Vijay: పీకేతో విజయ్ మంతనాలు.. స్పందించిన ఇతర పార్టీల నేతలు..

Vijay Talks With Prashant Kishor Faces Backlash From Other Parties
x

పీకేతో విజయ్ మంతనాలు.. స్పందించిన ఇతర పార్టీల నేతలు..

Highlights

తమిళనాడు రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారం చేతులు మారుతుంటుంది. అయితే ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Vijay: తమిళనాడు రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారం చేతులు మారుతుంటుంది. అయితే ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్తగా తమిళగ వెట్రి కళగం (TVK) పేరుతో పార్టీ స్థాపించిన తమిళ హీరో దళపతి విజయ్ పూర్తి స్థాయిలో బరిలోకి దిగనున్నారు. అందుకు తగ్గట్టే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ప్రత్యేక సలహాదారునిగా నియమించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పీకేతో విజయ్ మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఇప్పటికే పీకేతో విజయ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఒప్పందం కుదిరితే విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. గతంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి నాయకులకు పొలిటికల్ వ్యూహాలను రూపొందించిన పీకే.. ఇప్పుడు విజయ్ కోసం ప్రత్యేకంగా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ప్రధానంగా రెండు కీలక కార్యక్రమాలపై పీకే దృష్టి పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదట విజయ్ బలమైన మాస్ కనెక్షన్‌ను పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రజా యాత్రను చేయాలని పీకే సూచించినట్టు సమాచారం. జగన్ మాదిరిగా పాదయాత్ర చేయడం, లేదా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో బస్సు యాత్ర నిర్వహించడం అనే ఆలోచన పీకే పక్కాగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. విజయ్ పార్టీకి స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్ అందించేందుకు పీకే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారని టాక్.

ఇప్పటికే పీకే తన సంస్థ ఐప్యాక్ నుంచి వైదొలగి.. వ్యక్తగతంగా వ్యూహాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్‌తో కలిసి తమిళ రాజకీయాల్లో ఓ కొత్త యాంగిల్ తీసుకురాబోతున్నారని చర్చ జరుగుతోంది. ఒకవేళ పీకే వ్యూహాలు విజయవంతం అయితే తమిళ రాజకీయాల్లో విజయ్ పార్టీ ప్రభావం భారీగా ఉండే అవకాశముంది. అయితే విజయ్ పార్టీకి 15 నుంచి 20 శాతం ఓటు షేర్ ఉండవచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేసినట్టు సమాచారం. దీనిని మరింత పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

అయితే పీకేతో విజయ్ మంతనాలను తమిళ రాజకీయ పార్టీలు తేలికగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరి భేటీపై పలువురు నేతలు స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు అడిగే ప్రతి పార్టీ, తమకే 100 శాతం ఓట్లు వేస్తాయని ప్రకటించుకోవడం పరిపాటేనన్నారు డీఎంకే నేత, మంత్రి శేఖర్ బాబు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ప్రజలు మరోసారి ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ.. ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పీకే ఓ రాజకీయ పార్టీకి సేవలందిస్తే తమకేమీ ఇబ్బంది, ఆందోళన ఉండదన్నారు. సినీ గ్లామర్ ఒక్కటే రాజకీయాల్లో విజయానికి దోహద పడదని సీపీఎం నేత బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు బీహార్ ఉపఎన్నికల్లో ఓటమి చెందడంపై పీకే స్పందించిన తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

ఇక విజయ్ పనితీరుపైనే టీవీకే పురోగతి ఆధారపడి ఉంటుందని డీఎండీకే నేత ప్రేమలతా విజయ్ కాంత్ అభిప్రాయపడ్డారు. విజయ్ పార్టీతో పొత్తు అంశాన్ని ఆ పార్టీనే అడగాలని.. అన్నాడీఎంకేతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories