Swachh Survekshan Awards 2020: ఇండోర్ కు నాలుగోసారి స్వచ్ఛత పురస్కారం..

Swachh Survekshan Awards 2020: ఇండోర్ కు నాలుగోసారి స్వచ్ఛత పురస్కారం..
x
Highlights

Swachh Survekshan Awards 2020: స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ ప్రధమ స్థానాన్ని దక్కించుకుంది.

Swachh Survekshan Awards 2020: స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ ప్రధమ స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. ఇదేకాకుండా అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం వంటి పురస్కారాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి ప్రకటించారు.

దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఎంపికైంది. ఆ తర్వాతి స్థానాల్లో సూరత్, నవీముంబై నిలిచాయి. అలాగే, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి 'ఉత్తమ గంగా పట్టణం'గా మొదటి స్థానంలో నిలిచింది. 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్‌ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి.

రాజధానిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్‌ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికయింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

విజేతలకు ప్రధాని అభినందనలు

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ సర్వేలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలని కోరారు. దీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి)

1. ఇండోర్

2. సూరత్‌

3. నవీముంబై

4. విజయవాడ

5. అహ్మదాబాద్‌

అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి)

1. కరాడ్‌

2. సస్వద్

3. లోనావాలా

పరిశుభ్రమైన రాష్ట్రం(100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ)

1. ఛత్తీస్‌గఢ్

2. మహారాష్ట్ర

3. మధ్యప్రదేశ్‌

పరిశుభ్రమైన రాజధాని..

1. న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌

కంటోన్మెంట్‌లలో పరిశుభ్రమైనవి

1. జలంధర్‌ కంటోన్మెంట్‌ బోర్డ్

2. ఢిల్లీ కంటోన్మెంట్‌ బోర్డ్

3. మీరట్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌

► పౌరుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ 'ఉత్తమ మెగా సిటీ'గా ఎంపికైంది.

► పౌరుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్‌ ఎంపికైంది.

► ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ మొదటి ర్యాంకు సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories