Vaccination: దేశంలో 106 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Vaccination Process Was Slow Down in India
x

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vaccination: అక్టోబర్ నెలలో 25 శాతం తగ్గిన వ్యాక్సిన్ పంపిణీ

Vaccination: భారత్‌లో కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోనప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం వీడడం లేదు. ఇప్పటికే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితి మూడో వేవ్‌ను కొని తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ నుంచి బయటపడేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బూస్టర్ డోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ భారత్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి.

వ్యాక్సినేషన్‌లో భారత్ మైలు రాయిని దాటింది. వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం సంబరాలు చేసింది. ప్రస్తుతం దేశంలో 106 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. గతంతో పోలిస్తే అక్టోబర్ నెలలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ 25 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రాల దగ్గర టీకాల నిల్వలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెప్టెంబరులో 24 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయగా గత నెల 17 కోట్ల దిగువకు పడిపోయింది. ఇక దసరా పండుగ సమయంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలెవరూ ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ నిల్వలు భారీగా పెరిగిపోయాయి.

అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రాల దగ్గర 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉండగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో ఈ నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రాల దగ్గర 13 కోట్ల డోసులు, ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర 2 కోట్ల నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం అక్టోబర్ నెలలోనే వ్యాక్సిన్ డోసుల నిల్వలు మూడు రెట్లు పెరిగాయి. గతంలో వ్యాక్సిన్ డోసులు పంపిణీ సరిగ్గా చేయడం లేదంటూ కేంద్రంపై విమర్శలు చేసిన రాష్ట్రాలు ఇప్పుడు సరిపడ డోసులు ఉన్నా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయకపోవడంపై కేంద్రం సీరియస్‌గా ఉంది.

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగింది. ప్రస్తుతం కోవిడ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. టీకా వేసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయనే భావనతో పాటు ప్రస్తుతం కేసులు తక్కువగా నమోదవుతున్నాయనే అపోహతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. మరోవైపు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తైనవారు సుమారు 10 కోట్ల మంది సెకండ్ డోస్ వేసుకునేందుకు రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.

వ్యాక్సిన్ నిల్వలు భారీగా పెరిగిపోతుండడంతో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది చివరికల్లా అర్హులైన 94 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇంటింటికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని భావిస్తోంది. ఫస్ట్ డోస్ తీసుకోని వారి ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధాని విదేశి పర్యటన నుంచి తిరిగి రాగానే వ్యాక్సినేషన్ పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 50 శాతం కన్నా తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన జిల్లాల అధికారులు, సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.

మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్నా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జనసంద్రం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్, భౌతికదూరం తప్పకుండా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని,, లేదంటే మూడో ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories