INDIA Alliance: సీట్ల పంపకాలపై కసరత్తు వేగవంతం చేసిన ఇండియా కూటమి

The India Alliance Has Accelerated The Exercise of Seat-Sharing
x

INDIA Alliance: సీట్ల పంపకాలపై కసరత్తు వేగవంతం చేసిన ఇండియా కూటమి

Highlights

INDIA Alliance: లోక్‌సభ సీట్ల సర్దుబాటు దిశగా అడుగులు వేస్తోన్న కూటమి నేతలు

INDIA Alliance: విపక్ష కూటమి ఇండియా లోక్‌సభ సీట్ల పంపకాలపై కసరత్తును వేగవంతం చేసింది. సీట్ల సర్దుబాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మొదట ఏడు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై దాదాపుగా ఒప్పందం కుదిరింది. మహారాష్ట్ర, బీహార్‌, పంజాబ్‌, ఢిల్లీ, గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ ఒక అవగాహనకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌తో కాంగ్రెస్‌ నేతలు చర్చలు ప్రారంభించారు. మహారాష్ట్రలో అయితే మంగళవారం శివసేన ఉద్దవ్‌ థాక్రే, కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం రోజు ముంబై వేదికగా దాదాపు మూడు గంటలపాటు భేటీ అయి సీట్ల సర్దుబాటుపై చర్చించారు.రాష్ట్రంలోని 48 లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై తమ మధ్య ఒక అవగాహన కుదిరిందని ప్రకటించారు.

సీట్ల షేరింగ్‌లో భాగంగా మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌ చెరి 20 సీట్లకు పోటీ చేయనున్నాయి. ఎన్‌సీపీకి 6 సీట్లు, ప్రకాశ్‌ అంబేద్కర్‌ నేతృత్వంలోని వంచిత్‌ బహుజన్‌ అగాధీకి రెండు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. అటు బీహార్‌లోనూ పొత్తులు ఖరారయ్యాయి. జనతాదళ్‌ (యు), ఆర్‌జేడీలకు చెరి 17 సీట్లు, కాంగ్రెస్‌కు 4, సిపిఐ(ఎంఎల్‌)కు రెండు, సీపీఐకు ఒక సీటు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో కూడా ఆప్‌కు, కాంగ్రెస్‌కు మధ్య సీట్ల ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్‌కు 3 లేదా 4 సీట్లు ఇచ్చేందుకు ఆప్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. గుజరాత్‌, గోవాలో చెరొక సీటు, హర్యాణాలో 4 సీట్లు కేటాయించాలని ఆప్‌ కాంగ్రెస్‌ను కోరుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఆరు సీట్లు కేటాయించేందుకు ఆప్‌ సుముఖంగా ఉంది. కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య తుది చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగియనున్నాయి.

మరోవైపు ఢిల్లీ వేదికగా ఉత్తరప్రదేశ్‌లోని ఇండియా కూటమి పార్టీల ప్రతినిధులు భేటీ అయి సీట్ల పంపకాలపై చర్చించారు. సరైన దిశలోనే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లారిటీ వస్తుందని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. తదుపరి దశ సమావేశాల తర్వాత సీట్ల పంపకాలపై కీలక నిర్ణయం వెలువడొచ్చన్నారు.

మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ నివాసంలో ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై మీటింగ్ జరిగింది. యూపీలో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ మీటింగ్‌లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ ప్రతినిధులు సహా యూపీలోని పలు చిన్న పార్టీల నాయకులు పాల్గొన్నారు. అటు పంజాబ్, ఢిల్లీలలో సీట్ల పంపకాలపై ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఢిల్లీలో 3, పంజాబ్‌లో 6 స్థానాలకు కాంగ్రెస్‌కు వదులుకునేందుకు ఆప్ సిద్ధమైందని తెలుస్తోంది. ఇందుకు బదులుగా హర్యానా, గుజరాత్, గోవాలలో తమకు సమంజసమైన సంఖ్యలో సీట్లను కేటాయించాలనే ప్రపోజల్‌ను కాంగ్రెస్ ఎదుట ఆప్ పెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories