సర్పంచ్ హక్కులను అమ్ముకున్న మహిళను పదవిలోంచి తొలగించిన సర్కార్

సర్పంచ్ హక్కులను అమ్ముకున్న మహిళను పదవిలోంచి తొలగించిన సర్కార్
x
Highlights

గ్రామ సర్పంచ్‌గా గెలిచిన ఒక మహిళ సర్పంచ్‌కు ఉండే హక్కులు, అధికారాలను మరొకరిని అమ్ముకున్నారు. ఈ వార్త జిల్లా, రాష్ట్రస్థాయిలోనేకాకుండా జాతీయ స్థాయిలోనూ...

గ్రామ సర్పంచ్‌గా గెలిచిన ఒక మహిళ సర్పంచ్‌కు ఉండే హక్కులు, అధికారాలను మరొకరిని అమ్ముకున్నారు. ఈ వార్త జిల్లా, రాష్ట్రస్థాయిలోనేకాకుండా జాతీయ స్థాయిలోనూ వైరల్ అయింది. దీంతో స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం ఆమెను సర్పంచ్ పదవిలోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా మానస జనపద్ సమీపంలోని దాత గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. దాత గ్రామ సర్పంచ్ కైలాష్ బాయి కచ్వ గ్రామ సర్పంచ్‌గా తనకు ప్రభుత్వం కల్పించిన హక్కులు, విధులు, అధికారాలను అదే గ్రామానికి చెందిన సురేశ్ గరసియా అనే యువకుడికి అమ్ముకున్నారు. ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఇళ్లు ఇచ్చే పథకం, మంచి నీటి పథకం... ఇలా ఒకటేమిటి.. గ్రామస్తులకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలపై సర్పంచ్‌కు ఉండే పవర్స్ అన్నీ సురేశ్ పేరిట బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకోసం రూ. 500 స్టాంప్ పేపర్‌పై ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

జనవరి 24న ఈ ఒప్పందం జరిగినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అగ్రిమెంట్ పేపర్స్ చూస్తే అర్థమవుతోంది. ఇకపై సురేశ్ తీసుకునే నిర్ణయాల్లో సర్పంచ్ కైలాష్ బాయి కచ్వ కలుగజేసుకోకూడదు. ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే సర్పంచ్ హోదాలో ఆమె అక్కడ సంతకం పెట్టాలి. అంతకు మించి ఆమెకు గ్రామంలో జరిగే విషయాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదు. అది వారి మధ్య జరిగిన ఒప్పందంగా తెలుస్తోంది.

సోషల్ మీడియాలో అగ్రిమెంట్ పేపర్స్ వైరల్ అవడంతో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 40 కింద గత వారమే అధికారులు ఆమెకు నోటీసులు జారీచేశారు. అయితే, ఆమె ఈ నేరం చేసినట్లుగా అంగీకరించనప్పటికీ.. తమ విచారణలో అదే నిజమని తేలిందని జిల్లా పరిషత్ సీఈఓ అమన్ వైష్ణవ్ తెలిపారు.

అగ్రిమెంట్ కోసం ఆన్‌లైన్‌లో స్టాంప్ పేపర్ కొనడం, ఆమె సంతకం చేయడం నిజమేనని తేలిందన్నారు. అంతేకాకుండా అగ్రిమెంట్ పేపర్స్‌పై సంతకం చేసిన సాక్ష్యుల వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు అమన్ వైష్ణవ్ చెప్పారు.

సర్పంచ్‌కు ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను, హక్కులకు మరొకరికి బదిలీ చేసే అధికారం వారికి లేదని చెబుతూ అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. కైలాష్ బాయి కచ్వను గ్రామ సర్పంచ్ పదవి నుండి తొలగిస్తున్నట్లుగా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే, ఎంత మొత్తానికి ఈ అగ్రిమెంట్ జరిగిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమ్ముకోవడం నేరమే అవుతుంది కనుక వారిపై చట్టరీత్యా తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories