Rajasthan: కుక్కను తాడుతో కట్టి కారుతో పాటు పరిగెత్తించిన డాక్టర్

Rajasthan Doctor Held for Cruelty to Animal
x

Rajasthan: కుక్కను తాడుతో కట్టి కారుతో పాటు పరిగెత్తించిన డాక్టర్ 

Highlights

*డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ జోధ్‌పూర్‌ కమిషనర్‌ ఎన్జీవో లేఖ

Rajasthan: ఓ వీడియో.. మనస్సును మెలిపెడుతుంది. మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. పైశాచికత్వం.. ఈ లెవెల్లో ఉంటుందా అని ప్రశ్నలు వేస్తుంది. తమలోని సైకోయిజాన్ని ఇలా కూడా బయటపెడతారా అనిపిస్తుంది. ఇలా ఎంత అనుకున్నా తక్కువే. చెప్పుకోడానికి డాక్టర్ కొలువు వెలగబెడుతున్న ఓ మనిషి లాంటి మృగాన్ని.. యావత్ దేశం ద్వేషిస్తోంది. అసలా డాక్టర్ ఎవరు..? ఆయన చేసిన పనేంటి..?

ఓ కుక్కను తాడుకు కట్టేసి.. దాన్ని తాను పట్టుకుని.. కారులో దూసుకెళ్తున్న ఓ మనషి చేసిన నిర్వాకం ఇది. సోషల్ మీడియాలో వెలుగుచూసిన ఈ వీడియో.. క్షణాల్లో వైరల్ అయ్యింది. యావత్ దేశం దీనిపై చర్చిస్తుంది. ఆ పనిచేసిన వాడిని ద్వేషిస్తోంది. కారు వేగాన్ని అందుకోలేక ఆ కుక్క పడుతున్న అవస్థలు చూస్తే.. ఎంతటి కఠిన హృదయం ఉన్నవాడినైనా కరిగిస్తుంది. కానీ కారులో ఉన్న వ్యక్తికి మాత్రం ఆ మూగజీవిపై కరుణ లేకుండా పోయింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనలో.. కుక్క మెడకు తాడు కట్టి.. కారుతో ఈడ్చుకెళ్లిన ఆ వ్యక్తి ఓ డాక్టర్. కారు వెనుకున్న ఓ బైకర్.. ఈ వీడియోను తీయడంతో.. ఈ దారుణం వెలుగుచూసింది. వీడియోను బట్టి చూస్తే.. రద్దీ ఎక్కుగా ఉన్న రోడ్డుపై ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కుక్క మెడకు పొడవైన తాడు కట్టడంతో అది రోడ్డుకు అటు ఇటు పరిగెత్తుతూ.. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది.

వీడియో తీసిన బైకర్‌ వేగంగా వెళ్లి కారును అడ్డగించాడు. దీంతో కారు ఆగింది. వెంటనే గుమిగూడిన స్థానికులు.. కుక్క మెడకు ఉన్న తాడును తొలగించారు. ఎన్‌జీవోకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారొచ్చి ఆ శునకాన్ని ఆసుపత్రికి తరలించారు. కుక్క కాళ్లకు చాలాచోట్ల ఫ్రాక్చర్ అయినట్లు.. వెటర్నరీ వైద్యులు తెలిపారు. డాగ్ హోం ఫౌండేషన్ అనే ఎన్‌జీవో.. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది.

ఈ శునకాన్ని కారుతో ఈడ్చుకెళ్లిన ఆ డాక్టర్ పేరు రజనీష్ గల్వా అని.. ఎన్జీవో పేర్కొంది. ఆ వీధికుక్క నిత్యం తన ఇంటి వద్దే కాపు కాస్తుండటంతో.. దానిని వదిలించుకోవడానికే.. ఇలా చేసినట్టు రజనీష్ చెప్పినట్లు.. ఎన్జీవో తెలిపింది. డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.. జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది. అలాగే అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థను, జంతు హక్కుల కార్యకర్త, ఎంపీ మేనకాగాంధీకి ట్యాగ్ చేసింది. ఆ తర్వాత డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద కేసు నమోదైనట్లు తెలిపింది.

ఇక ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఈ సమాజంలో ఉండాల్సిన వారు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories