Wheat: దేశంలో గోధుమలకు తీవ్ర కొరత

There is a Severe Shortage of Wheat in the Country
x

Wheat: దేశంలో గోధుమలకు తీవ్ర కొరత

Highlights

Wheat: గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం

Wheat: అన్నపూర్ణగా పేరుపొందిన మన దేశంలో ఆహారధాన్యాల ధరలు పెరిగిపోవడం.. అసలు ఆహార గింజలకే కటకటలాడే స్థితి వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏమాత్రం ముందు చూపు లేని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక విధానాలే.. ప్రజల జీవన స్థితిగతులు దిగజారిపోవటానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలో ధాన్యం గింజలకు కొరత ఏర్పడే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచంలో గోధుమల కొరత ఏర్పడింది. ఈ స్థితి నుంచి అనేక దేశాలను ఆదుకుంటున్నామంటూ మోడీ ప్రభుత్వం.. ప్రపంచ దేశాలకు మిలియన్ల కొద్దీ టన్నుల గోధుమలను నిన్నా మొన్నటి దాకా ఆ దేశాలకు ఎగుమతి చేసింది. ఈ క్రమంలోనే కాస్తంత వాణిజ్య లోటు భర్తి చేసుకుంటూ.. విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకుంది. అయితే, ఒకానొక దశకు చేరుకునేసరికి.. భారత ఆహార సంస్థ గోడౌన్లలో.. తగ్గిపోయిన గోధుమల నిల్వల కళ్ళముందు కనపడింది. దాంతో గోధుమల ఎగుమతిపై నిషేధం విధించారు. మరోవైపు తెలివితేటలు శృతి మించి పోయిన వ్యాపారస్తులు మాత్రం.. ఈ ఎగుమతిని కొనసాగించేందుకు మరో మార్గాన్ని కనుగొన్నారు. గోధుమలు బదులు గోధుమపిండి ఎగుమతి చేయటం మొదలు పెట్టారు. మరోసారి అప్రమత్తమైన కేంద్రం.. అన్ని రూపాలలో గోధుమల ఎగుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఎగుమతులకు అదనంగా.. గోధుమల పంట, ధాన్యం సేకరణ కూడా గణనీయమైన స్థాయిలో పడిపోయింది. అటు ప్రైవేటు వ్యాపారులు పెద్ద ఎత్తున గోధుమలను కొన్నారు. దీనికి తోడు ఈ వేసవి కాలంలో వేడి గాలుల తాకిడితో గోధుమ దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీనంతటి ఫలితమే, ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద అనేక రాష్ట్రాలలో సాధారణంగా గోధుమలు సరఫరా చేసే చోట కూడా.. వాటి కొరత వల్ల కాస్త నిల్వలు అధికంగా ఉన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఫలితంగా, ఆహారపు అలవాట్ల ప్రకారం గోధుమలు తినే పలు రాష్ట్రాల ప్రజలు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమలకు ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఈ బియ్యాన్ని తీసుకోలేదు. దాంతో వారు అధిక ధరకు బహిరంగ మార్కెట్లో గోధుమలను కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఒకవైపు గోధుమల అందుబాటు తగ్గిపోవటం.. మరోవైపు వాటి ధర పెరగటంతో ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 2022 నాటికి భారత ఆహార సంస్థ వద్ద 14 సంవత్సరాల కనిష్ట స్థాయికి గోధుమల నిల్వలు పడిపోవటం నేడు మన దేశం ముందు ప్రధాన సవాలుగా నిలుస్తోంది. పైగా, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వ్యాపారస్తులను బెదిరిస్తూ.. అవసరమైతే దిగుమతి సుంకాన్ని ఎత్తేసి.. గోధుమల దిగుమతి చేస్తానంటూ సంకేతాలు పంపుతోంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధర దేశీయ మార్కెట్లో కంటే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దిగుమతులు చేసుకోవడం ద్వారా గోధుమ ధరలను తగ్గిస్తానంటూ వ్యాపారస్తులను బెదిరించాలని చూసినా.. అది ఉత్త ఉడత ఊపులు గానే మిగిలిపోతుంది. మరోవైపు అంతర్జాతీయ మీడియా కూడా భారతదేశం గోధుమలను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతోంది. దీంతో భారత ప్రభుత్వం ఈ వార్తలను ఖండించ్చింది. ఏదేమైనా రానున్న రోజుల్లో గోధుమల ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు బియ్యం పరిస్థితి ఇలాగే ఉండబోతోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గోధుమల ధర అంత కాకపోయినా.. ప్రస్తుతం బియ్యం ధర కూడా కాస్తంత ఎక్కువగానే ఉంది. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో దేశంలోని కొన్ని రాష్ట్రాలలో అతి వర్షపాతం.. మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితి వల్ల.. నేడు మన బియ్యం ఉత్పత్తి కూడా సుమారు 12 శాతం మేర పడిపోబోతోంది. దీనికి కారణం వరి ధాన్యం నాట్లు తగ్గిపోవడమే. మరోవైపు మన దేశం అనేక సంవత్సరాలుగా భారీ ఎత్తున బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తోంది. గణాంకాల ప్రకారం అంతర్జాతీయ బియ్యం ఎగుమతుల మొత్తంలో మన దేశానిది 40 శాతం వాటా. కాగా, ఉత్పత్తి కొరత పొంచి ఉన్న నేటి స్థితిలో కూడా మన దేశం మరింతగా బియ్యాన్ని ఎగుమతి చేయబోతోందట.

ఇప్పుడు దేశంలో బియ్యం కొరత, దాని ధరల పెరుగుదల కూడా పెద్ద సమస్యగా మారబోతోంది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన కేంద్రం.. ప్రస్తుతం నూకల బియ్యం ఎగుమతుల నిషేధం పల్లవి అందుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నూకల బియ్యాన్ని చాలా దేశాలలో మరీ ముఖ్యంగా చైనాలో పశువుల దాణాగా వాడుతున్నారు. సెనెగల్ వంటి దేశం, అలాగే అతి కొద్ది పేద ఆఫ్రికా దేశాల్లో మాత్రమే ప్రజలు నూకల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రస్తుతం మన ప్రభుత్వం ఈ నూకల బియ్యం ఎగుమతులను నిషేధించి. మరోవైపు నాణ్యమైన బియ్యం ఎగుమతులను మాత్రం భారీ స్థాయిలోనే కొనసాగించపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. తెలంగాణ ప్రజానీకాన్ని నూకల బియ్యం తినమంటూ ఉచిత సలహా ఇచ్చిన ఉదంతం కళ్ళముందు కనపడుతూ ఉంది కదూ. మొత్తంగా విదేశాల్లోని ప్రజల వినియోగానికి, విదేశీ మారక ద్రవ్యం సముపార్జనకు నాణ్యమైన బియ్యం ఎగుమతులు.. దేశీయ ప్రజల కోసం నూకల బియ్యం నిల్వలన మాట. ఇప్పుటికైనా కేంద్రం తన ధోరణి మార్చుకుంటుందా అనేది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories