Jay Shah elected ICC Chairman: జే షా ఎవరు? ప్రపంచ క్రికెట్‌లో ఇంత పవర్‌ఫుల్ ఎలా అయ్యారు?
ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో జే షా ఒక ట్రెండింగ్ పర్సన్.. ఎక్కడ చూసినా జే షా పేరే మార్మోగుతోంది.
జే షా… ప్రపంచ క్రికెట్‌లో టాప్ పోస్ట్ అయిన ఐసిసి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్ పదవికి ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా జే షా అప్పుడే ఓ రికార్డు సొంతం చేసుకున్నారు. అది కూడా ఎలాంటి పోటీ లేకుండా డైరెక్టుగా ఐసిసి చైర్మన్ అవ్వడం అంటే మాటలా మరి!
బ్యాట్, బాల్ పట్టుకుని ఏళ్ల తరబడి మ్యాజిక్ చేసిన వాళ్లకే మన బీసీసీలో పదవులకి గట్టి పోటీ తప్పడం లేదు.. అలాంటిది మైదానంలో ఏ ఆట ఆడకుండానే ఏకంగా ఐసిసికి అధ్యక్షుడి పదవిని అందుకోవడం అంటే మామూలు విషయమా మరి!! ఎక్కడో గుజరాత్ అహ్మెదాబాద్‌లో లోకల్ క్రికెట్ బోర్జు నుండి కెరీర్ మొదలుపెట్టిన జే షా.. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యున్నత స్థాయికి ఎలా వెళ్లగలిగారు.. అంత పవర్‌ఫుల్ ఎలా అయ్యారు ? అసలు ఇంతకీ ఈ జే షా ఎవరు? రండి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీ కోసమే..
ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో జే షా ఒక ట్రెండింగ్ పర్సన్.. ఎక్కడ చూసినా జే షా పేరే మార్మోగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడిగా జే షా అందరికీ సుపరిచితమే... కానీ ఐసీసీకి వెళ్లే క్రమంలో ఆయన దాటుకుంటూ వెళ్లిన మైలురాళ్ల గురించే చాలామందికి తెలియదు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జే షా.. డిసెంబర్ 1 నుండి ప్రపంచ క్రికెట్‌కి పెద్దన్న పాత్ర పోషించనున్నారు. ఔను, నవంబర్ 30వ తేదీతో ప్రస్తుత ఐసిసి చైర్మన్ గ్రెగ్ బార్క్లె పదవీ కాలం ముగియనుంది. ఆ మరునాడే జే షా ఆ స్థానంలోకి వెళ్లనున్నారు.
2009 లో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లోకి తొలిసారిగా ఎంట్రీ
జే షాకు ఇదంతా ఓవర్ నైట్‌లో వచ్చి పడిన రాజభోగమేమీ కాదు. 2009 లో గుజరాత్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్, అహ్మెదాబాద్ (CBCA) ద్వారా జే షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తరువాత గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. 2011 లో బీసీసీఐ మార్కెటింగ్ కమిటీలో జే షాకు చోటుదక్కింది.
2013 లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అప్పటికి జే షా వయస్సు కేవలం 25 ఏళ్లే. అంతేకాదు... బీసీసీఐ ప్రతీ ఏడాది నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశాలకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కి కార్యదర్శిగా వెళ్లే అవకాశం జే షా వశమైంది.
2015 లో అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ పలు నాటకీయ పరిణామాల మధ్య తన అధ్యక్ష పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, శ్రీనివాసన్ పోస్ట్ పోవడం వెనుక జే షా ప్రమేయం కూడా లేకపోలేదనే వాదనలున్నాయి. అంతేకాదు.. బీసీసీఐ కార్యదర్శి పోస్టుకు జరిగిన ఎన్నికల్లో శ్రీనివాసన్ తరపున పోటీకి దిగిన సంజయ్ పటేల్‌ని అనురాగ్ థాకూర్ ఒక్క ఓటు తేడాతో ఓడించడంలోనూ జే షా ప్రమేయం ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి.
జే షాకు పేరు తెచ్చిన ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం..
జే షాకు మొదటిసారిగా గుర్తింపు తెచ్చిన సందర్భం ఒకటుంది. 2013 లో జే షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్న రోజులవి. అప్పటివరకు ఇండియాలో అన్ని స్టేడియంలలో ఒకటిగా ఉన్న అహ్మెదాబాద్‌లోని మొతెరా స్టేడియంకు కొత్త హంగులు అద్ది దానిని 1,32,000 సీటింగ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమాన్ని ముందుండి నడిపించింది జే షానే. అప్పటికే తన తండ్రి అమిత్ షా గుజరాత్ యూనిట్‌కి అధ్యక్షుడిగా ఉండటం జే షాకు మరో కలిసొచ్చే అంశమైంది.
సీన్ కట్ చేస్తే 2020 ఫిబ్రవరి 24న డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చినప్పుడు ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ' నమస్తే ట్రంప్ ' పేరిట ప్రధాని మోదీ అట్టహాసంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈ మొతెరా స్టేడియమే వేదికైంది. ఆ తరువాతి కాలంలో ఈ స్టేడియంకే మన ప్రధాని పేరు పెడుతూ నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చేశారు.
2019 లో బీసీసీఐ జనరల్ సెక్రటరీ..
జే షా కెరీర్‌ని మరో మలుపు తిప్పిన ఏడాది ఇది. జే షా బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇది కేవలం బీసీసీఐకి మాత్రమే పవర్‌ఫుల్ పోస్ట్ కాదు.. బీసీసీఐ కార్యదర్శి హోదాలో ప్రపంచ క్రికెట్‌లోనూ అడుగుపెట్టే అవకాశం ఉన్న పోస్ట్ అంటుంటారు.
సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అవడమే అప్పట్లో అందరికీ హెడ్‌లైన్స్‌లో కనిపించిన విషయం.. కానీ అదే సమయంలో జే షా కూడా బీసీసీఐలో తన రాజకీయాలతో సైలెంటుగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లారనే ప్రచారం కూడా ఉంది.
బీసీసీఐలో కొన్ని సమస్యలు తలెత్తి సుప్రీం కోర్టు వరకు వెళ్లిన తరువాత 2022 లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ వచ్చి చేరాడు. కానీ బీసీసీఐ సెక్రటరీగా జే షానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అంటే జే షా స్థానం పదిలంగానే ఉందన్నమాట.
2020-21 కోవిడ్ సవాళ్ల మధ్య ఐపిఎల్ నిర్వహణ..
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో ప్రపంచం అంతా స్తంభించిపోయింది. అన్నిరకాల ఆటలు అటకెక్కిన రోజులవి. కానీ ఐపిఎల్ అంటేనే వేల కోట్లు కుమ్మరించే పాపులర్ గేమ్. ఎలాగైనా సరే దానిని ఆపొద్దు అన్న గట్టి సంకల్పం బీసీసీఐది. అందుకే 2020 ఐపిఎల్ టోర్నీని యునైటైడె అరబ్ ఎమిరేట్స్‌లో బయో-సెక్యూర్ బబుల్ పేరుతో ఆటగాళ్లకు అత్యంత సురక్షిత వలయం మధ్య నిర్వహించారు. 2021 ఐపీఎల్ టోర్నీ ఇండియాలో షురూ అయింది. మధ్యలోనే ఆటగాళ్లకు కొవిడ్ ఎటాక్ అవడంతో ఆటను అర్ధాంతరంగా ఆపేసి ఆ ఏడాది చివర్లో మళ్లీ యూఏఈలోనే పూర్తి చేశారు. ఇందులోనూ జే షా పట్టుదలే ఎక్కువగా కనిపించిందంటారు ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరిగా గమనించినవాళ్లు.
బీసీసీఐ నుండి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌కి..
జే షా కెరీర్లో మరో ముఖ్యమైన ఘట్టం ఇది. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా.. బీసీసీఐ సెక్రటరీ హోదాలో ఉంటూ ప్రపంచ క్రికెట్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉందని. అలాగే జే షా కూడా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌కి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడు మన జే షానే. ఒక రకంగా జే షా ఐసీసీకి వెళ్లడంలో ఇక్కడే మరో ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీసీ అధ్యక్షుడిగా ఉంటూనే 2022 లో ఐసిసిలో ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే కీలకమైన ఫినాన్స్ అండ్ కమెర్షియల్ ఎఫైర్స్ కమిటీకి జే షా చైర్మన్ అయ్యారు. డైరెక్టుగా ఐసీసీలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగేందుకు ఈ పొజిషన్ మంచి అవకాశాన్ని ఇచ్చింది.
ఐపీఎల్‌ని ప్రపంచంలోనే రిచెస్ట్ గేమ్‌గా మార్చేసిన జే షా...
జే షా బీసీసీఐలో చక్రం తిప్పడం మొదలుపెట్టాకా ఐపీఎల్ స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయాయి. ఒక్క ఐదేళ్ల కాలంలోనే బీసీసీఐ ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా 48,390 కోట్లు వెనకేసుకుంది. దీంతో ప్రపంచంలో భారీగా కనక వర్షం కురిపించే ఆటల్లో అత్యంత రిచెస్ట్ గేమ్ అయిన అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ తరువాత రెండో స్థానంలోకి మన ఐపీఎల్ వచ్చి చేరింది.
లేట్ అయినా.. లేటెస్టుగా వచ్చిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్..
బీసీసీఐ ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న ఆటల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఒకటి. వివిధ కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చి, చివరకు 2022 లో డబ్లూపీఎల్ క్రీడా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. రావడంలో లేట్ అయ్యుండొచ్చు కానీ.. క్రేజ్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ముందునుండీ రికార్డులు సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలు ప్లేయర్స్‌ని కొనడం నుండి మొదలుపెడితే.. వారి నుండి బీసీసీఐ మళ్లీ ఆదాయం రాబట్టే వరకు డబ్లూపీఎల్‌కి కూడా భారీ క్రేజ్ కనిపించింది. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తయ్యాయి.
ఈ వ్యూహాలన్నింటి వెనుక మాస్టర్ మైండ్ జే షానే అంటుంటారు. డబ్లూపీఎల్ క్రేజ్ చూశాకా.. పురుషులకు ఇస్తున్న మ్యాచ్ ఫీజునే మహిళా ప్లేయర్స్‌కి కూడా వర్తింపజేస్తాం అని బీసీసీఐ భావించింది. కానీ ఎందుకో ఆ నిర్ణయం కార్యరూపం దాల్చడంలో మాత్రం ఇంకా ఆలస్యం అవుతూనే వస్తోంది.
బీసీసీఐలో జే షా పలుకుబడి ఏ స్థాయిలో ఉందంటే...
బీసీసీఐలో జే షా ఇమేజ్ ఏ స్థాయికి వెళ్లిందంటే.. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించే భారత జట్టులో ఎవరెవరు ఉంటారో కూడా ఇంకా క్లారిటీ లేకముందే.. ఫిబ్రవరిలోనే జే షా ఒక ప్రకటన చేశారు. టీమిండియాను రోహిత్ శర్మనే లీడ్ చేస్తారంటూ జే షా ఎనౌన్స్ చేశారు. బీసీసీలో జే షా ఇష్టారాజ్యం అని విమర్శించే వాళ్లకు ఆయనిచ్చిన ఈ స్టేట్మెంట్ ఓ అస్త్రంగా దొరికింది అది వేరే విషయం.
ఇలా జే షా గుజరాత్‌లోని అహ్మెదాబాద్‌లో సెంట్రల్ క్రికెట్ బోర్డు అడ్మినిస్ట్రేషన్‌లో తన కెరీర్ మొదలుపెట్టి.. చివరకు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యున్నత స్థానమైన ఐసిసి చీఫ్ స్థాయికి ఎదిగే క్రమంలో ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ వెళ్లారు. ఇక ఇప్పుడు అందరి ముందున్న సందేహం ఏంటంటే.. ఇప్పటికే వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీస్‌లో ఒకటిగా బీసీసీఐకి పేరుంది. మరి బీసీసీఐ నుండి ఐసీసీకి వెళ్తున్న జే షా.. ఐసీసీ చీఫ్ హోదాలో బీసీసీఐని ఇంకా ఏ స్థాయికి వెళ్లేలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire