Anukathir Surya: లింగమార్పిడి చేసుకుని పురుషుడిగా మారిన ఐఆర్ఎస్ అధికారి

Who is Anukathir Surya, an IRS officer who made history with a gender change
x

Anukathir Surya: లింగమార్పిడి చేసుకుని పురుషుడిగా మారిన ఐఆర్ఎస్ అధికారి

Highlights

Anukathir Surya: హైద్రాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో ఎం. అనుకతిర్ సూర్య జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సూర్య స్వంత రాష్ట్రం తమిళనాడు.

Anukathir Surya: ఎం. అనసూయ ఐఆర్ఎస్ అధికారి. ఆమె తనను ఇక నుండి పురుషుడిగా గుర్తించాలని, పేరు మార్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖను కోరారు. ఈ అభ్యర్థనకు ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. ఇక నుండి అనసూయ పేరు ఎం. అనుకతిర్ సూర్యగా మారింది. స్త్రీకి బదులుగా ఆమెను పురుషుడిగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ గుర్తించింది.

హైద్రాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో ఎం. అనుకతిర్ సూర్య జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సూర్య స్వంత రాష్ట్రం తమిళనాడు.

ఓ ఐఆర్ఎస్ అధికారి లింగమార్పిడి చేసుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఎం. అనసూయ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నాం. ఇకపై అనసూయకు చెందిన అన్ని అధికారిక రికార్డుల్లో మిస్టర్ ఎం. అనుకతిర్ సూర్యగా గుర్తిస్తారని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ జూలై 9న ఉత్తర్వులు జారీ చేసింది.



చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు

సూర్య చెన్నై మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 2023 భోపాల్ లో నేషనల్ లా ఇనిస్టిట్యూట్ యూనివర్శిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్ లో పీజీ డిప్లొమా చేశారు. 2013లో చెన్నైలో వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగంలో చేరారు. 2018లో డిప్యూటీ కమిషనర్ గా ప్రమోషన్ పొందారు. 2023లో హైద్రాబాద్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా విధుల్లో చేరారు.

ఒడిశాలో ఐశ్వర్య రితుపర్ణకు మహిళగా గుర్తింపు

లింగ గుర్తింపు వ్యక్తిగత ఎంపిక అని సుప్రీంకోర్టు 2014 ఏప్రిల్ 15న నల్సా కేసులో తీర్పు వెల్లడించింది. లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నా, లేకున్నా లింగ గుర్తింపు వారి వ్యక్తిగత ఎంపికగా ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఒడిశాలోని వాణిజ్య పన్నుల శాఖలో విధుల్లో చేరిన తర్వాత ఐదేళ్లకు లింగమార్పిడి చేసుకున్న అధికారి తనను స్త్రీగా గుర్తించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అనుకూలంగా తీర్పు రావడంతో ఆ అధికారి తన పేరును ఐశ్వర్య రీతుపర్ణ ప్రధాన్ గా మార్చుకున్నారు.


నల్సార్ యూనివర్శిటీలో ఏం జరిగిందంటే?

నల్సార్ యూనివర్శిటీ జారీ చేసే సర్టిఫికెట్లలో లింగాన్ని ప్రస్తావించవద్దని బీఏ ఎల్ ఎల్ బీ చదివే విద్యార్థి ఒకరు 2015 జూన్ లో యూనివర్శిటీని అభ్యర్థించారు. విద్యార్థి సర్టిఫికెట్ లో ఎంఎస్ కు బదులుగా ఎంఎక్స్ అనే పదం చేర్చాలని విద్యార్థి అభ్యర్థనను యూనివర్శిటీ అంగీకరించింది. ఏడేళ్ల తర్వాత 2022 మార్చిలో ఎల్బిటిక్యూ+ విద్యార్థులకు హస్టల్ లో వసతికి అనుమతి ఇచ్చింది.

పీజీ చేసిన తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ రూత్

హైద్రాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎండీ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రోగ్రాంలో స్థానం సంపాదించారు డాక్టర్ రూత్ పాల్ జాన్. దేశంలో పీజీ చేసిన తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ జాన్. 2023 జూలైలో తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియ జనరల్ ఆసుపత్రిలో తొలి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ఏర్పాటు చేసింది. ఇక్కడ పనిచేసే వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చారు. హైద్రాబాద్ యూనివర్శిటీ 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రాన్స్ జెండర్ విధానాన్ని ప్రకటించింది. దిల్లీ యూనివర్శిటీ తర్వాత ఈ విధానం అమలు చేసింది యూనివర్సిటీ ఆఫ్ హైద్రాబాద్.

Show Full Article
Print Article
Next Story
More Stories