Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది? ఇంట్లో పనివాళ్లు పోలీసులకు ఏం చెప్పారు?


Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసులు ఏం చెబుతున్నారు? అరెస్ట్ అయిన అనుమానితుడికి ఈ ఘటనతో సంబంధం లేదా? సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్....
Saif Ali Khan case: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో శుక్రవారం సాయంత్రం మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కానీ సాయంత్రానికల్లా అరెస్ట్ అయిన ఆ వ్యక్తికి సైఫ్‌పై దాడి ఘటనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. దీంతో ఈ కేసు విచారణ మళ్లీ మొదటికొచ్చింది.
సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్న సద్గురు శరణ్ బిల్డింగ్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో కనిపించిన వ్యక్తి ఫోటోను ముంబై పోలీసులు గురువారమే విడుదల చేశారు. శుక్రవారం ఉదయం బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అదే వ్యక్తి జనవరి 14న షారుఖ్ ఖాన్ నివాసమైన మన్నత్ వద్ద కూడా రెక్కీ నిర్వహించారని పోలీసులు అనుమానిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి సైఫ్ ఇంట్లో దాడి ఘటనకు సంబంధం లేదంటున్నారు.
ఇంతకీ ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? ఎవ్వరికీ కనిపించకుండా నిందితుడు ఆ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు? ఇంట్లో ఉన్న వాళ్ల సహాయంతోనే నిందితుడు లోపలికి వచ్చాడా? నిందితుడు ఏం డిమాండ్ చేశాడు?
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలేం జరిగింది? దాడి ఘటన తరువాత 6వ అంతస్తులో మెట్లు దిగుతున్నట్లుగా కనిపించిన అనుమానిత వ్యక్తి ఆ తరువాత కెమెరాలకు చిక్కకుండా ఎలా మాయమయ్యాడు?
ఈ కేసులో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలేంటి, వాటితో పాటు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.
అప్పుడు సమయం జనవరి 15, బుధవారం అర్ధరాత్రి దాటి 2-2.30 గంటలవుతోంది.
అది ముంబైలోని బాంద్రా ఏరియా... సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, బడాబాబులు ఉండే ఖరీదైన ప్రాంతం అది.
సైఫ్ అలీ ఖాన్ కూడా అక్కడే నివాసం ఉంటారు. సద్గురు శరణ్ అనే 13 అంతస్తుల బిల్డింగ్‌లో చివరి నాలుగు అంతస్తుల్లో సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఉంది. అది క్వాడ్రూప్లెక్స్ బంగ్లా. అంటే నాలుగు వేర్వేరు ఇళ్లకు సమానంగా ఉండే ఒక ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ అన్నమాట.
ఆ ఇంట్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, వారి ఇద్దరు పిల్లలు తైమూర్, జహంగీర్ ఉంటున్నారు. వీరితో పాటే 8వ అంతస్తులో సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ పిల్లలు ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్ ఉంటున్నారు.
వీరే కాకుండా సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్‌ల ఇద్దరు కొడుకులైన తైమూర్, జహంగీర్‌ల బాగోగులు చూసుకోవడానికి ఇద్దరు మహిళలు కేర్ టేకర్స్‌గా పనిచేస్తూ ఇంట్లోనే ఉంటున్నారు. మరో ఐదుగురు సిబ్బందితో కలిపి మొత్తం ఏడుగురు పనివాళ్లు ఉన్నారు.
సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు జహంగీర్ బాగోగులు చూసుకునే ఎలియామ ఫిలిప్ ఆ అర్ధరాత్రి ఏం జరిగిందనే విషయం మొత్తం పోలీసులకు చెప్పారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత జహంగీర్ గదికి సమీపంలోని బాత్రూమ్‌లో ఏదో శబ్ధం వినిపించింది.
ఆ సమయంలో ఇద్దరు మహిళా కేర్ టేకర్స్ అక్కడే నిద్రపోతున్నారు. ఆ శబ్ధం విన్న ఎలియామ ఫిలిప్‌నకు మెలకువ వచ్చింది. లేచిచూస్తే బాత్రూమ్‌లోంచి ఒక వ్యక్తి బయటికి రావడం కనిపించింది.
చూడ్డానికి సన్నగా ఉన్న ఆ వ్యక్తి నేరుగా జహంగీర్ రూమ్ వైపే వెళ్తుండటం చూసి ఫిలిప్ అటువైపు పరుగెత్తారు. జహంగీర్‌ను ఆమె చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో దుండగుడు ఆమెను దూరం నెట్టేశాడు. దుండగుడి చేతిలో ఒక కర్ర, హ్యాక్సా బ్లేడ్ ఉన్నాయి.
అయినప్పటికీ ఫిలిప్ వెనక్కి తగ్గలేదు. జహంగీర్‌ను ఆ దుండగుడి బారి నుండి కాపాడేందుకు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దుండగుడు ఆమెపై కత్తి లాంటి హ్యాక్సా బ్లేడ్‌తో దాడి చేశాడు. ఆమె చేయి మణికట్టుకు గాయమైంది.
జహంగీర్ చిన్న పిల్లాడు కదా... అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు.
జహంగీర్ ఏడుపులు, ఫిలిప్ అరుపులతో అదే గదిలో నిద్రిస్తున్న మరో కేర్ టేకర్ కూడా నిద్ర లేచారు. ఆమె నిద్రలేస్తూనే జరుగుతున్న గొడవను చూసి వెంటనే సాయం కోసం సైఫ్ పెద్ద కొడుకైన ఇబ్రహీంను పిలుస్తూ ఇబ్రహీం... ఇబ్రహీం... అని గట్టిగా అరిచారు. ఇబ్రహీంను పిలుస్తూనే వెళ్లి సైఫ్ అలీ ఖాన్ గది తలుపు తట్టారు.
మరోవైపు ఫిలిప్ ఆ దుండగుడితో పోరాడుతూనే ఉన్నారు. నీకేం కావాలి, ఎందుకొచ్చావ్ అని ఆమె దుండగుడిని నిలదీశారు. అందుకు దుండగుడు బదులిస్తూ తనకు 1 కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాలన్ని ఫిలిప్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.
ఇంతలోనే మరో కేర్ టేకర్ కేకలు విని సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నిద్రలేచారు. వెంటనే జహంగీర్ రూమ్ వైపు పరుగులు తీశారు. వారితో పాటే ఇంట్లో ఉన్న మిగతా పనిమనుషులు కూడా నిద్రలేచి అక్కడికి పరుగెత్తుకొచ్చారు. ఆ పనిమనుషుల్లో ఒకరు పురుషుడు కూడా ఉన్నారు.
జహంగీర్ రూమ్ వద్ద ఆ దుండగుడితో సైఫ్ అలీ ఖాన్ గొడవపడ్డారు. ఈ గొడవలో సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌నకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దాదాపు అరగంటసేపు ఈ ఘర్షణ జరిగింది. సైఫ్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు ఒక బెడ్రూమ్‌లోకి వెళ్లి లోపలి నుండి లాక్ చేసుకున్నాడు.
అదే సమయంలో సైఫ్ కత్తిపోట్లతో బాధపడుతుండటంతో ఇంట్లోని వారంతా ఆయన చుట్టూ చేరారు. అందరూ సైఫ్‌కు ఏమైందా అనే ఆందోళనలో ఉన్న సమయంలోనే దుండగుడు అదును చూసుకుని ఇంట్లోంచి పారిపోయాడు.
అప్పటికే సమయం 3 గంటలు దాటి 10 నిమిషాలవుతోంది.
వీళ్లందరి అరుపులు విన్న ఇబ్రహీం వెంటనే పరుగెత్తుకొచ్చి పనివాళ్ల సహాయంతో తన తండ్రిని ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
గురువారం తెల్లారేసరికి సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిందనే వార్త సంచలనం సృష్టించింది.
ఆ తరువాత ఏం జరిగిందంటే...
సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో ముంబైలోని బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సైఫ్ ఉంటున్న బిల్డింగ్ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు మొదట ఈ దర్యాప్తులో అనేక అనుమానాలు తెరపైకొచ్చాయి.
ఇంట్లో వారి సాయంతోనే నిందితుడు రాత్రి పొద్దుపోక ముందే ఇంట్లో చేరి దాక్కుని ఉంటాడని అనుమానించారు.
ఎందుకంటే పోలీసులు చూసిన సీసీటీవీ దృశ్యాల్లో ఈ దాడి తరువాత ఒక గుర్తు తెలియని దుండగుడు బిల్డింగ్‌లోని 6వ అంతస్తులో మెట్లు దిగి వెళ్తుండటం కనిపించింది. కానీ అర్ధరాత్రి ఎవ్వరూ కొత్తగా సైఫ్ ఇంట్లోకి వచ్చినట్లు ఆధారాలు కనిపించలేదు. దాంతో దుండగుడు బుధవారం రాత్రి పొద్దుపోక ముందే ఇంట్లోకి దూరి ఉంటాడని అనుమానించారు.
అలా జరగలాంటే ఆయనకు ఇంట్లో పనివాళ్ల సాయం కూడా ఉండే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సైఫ్ ఇంట్లోనే ఈ దాడికి కుట్ర జరిగిందని బ్రేకింగ్ న్యూస్ వైరల్ అయింది.
కానీ శుక్రవారం మధ్యాహ్నం అవే సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఇంకో కొత్త దృశ్యం వెలుగులోకొచ్చింది. ఈ దాడి తరువాత మెట్లు దిగి వెళ్లిపోతున్నట్లుగా కనిపించిన వ్యక్తే అంతకంటే ముందే పైకి వెళ్తున్నప్పుడు రికార్డ్ అయిన దృశ్యం అది.
అర్థరాత్రి 1:37 గంటల సమయంలో ఆ వ్యక్తి మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నట్లుగా ఆ దృశ్యంలో ఉంది. రికార్డ్ అయిన ఆ దృశ్యం చూస్తే అతడు దాడి జరిగిన సమయంలోనే అక్కడికి వచ్చినట్లుగా అర్థమవుతోంది. దీంతో దుండగుడు ముందే వచ్చి ఇంట్లో దాక్కున్నాడనే అనుమానాల్లో నిజం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేవలం మెట్లు ఎక్కుతూ, దిగుతుండగా మాత్రమే ఆ గుర్తు తెలియని వ్యక్తి కనిపించారు. మరి బిల్డింగ్ లోపలికి వచ్చే చోట, బయటికి వెళ్లే చోట ఉన్న కెమెరాల్లో ఆ వ్యక్తి ఎందుకు కనిపించలేదు? కెమెరాల కంటపడకుండా లోపలికి ఎలా వచ్చాడు, ఎలా బయటికి వెళ్లాడు? అసలు సీసీ కెమెరాల్లో కనిపించకుండా బిల్డింగ్‌లోంచి ఎలా మాయమయ్యాడు? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీ చేయడానికే వచ్చాడా? లేక మరో ఉద్దేశంతో వచ్చాడా?
చూడ్డానికి నలుపు రంగు ఛాయతో సన్నగా, ఐదున్నర అడుగుల ఎత్తుంటాడని అతడిని మొదట చూసిన ఫిలిప్ పోలీసులకు చెప్పారు. ఆ నిందితుడి కోసమే పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిందితుడు చిక్కితే కానీ ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలిసే ఛాన్స్ లేదు.
దాడి చేసిన వ్యక్తి రూపు రేఖలు ఎలా ఉన్నాయంటే..
ఇక సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం విషయానికొస్తే... సైఫ్ ఈ ప్రమాదం నుండి బయటపడినట్లేనని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ దంగె చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. ఐసీయూలోంచి స్పెషల్ రూమ్ కు షిఫ్ట్ చేసినట్లు తెలిపారు. లీలావతి హాస్పిటల్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా నీరజ్ ఉత్తమణి మాట్లాడుతూ... వెన్నెముకకు కేవలం 2 మిల్లీమీటర్ల దూరంలో కత్తి గాయం ఆగిందని, లేదంటే ప్రమాదం తీవ్రత పెరిగేదని చెప్పారు.
మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ ఔటాఫ్ డేంజర్.... ఇప్పుడు కావాల్సిందల్లా ఆ వాంటెడ్ క్రిమినల్ ఎవరు? ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే... చోరీకి వచ్చిన దొంగ తప్పించుకునేందుకు చేసిన దాడి మాత్రమేనా? అంత హై సెక్యురిటీ, అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండే ఆ ఏరియాలోంచి ఎవ్వరి కంటపడకుండా ఎలా తప్పించుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు అసలు సమాధానం తెలియాలంటే నిందితుడు పట్టుబడేవరకు వెయిట్ చేయాల్సిందే.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire