794 కేసులు, మిజోరాంలో 814 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ఐదు విధానాలను తప్పకుండా ఆచరించాలని ఆదేశించింది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌, వాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో పాటు అప్రమత్తతో ఉండాలని ఆదేశించింది.

ప్రతి నాలుగు నెలలకొక కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తున్నది. తాజాగా ఆసియాలో భారీగా కేసులు పెరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండకపోతే.. మరో ప్రమాదం ముంచుకొస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఆంటోనియో గుట్టేరస్‌ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ప్రజలు అప్రమత్తమై.. టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం నిత్యం 15 లక్షల కేసులు నమోదువుతున్నాయని.. ఐరోపాలో మరో వేవ్‌ ఉధృతమవుతోందని తెలిపారు. యూకేలో కొత్తగా గుర్తించిన ఓమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్స్‌ఈ వేగంగా వ్యాపిస్తోందని.. ప్రపంచ దేశాలు అప్రమత్తమవ్వాలని సూచించారు. వ్యాక్సినేషన్ పెరగడంతోనే కొత్త వేరియంట్‌తో మృతుల సంఖ్య తగ్గిందని గుట్టేరస్‌ వివరించారు. వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ తెలిపారు.

దేశంలో కరోనాను అంతం చేయడానికి తాజాగా 18 ఏళ్ల పైబడినవారి బూస్టర్‌ డోస్‌ను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories