logo
జాతీయం

Delhi: రాజధానిని చుట్టుముట్టిన కష్టాలు

Troubles in Delhi | Telugu News
X

రాజధానిని చుట్టుముట్టిన కష్టాలు

Highlights

Delhi:*రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు *ఢిల్లీపై ప్రచండ నిప్పులు కురిపిస్తున్న భానుడు *భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

Delhi: రాజధాని ఢిల్లీని కష్టాలు చుట్టుముట్టాయి. కరోనా మహ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. నిత్యం భారీగా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఎండలు రికార్డు స్థాయిలో పెరిగాయి. భానుడి కురిపిస్తున్న ప్రపంచ నిప్పులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండల భయంతో ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టలేకపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనానికి ఫ్యాన్లు, ఏసీలను నిత్యం వాడుతుండడంతో ఇప్పుడు కరెంటు కష్టాలు కూడా తోడయ్యాయి. పుండు మీద కారం చల్లిన చందంగా.. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత వేధిస్తోంది.. ఆసుపత్రులతో పాటు అత్యవసర సేవలకు 24 గంటల కరెంటు అందించలేని దుస్థితి తలెత్తిందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 15 వందల 20 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించగా.. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. నిన్నటితో పోల్చితే కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి 15 వందలు పైగా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నుంచి నిత్యం కేసులు పెరుగుతుండడంతో రాజధానివాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగుతున్న కేసులు మాత్రం ప్రజలను టెన్షన్‌ పెడుతున్నాయి. గతంలోనూ ఇలాగే పెరిగి చివరికి లాక్‌డౌన్‌కు దారితీసింది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడదుల చేసింది. మాస్క్‌ను తప్పనిసరి చేసింది. ఎవరైనా ఉల్లంఘిస్తే.. 500 రూపాయల జరిమానా విధిస్తామని ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఒక్క విద్యార్థికి కరోనా సోకినా స్కూల్‌ను మూసేయాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. 72 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండుతున్నాయి. దేశ రాజధానిలో 40 డిగ్రీల సెల్సియస్‌ అంటేనే బాబోయ్ అనేవాళ్లు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని కొన్ని చోట్ల ఏకంగా 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. గత 12 ఏళ్లలో 2010లో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే ఈ భారీ స్థాయిలో భానుడు ప్రచండ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే ఎండలు భారీగా మండుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి భయపడి.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూలీలు, ఇతర రంగాలకు చెందిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నెలలో ఎండలు మరింత పెరగవచ్చని, రాత్రిళ్లు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఎండల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. భారీ ఎండల కారణంగా ఢిల్లీలో విద్యుత్‌ డిమాండ్‌ తారాస్థాయికి చేరింది. ఏప్రిల్‌లో తొలిసారి రోజువారీ కరెంటు డిమాండ్‌ 6వేల మెగావాట్ల మార్కును టచ్‌ చేసింది. బొగ్గు కొరత కారణంగా దాద్రీ-2, ఊంచహార్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ విద్యుత్‌ అవసరాల్లో 30 శాతం మేర విద్యుత్‌ ఈ ప్లాంట్ల నుంచే సరఫరా అవుతోంది. దాద్రి-2 నుంచి ఢిల్లీకి 17 వందల 51 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఈ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి కరెంటు ఉత్పత్తి ఆగిపోతే ఢిల్లీలో అంధకారం నెలకొనడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెట్రో రైళ్లు, ఆసుపత్రులతో పాటు అత్యవసర సేవలందించే కీలక వ్యవస్థలకు నిరంతర విద్యుత్ అందించడం సాధ్యం కాదని కేజ్రీవాల్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

దేశవ్యాప్తంగా ఎండలు మంట పుట్టిస్తున్నాయి. దీంతో ఢిల్లీలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది. ఈసారి ఏప్రిల్‌లో తొలిసారి 6వేల మెగావాట్ల కరెంటును ప్రజలు వాడేశారు. అయితే విద్యుత్‌ వినియోగం అధికమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఉత్పత్తిని కూడా పెంచాలి. అయితే అందుకు సరిపడా బొగ్గు లేకపోవడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కేంద్రంపై విమర్శలకు దిగింది. ఇది రాజకీయ విమర్శలని బీజేపీ కొట్టిపడేసింది. దేశంలో బొగ్గు నిల్వలు భారీగా ఉన్నాయని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు. కోల్‌ ఇండియా సహా వివిధ ప్రాంతాల్లో 7వేల 250 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉందన్నారు. అదే సమయంలో థర్మల్ పవర్‌ ప్లాంట్లలోనూ 220 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు ప్రహ్లాద్‌ జోషి ట్వీట్‌ చేశారు. తక్షణమే బొగ్గు సరఫరా పెంచాలంటూ ఈమేరకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ కేంద్రానికి లేఖ రాశారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. బొగ్గు సరఫరాకు చర్యలు చేపట్టింది.

ఓ వైపు వైరస్‌ భయం మరోవైపు ఎండల కష్టాలతో ఢిల్లీ ప్రజలు విలవిలలాడుతున్నారు. త్వరలో బొగ్గు సరఫరా జరిగినా కరోనా మాత్రం రాజధానివాసులను వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. అందులోనూ చిన్నారులు కూడా వైరస్ బారిన పడుతుండడం ఢిల్లీవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Web TitleTroubles in Delhi | Telugu News
Next Story