ఉచితాల కట్టడికి నిపుణుల కమిటీ

The Supreme Court Sought Opinions on the Composition of the Committee Within a Week
x

ఉచితాల కట్టడికి నిపుణుల కమిటీ

Highlights

Supreme Court: పాలక, ప్రతిపక్షాలు కూడా ఉండాలని సుప్రీం కోర్టు సూచన

Supreme Court: దేశంలో రాజ‌కీయ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా పోటీప‌డి వాగ్దానాలు ఇస్తుంటాయి. అందులో భాగంగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. అయితే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు గుప్పించే ఉచిత హామీల క‌ట్టడి కోసం అత్యున్నత క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పంపిణీ హామీలివ్వడం తీవ్ర ఆర్థిక అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘం, లా కమిషన్‌, ఆర్‌బీఐతో పాటు పాలక, ప్రతిపక్షాలు, ఇతర భాగస్వాములు కూడా సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పార్టీల ఉచిత హామీలను ఏ విధంగా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరింది. సదరు కమిటీ కూర్పుపై కేంద్రం, ఎన్నికల కమిషన్‌, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, పిటిషనర్లు తమ అభిప్రాయాలను వారం రోజుల్లో తెలియజేయాలని చీఫ్‌ జస్టిస్‌ NV రమణ, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాజ‌కీయ పార్టీలు ఉచిత హామీల ప్రక‌ట‌న‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సమయంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అర్ధం లేని ఉచితాలు దేశ ఆర్ధిక వ్యవ‌స్ధను భ్రష్టు ప‌ట్టిస్తాయ‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఈ వ్యవ‌హారంపై చ‌ర్చ జ‌రిపి చ‌ట్టంతో ముందుకు వ‌చ్చేలా ఉచిత హామీల‌పై నిర్ణయాన్ని పార్లమెంట్‌కు విడిచిపెట్టాల‌ని సీయ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ కోరారు. దీనికి జస్టిస్‌ రమణ స్పందిస్తూ.. 'ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరుగుతుందని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ చర్చిస్తుందన్నారు ఏ పార్టీ కూడా ఉచితాలను వ్యతిరేకించదన్నారు. ఈ రోజుల్లో అందరికీ ఉచితాలు కావాలని, ఫలానా పార్టీ అని పేరు చెప్పను కానీ అన్ని పార్టీలూ వీటి నుంచి లబ్ధి పొందుతున్నాయని చీఫ్ జస్టిస్ NV రమణ పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజనం, పేదలకు రేషన్‌ నుంచి ఉచిత కరెంటు వరకు అనేక ఉచితాలు ఉన్నాయని వీటన్నింటినీ నిషేధిస్తూ ఏకరూప ఆదేశాలివ్వరాదని సిబల్‌ తెలిపారు. వీటిలో కొన్ని సంక్షేమ పథకాలు బలహీన వర్గాలకు అవసరమని చెప్పారు. మిగతావి ప్రజాకర్షక స్కీములని వెల్లడించారు. భాగస్వాములందరి అభిప్రాయాలు తెలుసుకోనిదే తాము ఎలాంటి ఆదేశాలూ జారీ చేయమని చీఫ్‌ జస్టిస్‌ NV రమణ స్పష్టం చేశారు. ఏ విధమైన మార్గదర్శకాలూ ఇవ్వడం లేదన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని.. వివిధ వర్గాలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని వాటి అమలుపై ఈసీ, కేంద్రమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories