Uttarakhand Tunnel: టన్నెల్‌లో చిక్కుపోయిన కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్

Tunnel Rescue Mission a Success as 41 Trapped Workers Rescued
x

Uttarakhand Tunnel: టన్నెల్‌లో చిక్కుపోయిన కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ 

Highlights

Uttarakhand Tunnel: 41మందిని బయటికి తీసుకువచ్చిన సహాయక సిబ్బంది

Uttarakhand Tunnel: 17 రోజుల శ్రమ ఫలించించింది. సహాయక బృందాలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఉత్తర్ కాశీ సొరంగంలో చిక్కుకున్న 41మంది కూలీలు క్షేమంగా బయటికి వచ్చారు. వారు చిక్కుకున్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్‌ చేపట్టిన అధికారులు.. అందులోకి గొట్టాన్ని పంపించి దాని ద్వారా కూలీలు ఒక్కొక్కర్నీ బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో వారిని ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా సురక్షితంగా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కూలీలను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

నవంబరు 12న సొరంగం పనులు చేస్తుండగా అనూహ్యంగా చోటు చేసుకున్న ఘటనతో వారంతా సొరంగంలో చిక్కుకుపోయారు. బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించారు. వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి సహాయక సిబ్బంది వారి ప్రాణాలను కాపాడారు.

సొరంగ శిథిలాల్లో 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేయగలిగితే కూలీల వద్దకు చేరుకోవచ్చని అధికారులు గుర్తించారు.. అందుకోసం ఆగర్‌ యంత్రంతో డ్రిల్లింగ్‌ చేపట్టారు. ఈ మిషన్‌ 47 మీటర్లు తవ్విన తర్వాత.. ప్రమాదవశాత్తూ సొరంగంలోని ఇనుపపట్టీని ఢీకొట్టింది. దీంతో దీని బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయకుండా పోయింది. అయినా అధికారులు వెనకడుగు వేయలేదు. ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టారు. అదే సమయంలో సొరంగంలో చిక్కుకున్న ఆగర్‌ మిషన్‌ శిథిలాలను కట్టర్‌ సాయంతో తొలగించారు.

ఆ తర్వాత 12 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్లను రంగంలోకి దించారు. మిగతా డ్రిల్లింగ్‌ పనిని వీరు మాన్యువల్‌గా చేపట్టారు. సోమవారం రాత్రి నుంచి ఈ ర్యాట్‌ హోల్‌ మైనర్లు మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు. అధికారులు, సిబ్బంది పడిన శ్రమకు ఫలితం దక్కింది. కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. వారు పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లేంతవరకు ఆస్పత్రుల్లో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories