రేపు శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీం తీర్పు.. అయ్యప్ప సన్నిధిలో భారీ భద్రత

రేపు శబరిమల రివ్యూ పిటిషన్లపై సుప్రీం తీర్పు.. అయ్యప్ప సన్నిధిలో భారీ భద్రత
x
Highlights

చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ చారిత్రాత్మకమైన...

చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ చారిత్రాత్మకమైన శబరిమలపై నిలిచింది. కేరళలోని పత్తనంథిట్ట జిల్లా దట్టమైన అడవుల మధ్య వెలసిన అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై ఇదివరకే విచారణను ముగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సారథ్యంలోని ధర్మాసనం దీనిపై తీర్పు వెలవరించనుంది. ఈ నెల 17వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈనెల 17 నుంచే మకరవిళక్కు వేడుకలు సుప్రీంకోర్టు తీర్పు వెలువడే సమయంలోనే అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని తెరవనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి మండల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమవుతాయని ట్రావెన్ కూర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అయ్యప్పస్వామి మాలను ధరించిన భక్తులు దశలవారీగా శబరిమలకు వెళ్లడం 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అదే సమయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడబోతున్నందున కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. భక్తుల ముసుగులో అసాంఘిక శక్తులు ఆలయానికి వచ్చే ప్రమాదం ఉన్నందున భారీ భద్రతను కల్పించింది.

తీర్పును పున సమీక్షించాలని కోరుతూ ఏకంగా 65 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ ఒకే కేసుగా పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. తుది గురువారం వెలువరించనుంది. అయితే అయోధ్య భూవివాదంపై హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడినందున శబరిమలపై కూడా సానుకూల తీర్పు ఉంటుందనే అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా భారీ భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని 10 వేల మందితో శబరిమల ఆలయానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించినట్లు కేరళ పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్ నాథ్ బెహరా తెలిపారు. అయిదు దశల్లో 10 వేల 17 మంది పోలీసులను భద్రత కోసం మోహరింపజేస్తామన్నారు.

ఓవైపు సుప్రీం తీర్పు, మరోవైపు పూజలు తిరిగి ప్రారంభం కావడంపై ఈనెల 15వ తేదీ నుంచి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 24 మంది పోలీసు సూపరింటెండెంట్లు, సహాయ ఎస్పీలు, 112 డిప్యూటీ ఎస్పీలు, 264 మంది ఇన్ స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్ స్పెక్టర్లను ఇందులో భాగస్వామ్యులను చేసినట్లు చెప్పారు. 8వేల 402 మంది సివిల్ పోలీసు అధికారులను మోహరించామని, వారిలో 307 మంది మహిళా సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు.

ఈ నెల 15 నుంచి 30 వరకు జరిగే తొలి దశ వేడుకకు సన్నిధానం, పంబ, నిలక్కల్, ఎరుమెలి వద్ద 2వేల 551 మంది, 30 నుంచి వచ్చే నెల 14 వరకు జరిగే రెండో దశ వేడుకకు 2వేల 539 మంది, మూడో దశలో 2వేల 992 మంది, నాలుగో దశలో 3వేల 77 మంది చొప్పున బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరితోపాటు సన్నిధానం, నిలక్కల్, పంబ వద్ద అదనంగా ఒక వెయ్యి 560 మంది ప్రత్యేక బలగాలను కూడా మోహరించాలని నిర్ణయించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories