నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష

Rakhi Festival Celebrations
x

నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష

Highlights

Rakhi Festival: అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక

Rakhi Festival: కాలం మారినా దూరం పెరిగినా, చెరగని బంధం.. అన్నా చెల్లెలు అనుబంధం. అన్నా, చెల్లెలు అక్కాతమ్ముళ్ల అనురాగాలకు ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ. జీవితంలో తనకు ఎల్లవేళలా రక్షగా ఉండాలని, సాధకబాధకాల్లో తోడుగా నిలవాలని అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందన్నది చారిత్రక నేపథ్యం. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగలో ఉన్న పరామర్థం అని చెబుతుంటారు అధ్యాత్మిక వేత్తలు.

రాఖీ పండుగ వెనుక చాలానే కథలున్నాయి. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగిందట. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు, తమ వారందరినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి... అమరావతిని దిగ్బంధనం చేస్తున్న రాక్షతరాజుతో యుద్దం చేయాలన్న ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఇంద్రాణిని అనుసరించి రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు రాక్షసరాజును ఓడించి యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. హిందువులంతా సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ..ప్రతియేటా శ్రావణ మాసంలో సోదర సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రతియేటా ఈ పండుగను దేశ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. అలా భారతీయ పండుగలలో రాఖీ పండుగ మరింత స్పెషల్ గా మారిపోయింది. ప్రతియేటా శ్రావణమాసంలో అక్కా చెళ్లెళ్లు పుట్టింటికి వచ్చి ఆచార సంప్రదాయాల ప్రకారం ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని, అన్నా, తమ్ముళ్లకు బొట్టు పెట్టి రాఖీ కడతారు. ఈసందర్భంగా తమతమ అక్కా చెళ్లెళ్లు కట్టిన రాఖీలు స్వీకరించి వారిని సంతోష పపెట్టేలా బహుమానాలు ఇస్తారు స్వీట్లు పంచుకుని సంతోషాలను పంచుకుంటారు. ఆశీర్వవచనాలు అందుకుంటారు. నీకు నేను రక్ష అని చెప్తూనే, నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఎంతో వేడుకగా జరుపుకునే ఈ పర్వదినం గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కారణంగా అంతంతమాత్రంగా జరుపుకున్నామనీ.. ఈ సారి అలాంటి భయం లేకుండా చాలా సంతోషంగా రాఖీ వేడుకలు జరుపుకుంటున్నారు అక్కా చెళ్లెళ్లు.

ఇక సోదరుడికి రాఖీ కట్టలేని రోజు ఆ సోదరి పడే వేదన కూడా అంతాఇంతాకాందంటున్నారు పలువురు యువతులు.. అలాంటి సందర్భమే వస్తే... తమకు సోదరులతో సమానమైన వారికి రాఖీ కట్టి తమ సంతోషాలు పంచుకుంటామని చెబుతున్నారు. ఈ పండుగకు ముందస్తు ప్రణాళికలు వేసుకుని మరీ వెరైటీ రాఖీలు, బంగారు రాఖీలు సేకరించుకుంటామంటున్నారు. తమ తమ సోదరులకు రాఖీలు కట్టడంలో ఉన్న సంతోషం, వాళ్లిచ్చే ఆశీర్వాదాలు తమకెంతో ఆనందాన్ని ఇస్తాయంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories