Sileru River: ప్రాణాలు కాపాడుకోవాలని వెళ్లి..ప్రాణం పోగొట్టుకున్నారు

Six Members Killed in Boat Capsize in Sealeru River
x

Image Source (the hans india)

Highlights

Sealeru River: సీలేరు నదిలో పడవల బోల్తా పడిన ఘటన ఆరుగురి మృతి, మృతుల్లో5గురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు.

Sileru River: డబ్బున్నోడు లాక్ డౌన్ వేసినా.. ఇంట్లో బిర్యానీ వండుకుని తింటున్నాడు. లేనోడు.. ఆ డబ్బు కోసం నానా తిప్పలు పడుతున్నాడు. కరోనా కాటు నుంచి తప్పించుకుంటూనే ఇంట్లోవాళ్లకి కనీసం తిండి పెట్టాలి. పని లేకపోతే కడుపు నిండే అవకాశమే లేదు. పని లేదు.. ఇంటికి పోతే కనీసం గంజి అయినా తాగొచ్చని ఊరికి బయలుదేరారు. టెస్టులు చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ చూపించేంత సీన్ అసలే లేదు. టెస్టు చేయించుకోవడానికి డబ్బులుంటే.. తిండికి ఇబ్బందిపడాల్సిన పనేముంది. పాపం పొట్ట చేత పట్టుకుని పొలిమేర దాటాలని చూశారు.. అధికారులు సర్టిఫికెట్లు అడుగుతారని నాటుపడవ ఎక్కారు ప్రాణమే పోయింది. జలసమాధి అయిపోయారు. ఈ విషాదఘటన సీలేరు నదిలో జరిగింది.

వివారల్లోకి వెళితే... సీలేరు నదిలో సోమవారం రాత్రి రెండు నాటు పడవలు మునిగిన ఘటనలో ఆరుగురు జల సమాధి అయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. మరో మహిళ, చిన్నారి గల్లంతయ్యారు. నిన్న రాత్రి వరకు వారిద్దరి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒడిశాలోని కందగుడ, గుంటవాడ గ్రామాలకు చెందిన మూడు కుటుంబాలు మూడు నెలల క్రితం తెలంగాణకు వలస వెళ్లి సంగారెడ్డి ప్రాంతంలోని ఓ ఇటుకబట్టీలో పనికి కుదిరారు. తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో స్వగ్రామాలకు పయనమయ్యారు. సోమవారం రాత్రి 35 మంది సీలేరు చేరుకున్నారు.

అయితే, ఇతర రాష్ట్రాల నుంచి ఒడిశాకు వచ్చే వారికి కొవిడ్ నెగటివ్ రిపోర్టు కానీ, రెండు టీకాలు వేసుకున్న రిపోర్టు కానీ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. లేదంటే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. దీంతో దీనిబారి నుంచి తప్పించుకునేందుకు నాటు పడవల ద్వారా ఒడిశా చేరుకోవాలని వీరు నిర్ణయించారు.

రాత్రి సీలేరు నది వద్దకు చేరుకుని తమ గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు రెండు పడవలు పంపడంతో తొలి విడతలో 17 మంది సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత ఒక పడవలో 11 మంది మరో పడవలో ఏడుగురు కలిసి మొత్తం 18 మందితో పడవలు బయలుదేరాయి.

పడవలు నది మధ్యలోకి చేరుకున్న తర్వాత ముందు వెళ్తున్న పడవలో నీళ్లు చేరాయి. దీంతో భయపడి రెండో పడవలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన రెండు పడవలు నీట మునిగాయి. దీంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. మునిగిన వారిలో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా మరో 8 మంది గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మరణించిన ఐదుగురు చిన్నారుల వయసు 6 ఏళ్ల లోపే కావడం గమనార్హం. మరో మహిళ వయసు 23 సంవత్సరాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories