వారి నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేయొద్దు సుప్రీం కీలక ఆదేశాలు

వారి నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేయొద్దు సుప్రీం కీలక ఆదేశాలు
x
Highlights

వలస కూలీల ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ప్రయాణ ఖర్చులు వసూలు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

వలస కూలీల ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ప్రయాణ ఖర్చులు వసూలు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.లాక్‌డౌన్‌ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసును తీసుకుని విచారించింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించింది.

ఈ మేరకు వలసకూలీలను గుర్తించి, సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలకు ధర్మాసనం సూచించింది. ఈ అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం పేర్కొంది. రవాణా కోసం రిజిస్ట్రేషన్‌, భోజన సదుపాయం, రైళ్ల కోసం ఎదురు చూపులు చూడడం వంటి సమస్యలు గుర్తించామంది. వారి కష్టాలు చూసి కొన్ని మధ్యంతర ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వలస కూలీల నుంచి రవాణా చార్జీలు వసూలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారికి సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది. వలస కూలీల అంశంపై ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని రాష్ట్రాలు కూడా అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

వలస కూలీల నమోదు చర్యను వేగవంతం చేయాలని,త్వరగా స్వస్థలాలకు వెళ్లే రవాణా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నడిచి వెళ్తున్న కూలీలు కనిపిస్తే.. వెంటనే వారిని శిబిరాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంత మంది ఆసక్తి చూపుతున్నారు. విధానాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్‌ 5వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. వలస కూలీల రవాణాకు సంబంధించి కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కోర్టుకు తెలిపారు. రోజుకు 187 రైళ్ల ద్వారా 50 లక్షల మందిని, రోడ్డు మార్గంలో మరో 47 లక్షల మందిని తరలించామని వివారించారు. వారి ప్రయాణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయని తెలిపారు. స్క్రీనింగ్‌ నిర్వహించి క్వారంటైన్‌కు, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. మొత్తం వలస కార్మికుల తరలింపునకు ఎంత సమయం పడుతుందని ఎస్‌జీని ధర్మాసనం ప్రశ్నించగా.. రాష్ట్రాలు నివేదిక సమర్పించాక అవగాహన వస్తుందని చెప్పారు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories