Tension in Manipur : రాళ్లు, తుపాకులతో దాడులు..రణరంగంగా మారిన మణిపూర్‌..కర్ఫ్యూ విధింపు

రాళ్లు, తుపాకులతో దాడులు..రణరంగంగా మారిన మణిపూర్‌..కర్ఫ్యూ విధింపు

CR Reddy
Published on: 9 Feb 2026 7:54 AM IST
Tension in Manipur : రాళ్లు, తుపాకులతో దాడులు..రణరంగంగా మారిన మణిపూర్‌..కర్ఫ్యూ విధింపు
X

Tension in Manipur : మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఉఖ్రుల్ జిల్లాలోని లిటన్ గ్రామంలో ఆదివారం సాయంత్రం రెండు గిరిజన తెగల మధ్య చెలరేగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. రాళ్ల దాడి, కాల్పులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నిషేధాజ్ఞలు విధించింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచే ఉద్రిక్తత బీజాలు పడ్డాయి. లిటన్ గ్రామంలో తంగ్ఖుల్ తెగకు చెందిన ఒక వ్యక్తిపై సుమారు ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. ఈ గొడవను సామరస్యంగా, గిరిజన ఆచారాల ప్రకారం పరిష్కరించుకుందామని బాధితుడు మరియు స్థానిక గ్రామ పెద్ద నిర్ణయించారు. దీనికోసం ఆదివారం సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, బాధితుడి కుటుంబం రాలేదు. దీంతో చర్చలు విఫలమవ్వడమే కాకుండా, పక్క గ్రామం నుంచి వచ్చిన వ్యక్తులు గ్రామ పెద్ద నివాసంపై దాడికి దిగారు.

ఆదివారం సాయంత్రం పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. తాంగ్ ఖుల్ తెగ, కుకీ కమ్యూనిటీల మధ్య రాళ్ల దాడి మొదలైంది. ఒకరిపై ఒకరు విచ్చలవిడిగా రాళ్లు రువ్వుకోవడంతో ఆ ప్రాంతం అంతా బీభత్సంగా మారింది. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఈ క్రమంలోనే లిటన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏడు రౌండ్ల కాల్పులు జరపడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కాల్పుల మోతతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఉఖ్రుల్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ దాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. BNSS-2023 లోని సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) కింద జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

ప్రస్తుతం లిటన్ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతిని నెలకొల్పడానికి మణిపూర్ ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను, పారామిలిటరీ బలగాలను ఉఖ్రుల్ జిల్లాకు తరలించింది. గిరిజన తెగల మధ్య మళ్ళీ పాత గొడవలు రాజుకోకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలపై కూడా నిఘా ఉంచారు. ప్రజలు సంయమనం పాటించాలని, వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

CR Reddy

CR Reddy

Next Story