Top
logo

షా-పీకే మధ్యలో జగన్?

షా-పీకే మధ్యలో జగన్?షా-పీకే మధ్యలో జగన్?
Highlights

ఒకవైపు జగన్‌ వరుసగా హస్తిన పర్యటనలు, కేంద్ర పెద్దలతో సమావేశాలు...మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల...

ఒకవైపు జగన్‌ వరుసగా హస్తిన పర్యటనలు, కేంద్ర పెద్దలతో సమావేశాలు...మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం....ఇంకోవైపు ఈనెల 18న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కీలక ప్రకటన....వీటన్నింటికీ ఎక్కడో లింకుందా? ఒకదానికొకటి పెనవేసుకున్నట్టు ఎందుకు చర్చ జరుగుతోంది?

ఒకవైపు ఐటీ దాడులపై వైసీపీ, టీడీపీల వాగ్వాదం - మరోవైపు జగన్‌ ఢిల్లీ పర్యటనలపై ఆసక్తికర చర్చ - ఇంకోవైపు ప్రశాంత్‌ కిశోర్‌ కూటమిపై ఉత్కంఠ - ఈ మూడింటికీ ఏదో లింకుందా? లింకు వుందనే సమాధానమే వస్తోంది ప్రస్తుత పరిణామాలనను అంచనా చూస్తుంటే. ఇంతకీ ఏంటా లింకు.

ఈనెల 18న ఏం జరగబోతోంది? ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటన ఏంటి?

ప్రశాంత్‌ కిశోర్. సింపుల్‌గా పీకే. ఏకే ఫార్టీ సెవన్ రేంజ్‌లో, ఈ పేరు ప్రతిధ్వనిస్తోంది. ఎన్నికల విజయాల వ్యూహకర్తగా, దేశంలో పాపులర్ అయ్యారు పీకే. ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, తనదైన స్ట్రాటజీలను అప్లై చేశారు. ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడీ ఎన్నికల వ్యూహకర్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి, నరేంద్ర మోడీ, అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారట. దానిలో భాగంగానే ఈనెల 18న ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ కూటమి ప్రకటించబోతున్నారట.

మరి పీకే కూటమికి ఢిల్లీలో జగన్‌ పర్యటనకు లింకేంటి?

అదే ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. ప్రాంతీయ కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ఆద్మీ ఎలాగూ సిద్దమనొచ్చు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ వున్నాయి. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారట. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. తనకు రాహుల్ ప్రత్యామ్నాయం కాకపోవడంతో, తనకు ఎదురులేదని దూసుకుపోతున్న మోడీకి, ప్రాంతీయ పార్టీల కూటమి ఏకంతో, తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని ఆహ్వానించొచ్చు. అదే ఇప్పుడు కమలంలో అలజడి రేపుతోందట.

ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ను ఒత్తిడి చేస్తోందట బీజేపీ అధిష్టానం. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా వుండాలని చెబుతోందట. అందుకే వరుసగా జగన్‌ను పిలిపించుకుని మాట్లాడుదోందట. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని చెప్పాలని సూచిస్తోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని, విశ్వసనీయవర్గాల సమాచారం. అంతేకాదు, ఎన్డీయేలోంచి శివసేన వెళ్లిపోయంది కాబట్టి, మరోబలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలోకి రావాలని వైసీపీని ఒత్తిడి తెస్తోందట. విజయసాయిరెడ్డితో పాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామంటోందట. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఈ పేర్లపైనా కమలం పెద్దలతో జగన్‌ చర్చించారన్నది వినిపిస్తున్న మరో మాట.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ, ఢిల్లీ, పూణేల్లో సోదాలు జరిగాయి. దాదాపు రెండు వేల కోట్ల అక్రమ ఆస్తులు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అయితే, ఇవన్నీ కూడా చంద్రబాబు బినామీలపై జరుగుతున్న దాడులను, బాబు అవినీతి బాగోతం బయటపడుతోందని, వైసీపీ ఆరోపిస్తుంటే, టీడీపీ ఖండిస్తోంది.

మరి జగన్‌ ఢిల్లీ పర్యటనకు, ఐటీ దాడుల హడావుడికి లింకేంటన్న చర్చ కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఐటీ దాడుల వెనక బీజేపీ పెద్దలు, జగన్‌ సైతం వున్నారని టీడీపీ అనుమానిస్తోంది. జగన్‌ తరహాలోనే చంద్రబాబుపై కూడా లక్ష కోట్ల అక్రమాస్తుల ముద్ర వెయ్యాలన్న స్కెచ్‌ వేస్తున్నారని, అందుకే ఇంత హడావుడి చేస్తున్నారన్న అనుమానాలపై తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. జగన్‌ తాజా ఢిల్లీ పర్యటన సారాంశం అదేనని, చంద్రబాబును అష్టదిగ్బంధనం చెయ్యాలని బీజేపీకి సూచిస్తున్నారని టీడీపీ నేతలు లోలోపల టెన్షన్ పడుతున్నారు. అతి త్వరలో చంద్రబాబుకు సంబంధించి కీలక పరిణామాలు జరగబోతున్నాయని, అందుకే ఆ‍యన వీటిపై మాట్లాడకుండా సైలెంట్‌గా వున్నారని, ఇటు వైసీపీ నేతలు సైతం అంటున్నారు.

అయితే, సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనను తెలుగుదేశం మరో విధంగా అభివర్ణిస్తోంది. జగన్‌పై సీబీఐ ఉచ్చు బిగుస్తోందని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం ఇబ్బందిగా మారుతోందని, త్వరలో బెయిల్‌ రద్దు చేయడం ఖాయమని, అందుకే కేంద్రంతో బేరసారాలు ఆడేందుకే అదేపనిగా హస్తిన వెళుతున్నారని వ్యాఖ్యానిస్తోంది టీడీపీ.

మొత్తానికి ఒకవైపు ఐటీ దాడులు, మరోవైపు జగన్‌ ఢిల్లీ పర్యటన, ఇంకోవైపు ప్రశాంత్‌ కిశోర్‌ ప్రాంతీయ కూటమి ఈ మూడింటికీ ఏదో లింకుందన్న చర్చ జరుగుతోంది. పీకే కూటమిలోకి జగన్‌ వెళ్లకుండా, ఇద్దరి ఉమ్మడి శత్రువైన చంద్రబాబును బీజేపీ గురిపెట్టిందని, నయానో భయానో జగన్‌ను ఆపాలనుకుంటోందన్న మాటలు వినపడ్తున్నాయి. మొత్తానికి రానున్న కొన్ని రోజుల్లో, తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. చూడాలి, ఏం జరుగుతుందో.Web TitleWhat is the link between Prashant Kishor and ys Jagan to visit Delhi YS Jagan in the middle of Amit shah and Prashant Kishor political issue
Next Story


లైవ్ టీవి